నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు స్వాతంత్య్రోత్సవ శుభాకాంక్షలు తెలిపి, త్యాగధనులకు శ్రద్ధాంజలి ఘటించారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందనీ, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకునీ, అన్ని రంగాల్లో కేసీఆర్ నాయకత్వంలో ఎదిగినట్టు తెలిపారు.14వ స్థానంలో ఉన్న రాష్ట్రం పదేండ్లలో అగ్రభాగాన చేరడానికి రైతును రాజును చేయాలన్న కేసీఆర్ సంకల్పమే కారణమని చెప్పారు. 20 నెలల కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధ కలుగుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ రైతులు యూరియా కోసం చాంతాడంత లైన్లలో చెప్పులు పెట్టి క్యూ కడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ పాత కాంగ్రెస్ రోజులను తెచ్చారని విమర్శించారు. స్వాతంత్య్రం అంటే సొంతంగా పరిపాలించుకోవడమే కాదు, ఆత్మగౌరవంతో బతకడం కూడా అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయిందనీ, తన స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయిందనీ, ఢిల్లీ కిరాయి పాలన మొదలై ఢిల్లీ పార్టీల పెత్తనం నడుస్తుందని అన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అనీ, సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి, ఆత్మగౌరవంతో బతకాలి, పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న ప్రొఫెసర్ జయశంకర్ మాటలను ఉటంకించారు. ఇవన్నీ జరగాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్షా అని ఆయన గుర్తుచేశారు.
కేటీఆర్ ప్రగాఢ సంతాపం
తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ మాతమూర్తి మరణం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. జితేందర్ కుటుంబానికి ఇది తీరని లోటని ఆయన అన్నారు. ఈ క్లిష్ట సమయంలో వారి మాతమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలనీ, కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని కేటీఆర్ ప్రార్థించారు.
స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి : కేటీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES