Monday, July 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమిత్రులే శత్రువులు..!

మిత్రులే శత్రువులు..!

- Advertisement -

– ఎలన్‌మస్క్‌ నుంచి మైక్‌ పెన్స్‌ వరకు
– నాడు సలహాదారులు.. నేడు విమర్శలు
న్యూయార్క్‌ :
డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడై ఆరు నెలలైనా గడవక ముందే విమర్శల వలయంలో చిక్కుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విమర్శలు చేస్తున్నవారిలో చాలామంది గతంలో ట్రంప్‌కు అత్యంత సన్నిహితులే. అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నుంచి మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌ దాకా ఎంతో మంది ఇప్పుడు ట్రంప్‌నకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారు. ఆయన అనుసరిస్తున్న పాలనా విధానాలను ఎండగడుతున్నారు. ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’ నుంచి విదేశాంగ విధానాల దాకా ట్రంప్‌ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్‌ స్నేహితుల లిస్టు నుంచి విమర్శకుల జాబితాలోకి చేరిపోయిన ప్రముఖుల వివరాలతో కథనమిది.

ఎలాన్‌ మస్క్‌ – మాజీ ‘డోజ్‌’ సారథి
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపులో అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ కీలక పాత్ర పోషించారు. దీంతో ట్రంప్‌ ప్రెసిడెంట్‌ కాగానే ఎలన్‌ మస్క్‌ కోసం కొత్తగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌) ని ఏర్పాటు చేశారు. దీన్నిబట్టి ఆ ఇద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కట్‌ చేస్తే ఇటీవలే డోజ్‌ విభాగానికి మస్క్‌ రాజీనామా చేశారు. అయితే అధికారికంగా రాజీనామా చేయడానికి ముందు నుంచే ట్రంప్‌ పాలనా విధానాలను ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రత్యేకించి ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’లోని అంశాలను మస్క్‌ తప్పుపట్టారు. చాలా దారుణమైన ప్రతిపాదనలతో ఆ బిల్లు ఉందని విమర్శించారు. మస్క్‌ అంతటితో ఆగకుండా, సెక్స్‌ స్కాండల్‌కు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌ నుంచి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సేకరించిన ఫైల్స్‌ (రిలీజ్‌ చేయనివి)లో ట్రంప్‌ కూడా కనిపించారని సంచలన ఆరోపణ చేశారు. దీంతో మస్క్‌ ఆరోపణలన్నీ అవాస్తవాలు అంటూ వైట్‌హౌస్‌ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. మస్క్‌కు మైండ్‌ దొబ్బిందని, ఆయన కంపెనీల 38 బిలియన్‌ డాలర్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తానంటూ ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే మస్క్‌ ‘ది అమెరికా పార్టీ’ అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశానని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

మైక్‌ పెన్స్‌ – అమెరికా మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌
ట్రంప్‌ తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక మైక్‌ పెన్స్‌ను వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమించుకున్నారు. ఈయన 2017 జనవరి 20 నుంచి 2021 జనవరి 20 దాకా ఈ పదవిలో కొనసాగారు. అమెరికా సైనిక వ్యవహారాలపై మైక్‌ పెన్స్‌కు మంచి పట్టు ఉంది. ఈ అంశాల్లో కీలక సలహాలన్నీ ఈయన నుంచే ట్రంప్‌ తీసుకునేవారు. 2020 నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోయారు. అనంతరం వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌పై ట్రంప్‌ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీనికి సూత్రధారి మైక్‌ పెన్స్‌ అంటూ అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరి స్నేహం 2021 జనవరి 6న దెబ్బతింది. జో బైడెన్‌ ఎన్నికల్లో గెలిచినట్టుగా సర్టిఫికెట్‌ను జారీ చేయొద్దని మైక్‌ పెన్స్‌కు ట్రంప్‌ నిర్దేశించారు. అయితే అందుకు పెన్స్‌ నిరాకరించారు. దీంతో ఆయనపై ట్రంప్‌ బహిరంగంగా విమర్శలు చేశారు. అనంతరం క్యాపిటల్‌ హిల్‌ వద్ద నిరసనకు దిగిన ట్రంప్‌ వర్గీయులు ‘మైక్‌ పెన్స్‌ను ఉరితీయండి’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై పెన్స్‌ అప్పట్లో స్పందిస్తూ రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించాలని భావించే వారు అమెరికా అధ్యక్షుడు కాకూడదన్నారు.

