రమణ ఒక అనాధ. అలాగే కటిక దరిద్రుడు కూడా. ఏపూట కాపూట తిండికి తడుముకోవలని వచ్చేది. అంత దీనస్థితిలో ఉన్నప్పటికీ, రమణ నిత్య సంతోషి. పనీపాటా లేకుండా, ఆస్తిలేకుండా సంపాదన కూడా లేకుండా, బతకడం కష్టమని ఉపాధి కోసం పక్కనే ఉన్న నగరానికి బయల్దేరాడు. నగర శివార్లలో ప్రవేశించగానే ఓ ప్రకటన అతణ్ణి ఆకట్టుకుంది.
ఓ జమీందారు తన తల్లిదండ్రుల స్మారకార్ధం చిత్రమైన ప్రకటన చేసి పెట్టాడు. ” అనాధ ఎవడైనా చచ్చిపోయి నట్టయితే, అంత్యక్రియల నిమిత్తమై ఖర్చులకోసం దివాణపు ఖజానాలోనించి రెండు వేల రూపాయిలు ఇస్తాము” అని పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉంది.
ఆ ప్రకటనలో రమణకి చాలా కష్టనష్టాలు కనిపించాయి. ఆలోచన మంచిదే. కానీ ఉచిత పధకాలు చాలా వరకు సోమరిపోతుల్ని తయారుచేస్తాయి. ఆ విషయం జమీందారుకి చెప్పాలని భావించాడు. వెంటనే జమీందారు వద్దకు పోయి ప్రకటనలో లోతుపాతుల్ని పూసగుచ్చినట్టు వివరించాడు. అయినా జమీందారు వినలేదు.
”తల్లిదండ్రుల పేరుమీద పుణ్యకార్యమిది. మా శాసనం చచ్చిపోయినవాళ్ళ కోసమే గాని, బ్రతికున్న వాళ్ళను ఉద్దేశించి ఏర్పరచింది కాదు. బ్రతికున్నవాళ్ళకేం, కష్టపడి సంపాదించుకుంటారు. దిక్కూ మొక్కూ లేని అనాధలను ఉద్దరించటానికని ఈ శాసనం సష్టించాము. కనుక నీవు వెళ్ళిపో, నీకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు” అని చెప్పాడు.
అప్పుడు రమణ మనసులోనే ఒక పథకం వేసాడు ” అయ్యా…మీరు నన్ను బ్రతికున్నవాడిగా లెక్క వేను కుంటున్నారు కాబోలు, రకరకాల అంటువ్యాధుల మహమ్మారుల నుంచి ఎన్నో రుగ్మతలు ఎదుర్కొన్నాను. ప్రస్తుతం జీవచ్చవం అనొచ్చు. కొద్దిరోజుల్లో పూర్తిగానే చచ్చిపోవచ్చు. ఆ కాస్త మాటా తమ చెవిని బడటానికి ఎంతో కాలం పట్టదుకూడాను” అన్నాడు.
”సరే, అంత్యక్రియల సంగతి మేము చూసుకుంటాములే” అన్నాడు జమీందారు.
అందుకు రమణ ” అయ్యో అంత తేలికగా సెలవిస్తున్నారేమిటి? ఒక వేళ నేనుపూర్తిగా చచ్చిపోయానను కోండి. తమ శాసనం ప్రకారం రెండు వేల రూపాయిలూ ఇవ్వక తప్పదుకదా! అందులో సగం పైకం అంటే ఒక్క వేయి రూపాయిలు ఇప్పుడు నాకు దయ చేస్తారంటే, నేను తమ రాజ్యం విడిచి మరొకచోటికి వెళ్ళిపోతాను. అలాచేయటం వల్ల తక్కిన వేయి రూపాయిలూ తమ ఖజానాలోనే ఉండిపోతాయి. ఆదంతా తమకు ‘ఆదా’ అన్నమాటే కదా!” అని జమీందారుకు నచ్చచెప్పాడు. జమీందారు ససేమిరా అన్నాడు.
తనకి ఎవరు సాయం చేస్తారంటూ సత్రంలో ఉన్న వాళ్లని రమణ వాకబు చేసాడు. నగరంలో తిండి కాస్త దొరుకుతుందేమో కానీ, డబ్బులు మాత్రం ఎవరికీ ఊరికే ఇవ్వరని చెప్పారు అక్కడి వాళ్ళు.
‘ఎలాగైనా సరే, జమీందారు దగ్గర డబ్బు వసూలు చేసి వస్తానని, అలాగే మనుషులు చచ్చాక డబ్బు ఇచ్చే ప్రతిపాదన జమీందారు చేతే తీయించేస్తా’నని పందెం కట్టి సత్రం నుంచి బైటపడ్డాడు. సరాసరి జమీందారు ఇంటి ముందు చేరి వేయిరూపాయలు ఇవ్వాలని వేడుకోవడం మొదలుపెట్టాడు.
”మీరు చచ్చినవాళ్ళకు సాయం చేయడం మంచిదే. కానీ బతికున్నవాళ్ళ అవసరాలకు సాయం అందిస్తే అది నాలాంటివారికి బతుకుతెరువు చూపిస్తుంది. నేనూ, నా వంశం మిమ్మల్ని కీర్తిస్తూ కాలం వెళ్ళదీస్తాం. చచ్చాక రెండు వేలు ఇచ్చేకన్నా ఇప్పుడు సగం అంటే వేయిరూపాయలిస్తే – నేను వద్ధిలోకి వచ్చి, మీ రుణం తీర్చుకుంటాను. నా దగ్గర డబ్బులూ సంసారం ఉండటం వల్ల ‘అనాధ ప్రేత సంస్కారం’ అనే మాటే ఉండదు మీ ఖజానాకి. అసలు ఇబ్బందే రాదు కదా… కొంచెం ఆలోచించండి”. అంటూ మళ్ళీ పాతపాటే పాడసాగాడు.
జమీందారుకు రమణ తర్కం నచ్చింది. అలాగే జాలి కూడా వేసింది. అందుకే వేయి రూపాయలు ఇచ్చి వ్యాపారం చేసుకోమన్నాడు. సత్రంకొచ్చి తాను గెలిచానని తన చుట్టూ చేరిన వాళ్ళదగ్గరా డబ్బు తీసుకున్నాడు. పందెం గెలిచిన డబ్బూ, జమీందారు ఇచ్చిన డబ్బుతో హాయిగా పనీపాటా మానేసి జీవించసాగాడు.
ఇంతలో ఆ పట్టణమంతటా మహమ్మారి లాంటి అంటువ్యాధి వ్యాపించి, రెండు రోజులలో సగం మందిని తుడిచిపెట్టి వేసింది. జమీందారు తన దివాణంలో ఉన్న ఆస్తి అంతా ఈ మహమ్మారి వల్ల జరిగే అంత్యక్రియలకే అయ్యేటట్లు ఉందని భావించి ఊరు ఖాళీచేసి పోయి ఎక్కడైనా ప్రాణం రక్షించుకోమంటూ ప్రజలకు జమీందారు దండోరా వేయించాడు.
అప్పుడు రమణ జమీందారు వద్దకు వెళ్ళి, ”అయ్యా…ఇదివరకే నేను చచ్చిపోవలసింది. తమరు కరుణించి నన్ను కాపా డారు. ఇప్పుడు మరొక చావు వచ్చి పడింది” అంటూ దొంగ ఏడుపు మొదలుపెట్టాడు
” ఏమిటి యింకా ఆలోచిస్తూ కూర్చున్నాపు? అలస్యం చేయకు, ఊరు వదలి వెళ్ళిపో. ప్రాణం రక్షించుకో” అంటూ జమీందారు వాడిని వేగిర పెట్టాడు.
”ఇప్పుడు నావద్ద పక్క ఊరు వెళ్ళేందుకు కూడా డబ్బులేదు. ఏ ఊళ్ళోనూ చస్తే పాతిపెడతారేమో కానీ ఇంత ఘనంగా అంత్యక్రియలు చేయరు. నేను మీ దగ్గరే ఉంటాను. వేయి రూపాయలు వ్యాపారంలో నష్టం వచ్చి ఖర్చయి పోయాయి. కదలిపోదామంటే మహమ్మారి ముంచుకు వస్తూన్నది. ఎవరిని కబళించుకుపోతుందో తెలియదు. ఈసారి చావటమే తప్పనిసరి. ఖజానాలో మళ్లీ నాకోసం రెండు వేల రూపాయిలు ఖాళీ. పాపం ఇదివరకే నాకు వేయి రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అంత్యక్రియలకి రెండు వేలు…అంటే నా వల్ల మీకు మూడువేల రూపాయలు నష్టం అని ఆలోచిస్తున్నాను” అన్నాడు.
అప్పుడు జమీందారు వానిని మెచ్చుకుంటూ ”భేష్. నాకు కళ్ళు తెరిపించావ్. అనాధ శవాలకి ఊరి వాళ్లంతా సాయం చేస్తారు. కానీ డబ్బుండీ బతికున్నవాళ్ళకి సాయం చేయకపోవడం మానవత్వం అనిపించుకోదు. నీవు చిన్నవాడివేగాని, తెలివితేటలకు పెద్దవాడివే. సంతోపించాం. నీవు దివాణంలో ఒక ఉద్యోగిగా ఉండవచ్చు. అన్నాడు.
ఆనాటినించి రమణ తన హయాములో, బతికిచెడ్డవాళ్ళకి ఆలంబనగా నిలిచాడు. శ్రమకు ఆహారం, కషికి ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. అనుచిత పధకాలకు స్వస్తి పలికాడు.
సాయి ఆదిత్య వైనతేయ



