దానికోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధపడే జాతి తెలంగాణ
రైతాంగ సాయుధ పోరాటం సువర్ణాక్షర లిఖితం
రాచరికానికి గోరీకట్టిన రోజు
ప్రజాపాలనను ప్రజలతోనే పంచుకుంటున్నాం
తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం
తెలంగాణ రైజింగ్- 2047 లక్ష్యం : ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ ఉద్యమాల్లోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘స్వేచ్ఛ’ తెలంగాణ ప్రజల జీవన విధానమనీ, ఆ స్వేచ్ఛా సాధన కోసం ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడని జాతి మనదని అన్నారు. అణచివేత, పెత్తందారీతనం, నియంతృత్వం, బానిసత్వ సంకెళ్లను బద్ధలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఘన నివాళి అర్పిస్తున్నామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలుత గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు. అనంతరం పబ్లిక్‌గార్డెన్‌లో జరిగిన సభలో సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 రాచరికానికి గోరీ కట్టి, తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినమన్నారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని చెప్పారు. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం వల్లే ఇప్పుడు మనం ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామని వివరించారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మొదలైన స్వరాష్ట్ర ప్రస్థానం తిరిగి మళ్లీ నియంతృత్వ నిర్భంధంలోకి జారి పోయిన తీరు గడచిన పదేండ్లలో చూశామన్నారు. ఆనాటి సాయుధ పోరాట స్ఫూర్తితోనే నిన్నటి నియంతృత్వ పాలనను ఓడించి, ప్రజా పాలనను తెచ్చుకున్నామన్నారు. అందుకే డిసెంబర్ 7, 2023 కూడా భవిష్యత్ తరాలకు గుర్తుండి పోతుందని చెప్పారు.
ప్రజా ఆకాంక్షల మేరకే పాలన
అహంకారపు ఆలోచనలు, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి తమ పాలనలో తావు లేదని సీఎం స్పష్టం చేశారు. కష్టమైనా, నష్టమైనా ప్రజలతో పంచుకుంటున్నామనీ, ప్రజల ఆకాంక్షలు, వారి ఆలోచననే ప్రమాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. తప్పులుంటే సరిదిద్దుకుని పేదల ముఖంలో ఆనందమే లక్ష్యంగా సంక్షేమ చరిత్రను తిరగరాస్తూ ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ఏడు దశాబ్ధాలుగా తెలంగాణ ఆశిస్తోన్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని నొక్కి చెప్పారు. అభివద్ధిలోనే కాదు.. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా ఉంటుందన్నారు.
విద్య వజ్రాయుధం
విద్యే మన విజయానికి వజ్రాయుధం అనీ, ఆ లక్ష్యంతోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీలు వంటి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. విద్యపై పెట్టే ఖర్చును భవిష్యత్తు తెలంగాణకు పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి తెలంగాణ వీర వనితలు పోరాటంలో ముందుడి నాయకత్వ పటిమను చాటారనీ, వారి స్ఫూర్తితో తెలంగాణలోని కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. మహిళలతో ఏర్పాటు చేసిన మార్టులు, పెట్రోల్ బంకులు లాభాల్లో నడుస్తున్నాయన్నారు. హరిత విప్లవం నుంచి ఉచిత విద్యుత్ వరకు, రుణమాఫీ నుంచి రైతు భరోసా వరకు రైతుల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా తెలంగాణలో 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణలను మాఫీ చేశామన్నారు.
ఇందిరమ్మ రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసి పెట్టుబడికి భరోసా ఇచ్చామని గుర్తుచేశారు. సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామనీ, రైతుల నుంచి చివరి గింజవరకు ధాన్యాన్ని కొన్నామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం 29 లక్షల వ్యవసాయ మోటార్లకుగానూ రూ.16,691 కోట్ల సబ్సిడీని చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు 60 వేల ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు సహా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. 2027 డిసెంబర్ 9 నాటికి ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేస్తామని చెప్పారు. 2035 నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మోడీకి సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా సీఎం ట్వీట్ చేశారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో దేవుడు ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.