జాన్‌ బోల్టన్‌- జాతీయ మాజీ భద్రతా సలహాదారుడు
జాన్‌ బోల్టన్‌- జాతీయ మాజీ భద్రతా సలహాదారుడుట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడు అయ్యాక జాన్‌ బోల్టన్‌ను అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడిగా నియమించు కున్నారు. 2018 ఏప్రిల్‌ 9 నుంచి 2019 సెప్టెంబరు 10 వరకు ఈ పదవిలో ఆయన కొనసాగారు. ఇరాన్‌, ఉత్తర కొరియాలకు సంబంధించిన విదేశాంగ విధానానికి రూపకల్పన చేసే క్రమంలో ట్రంప్‌, జాన్‌ బోల్టన్‌ల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఈ కీలకమైన పదవిలో జాన్‌ బోల్టన్‌ 17 నెలలే కంటిన్యూ అయ్యారు. తానే రాజీనామా చేశానని బోల్టన్‌ ప్రకటించగా, తానే తీసేశానని ట్రంప్‌ చెప్పుకున్నారు. ‘చూసి నవ్వుకోదగిన మూర్ఖుడు ట్రంప్‌’ అని ప్రపంచ దేశాల నేతలు భావిస్తున్నారని ఒకసారి బోల్టన్‌ విమర్శించారు. ఈసారి ట్రంప్‌ అధికారంలోకి రాగానే జాన్‌ బోల్టన్‌ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేశారు. ఆయన తెలివితక్కువ దద్దమ్మ అని ట్రంప్‌ ప్రభుత్వవర్గాలు భాష్యం చెప్పాయి.

మార్క్‌ మిల్లే- జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మాజీ చైర్మెన్‌
ట్రంప్‌ తొలి హయాంలో అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మెన్‌గా మార్క్‌ మిల్లే సేవలు అందించారు. ఈయన 2015 ఆగస్టు 14 నుంచి 2019 ఆగస్టు 9 వరకు ఈ పదవిలో కొనసాగారు. రాజీనామా చేశాక ఈయన కూడా ట్రంప్‌నకు వ్యతిరేకంగా గళం విప్పారు. ట్రంప్‌ ఒక ఫాసిస్ట్‌ అంటూ ధ్వజమెత్తారు. అమెరికాలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ట్రంప్‌ను అభివర్ణించారు. జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మెన్‌ హౌదాలో చైనాతో మార్క్‌ మిల్లే అప్పట్లో చర్చలు జరిపారు. చైనాపై అమెరికా అణ్వస్త్రాలను ప్రయోగించబోదనే హామీని పునరుద్ఘాటిస్తూ ఆనాడు చైనా సర్కారు పెద్దలతో మార్క్‌ మిల్లే దౌత్యం నెరిపారు. ఈ విషయం తెలియడం వల్ల ట్రంప్‌ భగ్గుమన్నారు. అది తెలివితక్కువ చర్య అని, ఇలాంటి పనిని చేసేవారికి మరణశిక్ష పడుతుందని వార్నింగ్‌ ఇచ్చారు. 2023లో మీడియాతో మార్క్‌ మిల్లే మాట్లాడుతూ ట్రంప్‌ ఒక నియంత అని చెప్పారు.

జాన్‌ కెల్లీ – మాజీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌
ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాన్‌ కెల్లీ అమెరికా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా సేవలు అందించారు. 2017 జులై 31 నుంచి 2019 జనవరి 2 వరకు ఈ పదవిలో ఆయన కొనసాగారు. పదవి నుంచి వైదొలగినప్పటి నుంచి జాన్‌ కెల్లీ, ట్రంప్‌ విమర్శకుడిగా మారిపోయారు. కచ్చితంగా ట్రంప్‌ ఒక ఫాసిస్ట్‌, నియంత అని ఒకసారి ఓ వార్త సంస్థతో ఆయన చెప్పుకొచ్చారు. సానుభూతి పూర్వక ఆలోచనలు ట్రంప్‌లో లేవన్నారు. పాలకులకు హిట్లర్‌ ఒక రోల్‌ మోడల్‌ కావాలని ట్రంప్‌ చాలాసార్లు చెప్పగా, ఆ వ్యాఖ్యలను తాను అప్పటికప్పుడు సరిచేయించానని జాన్‌ కెల్లీ తెలిపారు.

జిమ్‌ మ్యాటిస్‌
– మాజీ రక్షణ మంత్రి

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ తొలి హయాంలో జిమ్‌ మ్యాటిస్‌ రక్షణ మంత్రిగా సేవలు అందించారు. ఈయన 2017 జనవరి 20 నుంచి 2019 జనవరి 1 వరకు ఈ పదవిలో కొనసాగారు. సిరియా నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకోవాలనే ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో జిమ్‌ మ్యాటిస్‌ రాజీనామా చేశారు. 2020లో జిమ్‌ మ్యాటిస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఏకం చేసే కనీస ప్రయత్నం కూడా చేయని అధ్యక్షుడిగా ట్రంప్‌ను తాను చూశానన్నారు. అమెరికా ప్రజలను ఏకం చేయకపోగా, విభజించి ఉంచేందుకు ట్రంప్‌ ఉద్దేశపూర్వకంగానే యత్నిస్తుంటారని ఆయన ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -