Sunday, August 3, 2025
E-PAPER
Homeఅంతరంగంస్నేహం

స్నేహం

- Advertisement -

‘స్నేహం చేయడం నీ బలహీనత అయితే.. ప్రపంచంలో మీ అంత బలవంతులెవరూ లేరు’ అంటారు జార్జ్‌ బెర్నార్డ్‌ షా. స్నేహం అంటే ఓ నమ్మకం.. స్నేహం అంటే ఓ తోడు.. స్నేహం అంటే ఆనందం.. స్నేహం అంటే సహాయం.. ఇలాంటి నిజమైన స్నేహం దొరకిన వ్యక్తిని ఈ సృష్టిలోనే గొప్ప ధనవంతుడిగా చెప్పుకోవచ్చు. స్నేహమంటే ఎంతో విలువైనది. ఎందుకంటే స్నేహం అంత మధురమైనది. స్నేహానికి లింగ, వయో భేదాలు లేవు. ఎన్ని తరాలు మారినా మారనిది స్నేహమే. నేటి తరం యువత రక్తసంబంధం కన్నా స్నేహానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. స్నేహానికి ఎల్లలు లేవన్నది నిజం అంటున్నది నేటి తరం. ‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి’ అన్నారో కవి. నిజమే సృష్టిలో కొన్నిటికి విలువ కట్టలేము. వాటిలో తల్లి ప్రేమ, స్నేహానికి అగ్రస్థానం.
స్నేహం అనేది ఇప్పటి మాట కాదు. ఎన్నో ఏండ్ల నుండి గొప్ప స్నేహితులుగా ఉన్న వారి గురించి మనం వింటూనే ఉన్నాం. స్నేహ గొప్పదనం గురించి చాటినవారు ఎందరో ఉన్నారు. వ్యక్తిగత జీవితంలోనే కాదు సమాజం కోసం పాటుపడిన గొప్ప స్నేహితులు సైతం ఉన్నారు. అలాంటి వారిలో కారల్‌ మార్స్క్‌, ఏంగిల్స్‌ గురించి చెప్పుకోవచ్చు. సమాజంలో ఆర్థిక అసమానతలు సమిసిపోవాలని, సమసమాజం రావాలని ఎంతో తపించారు. ఇలాంటి స్నేహితులు మనకు ఆదర్శం కావాలి. అంతటి గొప్ప స్నేహం గురించి ఎన్నో సినీ గీతాలు ఉన్నాయి. ఎంతో ఆధరణ పొందాయి. ‘ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నువ్వే, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా….’ ఇది ఒక సినీ కవి కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాట. ఇంకొకరు ‘స్నేహమే రా జీవితం స్నేహమే రా శాశ్వతం’ అంటూ అద్భుతంగా స్నేహం గురించి గొప్పగా నిర్వచించారు. దీనిని బట్టి స్నేహంలోని గొప్పతనాన్ని విభిన్న కోణాల్లో ఎందరో మహానుభావులు స్పృశించారనే చెప్పాలి.

అయితే మన ఇంట్లో పెద్దలు ‘ఇలాంటి వారితోనే స్నేహం చేయాలి. అలాంటి వారితో చేయకూడదు’ అంటూ కొన్ని ఆంక్షలు పెడుతుంటారు. చెడ్డవారితో స్నేహం చేయటం వల్ల మనం కూడా చెడిపోతాం అని వారి భయం. కానీ చెడ్డవారితో స్నేహం చేసి వారిని సక్రమమైన మార్గంలో నడిపించడంలోనే ఉంది మనం స్నేహానికి ఇచ్చే విలువ. ఈ విషయాన్ని గుర్తించి నడుచుకుంటే మన స్నేహాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. వాస్తవానికి మన మనసుకు ఎవరు దగ్గరగా ఉంటారో, ఎవరి సమక్షంలో మనకి ప్రశాంతత లభిస్తుందో వారినే మనం స్నేహితులుగా ఎంచుకుంటాం. అయితే మనం ఒక విషాయన్ని గుర్తించాలి. మనలోని లోపాలని కూడా స్వీకరించి, సరిదిద్దేందుకు ప్రయత్నించే వారే మన నిజమైన స్నేహితులు.
స్నేహానికి లింగ భేదమే కాదు కుల మతాలు, చిన్నా పెద్దా తేడాలు కూడా లేవు. ఎవరు ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు. ఆధునికత పెరుగుతున్న కొద్ది స్నేహాల్లో కూడా పలు రకాల మార్పులు వస్తున్నాయి. కలం స్నేహం, ఇంటర్నెట్‌ స్నేహం, ఫోను స్నేహం… అంటూ మార్గాలు ఎన్నున్నా గమ్యం మాత్రం ఒకటే. బాల్యంలో మొదలైన స్నేహబంధం కడదాకా నిలిచి ఉన్న సందర్భాలు ఎన్నో. నిజం చెప్పుకోవాలంటే స్నేహితులు లేని వ్యక్తి పేదవానితో సమానం. స్నేహితులే అసలైన ధనం. మనకి ధైర్యాన్ని ఇచ్చేది.. సంతోషాన్ని ఇచ్చేది స్నేహితులే. మొత్తానికి ఎంతమంది స్నేహితులు ఉన్నారు అనేది కాదు. ఎంతమంది మనసుకి దగ్గరైన స్నేహితులు ఉన్నారనేదే చాలా ముఖ్యం. అలాంటి స్నేహితులు మన జీవితంలో ఉంటే జీవితం మరింత ఆనందమయంగా మారుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -