ఆ రోజు ఆగష్టు 15. బ్రిటిష్ వారి దాస్య శంఖలాల చెర నుంచి విడివడి, భారత దేశం స్వేచ్చా వాయువులను పీల్చుకున్న స్వాతంత్య్రదినోత్సవం రోజు. ఉదయం ఏడు గంటల సమయం. మల్లెపువ్వు లాంటి తెల్లని యూనిఫామ్ వేసుకుని, కుడిపక్క ఛాతీ మీద చొక్కాకు జాతీయ జెండాను ధరించి, పిల్లలందరూ పాఠశాలలోకి వస్తున్నారు. అందరి చేతుల్లో రకరకాల పూలు ఉన్నాయి. తెచ్చిన పూలలో కొన్నింటిని జెండాలో కట్టి, మిగిలినవి జెండా కొయ్య కింద గీచిన దేశ పటంలో అలంకరిస్తున్నారు పి. టి. మాస్టర్. ఇంకాసేపట్లో హెడ్ మాస్టర్, ప్రత్యేక అతిధులు వస్తారు. పాఠశాల ప్రాంగణం అంతా పిల్లల కేరింతలతో కోలాహలంగా ఉంది.
హెడ్మాస్టర్ గదిలో పనుండి వెళ్ళొస్తున్న కరుణ టీచర్ టక్కున ఆగిపోయింది అక్కడి దశ్యం చూసి. ”నిఖితా..” అంటూ అరిచింది. ఆ పిల్ల బిత్తరపోయి చూసింది.
”అక్కడ అందరూ జెండా వందనానికి వెళుతుంటే, ఇక్కడ నువ్వొక్కదానివే తరగతి గదిలో కూర్చుని సెల్ ఫోన్ చూస్తున్నావేంటి?” టీచర్ ప్రశ్నతో తడబడింది నిఖిత.
”అది.. అది.. టీచర్” అంటూ నీళ్ళు నములుతోంది. ఐదో తరగతి చదువుతున్న నిఖిత.
”ఈ ఫోన్ ఎవరిది. ఏం చూస్తున్నావసలు?” అంటూ నిఖిత చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంది టీచర్. యూ ట్యూబ్‌లో ఏవో పిచ్చి రీల్స్ చూస్తోందాపిల్ల. ”టీచర్.. ఆ ఫోన్ మా అమ్మది. ఇచ్చేయండి. ఇంటికి తీసుకెళ్ళకపోతే మా అమ్మ కొడుతోంది” ఆ పిల్ల మాటల్లో కాస్త నిర్లక్ష్యం. ముందున్న భయం లేదు ఆ పిల్ల కళ్ళల్లో.
”మీ అమ్మకు నేనిస్తాను. ముందు నువ్వు అసెంబ్లీ హాల్ దగ్గరకి వెళ్ళు. జెండా వందనానికి సమయం అయింది” అంటూ ఫోన్ తన బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోయింది కరుణా టీచర్. ఫోన్ తీసుకున్నందుకు టీచర్ని తిట్టుకుంటూ వెళ్ళింది నిఖిత. హెడ్మాస్టర్, ముఖ్య అతిధులు, టీచర్స్, విద్యార్థుల అందరి సమక్షంలో జెండా వందనం కార్యక్రమం చాల ఘనంగా జరిగింది. పెద్దలు, పిల్లలు స్వాతంత్య్ర దినోత్సవం గురించి ఉపన్యాసాలు చేసారు. పిల్లలకి మిఠాయిలు పంచిపెట్టారు.
ఆ రోజు సాయంత్రం నిఖిత వాళ్ళ ఇంటికి వెళ్ళింది కరుణా టీచర్. పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల వచ్చే అనర్ధాల గురించి చెప్పి, ఇక ఎప్పుడూ నిఖితకు ఫోన్ ఇవ్వొద్దు. మరీ మారం చేసి అడిగితే, ఫోన్ ఇచ్చినా, ఆ పిల్ల ఏం చూస్తోందో ఒక కంట కనిపెట్టి ఉండండి” అని వాళ్ళ అమ్మకు చెప్పి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు క్లాసులోకి కరుణా టీచర్ వచ్చింది. ”పిల్లలూ ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీకు తెలిసిన జవాబు చెప్పండి” అంది. పిల్లలందరితో పాటు నిఖిత కూడా ఎదురుచూసింది టీచర్ ఏం అడుగుతుందో అని.
”స్వేచ్ఛ అంటే ఏమిటి? చెప్పండి” అందరివంకా చూస్తూ ప్రశ్నించింది.
”నచ్చినట్లు ఉండడం టీచర్” సందీప్ చెప్పాడు. ”ఎవరి కంట్రోల్లో లేకుండా ఉండడం” రుషిత చెప్పింది.
ముందు రోజు ఇండిపెండెన్స్ డే ఉపన్యాసాలు విన్న పరిజ్ఞానంతో అందరూ తమకి తోచిన సమాధానం చెప్పారు.
”గుడ్. మీ అందరూ స్వేచ్ఛ గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పారు. ఇప్పుడు నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను వినండి” అంటూ నిఖిత వైపు చూసింది కరుణా టీచర్. ఆ పిల్ల తల దించుకుంది. ”స్వేచ్ఛ అంటే మనకి నచ్చినట్లు ఉండడం సరైనదే. అలా అయితే నాకు మీలాగే గౌను వేసుకోవడం చాలా ఇష్టం. మరి నేను స్కూల్‌కి గౌను వేసుకుని, రెండు జాడలు వేసుకుని వస్తే ఎలా ఉంటుంది చెప్పండి?” ప్రశ్నించింది టీచర్.
ఆమె వంక విచిత్రంగా చూశారు అందరూ. ”మీరు అలా వస్తే అందరూ నవ్వుతారు టీచర్” అంది ఓ అమ్మాయి.
”కదా. నాకు ఇష్టమని నేను ఏ పనైనా చేస్తాను అనడం స్వేచ్ఛ కాదు. మనకి రాజ్యాంగంలో దేశ పౌరులు ఏ విధంగా ఉండాలి అనే విధివిధానాలు రాసి ఉన్నాయి. అలాగే మనకి హక్కులతో పాటు, బాధ్యతలు కూడా ఉన్నాయి. ఉత్తమ పౌరులుగా పెరగాలంటే విద్యార్థి దశలోనే మంచి లక్షణాలను అలవరచుకోవాలి. ప్రతి వ్యక్తికి 18 ఏళ్ళు వచ్చాకనే ఓటు హక్కు ఉంటుంది. ఎందుకంటే ఆ వయసుకి పరిపూర్ణంగా, స్వతంత్రంగా ఆలోచించే శక్తి వస్తుందని. అలాగే 18 ఏళ్ళ తర్వాతనే సెల్ ఫోన్ వాడాలి. సెల్ ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సెల్‌ఫోన్ మన సమయాన్ని తినేస్తుంది. ఫోన్ ఎక్కువసేపు చూడడం వల్ల చదువుకునే సమయం తగ్గిపోతుంది. చదువుకునే వయసులో సినిమాలు, చెత్త రీల్స్ చూడడం వల్ల ఉపయోగం లేకపోగా, అవి పిల్లలను చెడు మార్గంలో పోయేలా ఆకర్షిస్తాయి. సెల్‌ఫోన్ చూడడం కన్నా మంచి కథల పుస్తకాలు, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, గౌతమ బుద్ధుడు, అబ్దుల్ కలాం వంటి గొప్పవారి జీవిత చరిత్రలు చదవడం వల్ల మీరంతా గొప్ప వ్యక్తిత్వం గల పౌరులుగా ఎదుగుతారు” చెప్తోంది కరుణా టీచర్. పిల్లలందరూ శ్రద్ధగా వింటున్నారు.
”మరి మీలో ఎంత మంది ఇంటిదగ్గర పెద్దవాళ్ళ సెల్‌ఫోన్ తీసుకుని చూస్తున్నారు”
ఇద్దరు, ముగ్గురు పిల్లలూ భయంగా చేతులు ఎత్తారు. తర్వాత మెల్లగా అన్ని చేతులు పైకి లేచాయి.
”అంటే మీరంతా ఇంటిదగ్గర సెల్‌ఫోన్ చూస్తున్నారన్నమాట. ఎంత సమయం వధా చేసుకున్నారో ఆలోచించండి. త్వరలో పరీక్షలు వస్తున్నాయి. తరగతి పుస్తకాల పైన శ్రద్ద పెట్టండి. పరీక్షల తర్వాత మిమ్మల్ని మన ఊరి గ్రంథాలయానికి తీసుకుని వెళతాను. అక్కడ మీకు నచ్చిన పుస్తకం తీసుకుని చదువుకోవచ్చు. పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని చదివే ఏర్పాటు కూడా నేను చేస్తాను” అంది కరుణ టీచర్.
”అలాగే టీచర్” అందరూ తలలు ఊపారు.
”మరి, మీరంతా నాకో ప్రమాణం చేయాలి” అంది టీచర్. ”ఏమని టీచర్” అందరిలో ఆత్రుత కనపడింది.
”ఈ రోజు నుంచి మేము సెల్‌ఫోన్ చూడం అని నాకు మాట ఇవ్వండి. అలా మాట ఇవ్వాలనుకున్నవారు చేయి పైకెత్తండి” అనింది టీచర్.
”పిల్లలందరూ చేతులు పైకి ఎత్తారు. రెండవ బెంచిలో కూర్చుని ఉన్న నిఖిత కూడా చేయి ఎత్తింది. నిఖిత వైపు సంతోషంగా చూసి, అందరివైపు తప్తి నిండిన చూపులను సారించింది.
రోహిణి వంజారి,
9000594630
స్వేచ్ఛ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES