అన్ని సంవత్సరాల లాగానే, ముగిసిన 2025 కూడా మనకు మరిచిపోలేని కొన్ని పాఠాలు నేర్పింది, సమాధానాలు చెప్పడానికి అసౌకర్యంగా ఉండే కొన్ని ప్రశ్నలు వేసింది, కొన్ని జ్ఞాపకాల ముద్రలు మన మీద వేసింది. యుద్ధాల మధ్య మనం జీవించాం, ఆ యుద్ధాలను ఆపడానికి ప్రయత్నించాం, పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయటానికి జరిగిన ప్రయత్నాలు చూసాం, ఆ ప్రయత్నాలు వమ్ము చేసే ప్రతిఘటనలను కూడా చూసాం. మనము సావధానంగా ఆలోచించి, విశ్లేషించి గుణపాఠాలు తీసుకునే విధంగా ప్రజలు వారి అభీష్టాన్ని వెలిబుచ్చారు.
మొత్తం మీద మరొక సంవత్సరం చరిత్ర పుటల్లోకి జారుకుంది, మన భవిష్యత్తును మనల్ని శోధించుకొనమంటూ ముందుకు నెట్టింది. ఇటీవలి సంక్షభిత సంవత్సరాలు గడిచిపోయాయని, ఆర్థికవ్యవస్థ నిలదొక్కుకున్నదని, ప్రజాస్వామ్యం బలంగానే ఉన్నదని పాలక పక్షాలు మనల్ని నమ్మమంటున్నాయి. కానీ కోట్లాదిమందికి ఇది వట్టిమాటేగానే అనిపించింది. ఎందుకంటే, ధరలు తగ్గలేదు, ఉద్యోగ భద్రత లేదు, ప్రజాస్వామిక పరిధి కుచించుకుపోతూ ఉంది. నిజానికి ప్రభుత్వం చెప్పే గొప్పలకి, రోజువారి అనుభవానికి మధ్య ఆమడ దూరం ఉంది.
గాజా నెత్తిన రుద్దిన ఏకపక్ష శాంతి రాజకీయాలు
గాజాపై ఇజ్రాయిల్ సాగించిన జాతి విధ్వంసక హత్యాకాండతో సామ్రాజ్యవాదం శాంతిని కోరుకునే వ్యవస్థ కాదని సుస్పష్టం అయింది. అమెరికా సామ్రాజ్యవాదం వెన్నుదన్నుతో యూదు దురాహంకారం చేసిన యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనగళాలు వెల్లువెత్తాయి. దీనితో కాల్పుల విరమణ గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సి పరిస్థితి ఏర్పడ్డది. అయితే, కాల్పుల విరమణగా ఏదైతే ప్రకటించారో ఆచరణలో అది ఒకపక్షం మాత్రమే సంయమనం పాటించాలనే డిమాండ్‌గా వుంది. పాలస్తీనియన్ల ప్రతిఘటనను నిర్మూలించేదిగా ఉందిబీ సాకుగా ఎప్పుడూ చెప్పే ”భద్రత” పేరు మీద ఇజ్రాయిల్ సైనిక చర్యను కొనసాగించనిచ్చింది. దౌత్యం పేరుతో బలవంతంగా పాలస్తీనియన్ల మీద రుద్దిన కాల్పుల విరమణ ఇది. ఇజ్రాయిల్ అతిక్రమణలు కొనసాగిస్తుండగా, ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనియన్ల చేసే ప్రతిఘటనను నిరోధించే బలవంతపు కాల్పుల విరమణ ఇది.
ఈ కాల్పుల విరమణ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటంటే పాలస్తీనియన్ల పోరాటాన్ని శాశ్వతంగా బలహీనపరిచే ఏర్పాటును వారి మీద రుద్దటం, ఆ ప్రాంతంలో సామ్రాజ్యవాదపు వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకోవటం. భారత ప్రభుత్వం సిగ్గువదిలేసి, మన విదేశాంగ విధానానికి మరో అవమానకరమైన మచ్చను తెస్తూ, యూదు దురహంకార ఇజ్రాయిల్‌కి మద్దతుగా నిలిచింది. పాలస్తీనా ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా నిలబడే చారిత్రాత్మక స్థానం నుండి దేశం మరింత దూరం జరిగింది. హిందుత్వ మనువాదీ శక్తులకు, యూదు దురాహంకార శక్తులకు మధ్య ఉన్న లోతైన సైద్ధాంతిక బంధాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఈ రెండు శక్తులు కూడా నిరంకుశత్వానికి, మెజార్టీ ఆధిపత్య దుర్మార్గానికి నిర్లజ్జగా మద్దతు ఇవ్వటాన్ని ఇది తేటతెల్లం చేస్తున్నది. అమెరికాతోనూ, దాని సామ్రాజ్యవాదపు ఆలోచనలతోనూ సన్నిహితంగా కలిసి ఉండటంవల్ల దేశం భరించవలసిన భారం ఇది.
ట్రంప్ టారిఫ్‌లు, సామ్రాజ్యవాద శక్తుల మొండిపట్టు
డోనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా ప్రెసిడెంట్‌గా రావటంతో మరింత బలంగా టారిఫ్ యుద్ధాలు, ఆర్థిక పరమైన బెదిరింపులు మొదలయ్యాయి. ఈ వైఖరి అధికారుల్లో ఉన్న వ్యక్తుల మీద, వ్యక్తిత్వాల మీద సామ్రాజ్యవాదం ఆధారపడి ఉండదనే చిరకాల సత్యాన్ని పునరుద్ఘాటించింది. సామ్రాజ్యవాద వ్యవస్థ తనకు తానే జవాబుదారిగానీ, మరొకరికి కాదు అనుకుంటుంది.ట్రంప్ టారిఫ్‌లు అమెరికాకు తిరిగి ఉద్యోగాలు తెచ్చే ఆయుధాలుగా ప్రచారం చేయబడ్డాయి. కానీ, వాటి అసలు ఉద్దేశం బలహీనమైన ఆర్థిక వ్యవస్థల మీదకు, క్రమశిక్షణతో ఉన్న శత్రువుల మీదకు ఒత్తిడిని బదలాయించడం, సామ్రాజ్యవాదపు ఆధిపత్యాన్ని రుద్దటం. సామ్రాజ్యవాదం గురించి భ్రమలు ఉన్నవారికి, ట్రంపు శాంతి ప్రవచనాలు వినేవారికి, అమెరికా చెబుతున్న నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2025 ఒక కనువిప్పుగా ఉండగలదు. మోన్రో సిద్ధాంతాన్ని తిరిగి తీసుకొచ్చి, తక్షణమే దాన్ని పశ్చిమార్థ భూగోళంపై అమలు చేయాలని అమెరికా ఉవ్విళ్లూరుతున్నది. భారత ప్రభుత్వం మన దేశ ప్రయోజనాలను అమెరికా ప్రయోజనాలతో ముడి పెడుతూ, డిఫెన్స్ ఫ్రేమ్ వర్క్‌డీల్, 2025ను మరో పదేళ్లపాటు పొడిగిస్తూ ఒప్పందం చేసుకుంది. సామ్రాజ్యవాద శక్తులతో కలిసి నడవడమనేది మన పరాధీనతకే దారితీస్తుందని గుర్తుంచుకోవాలి.
నిజమైన అభిష్టాలకు దూరంగా ఎన్నికలు
ఈ ఏడాది ప్రపంచంలో అనేకచోట్ల ఎన్నికల ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ గణాంకాలు చర్చించబడ్డాయి, కూటముల గురించి విశ్లేషించారు, గెలుపు, ఓటములు ప్రకటించారు. ఐర్లాండ్ అధ్యక్షలుగా క్యాథరిన్ కొన్నోలి ఎన్నికయింది. ఆమె గృహవసతి, ఇతర ప్రభుత్వ సేవల కోసం, సైనికీకరణకు వ్యతిరేకంగా ఎన్నో ఏళ్లుగా పోరాటం సాగించారు. వామపక్ష రాజకీయాల కోసం నిజాయితీతో కూడిన అంకితభావంతో పోరాడితే ప్రజల ఆమోదం లభిస్తుందని ఈ ఎన్నిక తెలియజేసింది. అమెరికాలో వివిధ స్థాయిల్లో జరిగిన ఎన్నికలలో డెమోక్రటిక్ సోషలిస్టులు గెలవడం ప్రజలు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారనేందుకు ఉదాహరణగా నిలుస్తుంది. కేక్ మీద చెర్రీ ముక్క ఉన్నట్టుగా అంతర్జాతీయ ఆర్థిక రాజధానిగా వున్న న్యూయార్క్ నగరానికి మేయర్‌గా జోహ్రాన్ మమ్దాని ఎన్నికయ్యారు.అయితే పరిస్థితి అంతా ఇంత ఆశాజనకంగా లేదు. అనేక దేశాలలో మితవాద శక్తులు గెలిచాయి. లాటిన్ అమెరికా దేశాల్లో, నిరంతరం అమెరికా జోక్యంతో, కొన్ని వామపక్ష ప్రగతిశీల ప్రభుత్వాల వైఫల్యాలతో మితవాద పార్టీలు తిరిగి బలం పుంజుకున్నాయి.
బొలీవియా, చీలి, హౌందురస్ దేశాలలో అభివృద్ధి నిరోధక మితవాద శక్తులు, వామపక్ష, ప్రగతిశీల శక్తులను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి. అయితే, మితవాదం గెలిచినప్పటికీ, ఈ దేశాలలో 25-30శాతం లోపు ఓట్లను మాత్రమే ఇవి సాధించగలిగగాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మితవాదాన్ని ఓడించి, వామపక్షం తిరిగి తన స్థానాన్ని సాధించుకునే అవకాశం ఇప్పటికీ ఉంది.శ్రీలంకలో స్థానిక ప్రభుత్వాలకు జరిగిన ఎన్నికలు లెఫ్ట్ – రైట్ పార్టీల మధ్య ఉన్న ఘర్షణను విశదం చేశాయి. స్థానిక ఎన్నికల్లో స్వల్పంగా దెబ్బతిన్న జెవిపిఆ ఓటమి నుంచి తేరుకుని, ప్రజల అభిమానాన్ని మరింత సంఘటన పరచుకోగలదని మనం ఆశిద్దాం. ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచలేవు. ప్రజాస్వామ్యం అంటే ఇష్టాయిష్టాలను తెలిపే హక్కు, ప్రభుత్వ విధానాల్లో పాలనలో భాగస్వామ్యం పాత్రను కలిగి ఉండటం. నిలకడైన రాజకీయ సమీకరణ, నిర్వహణ లేకపోతే, కేవలం ఎన్నికల్లో ఓటు వేసే ప్రమాదం బారిన ప్రజాస్వామ్యం పడుతుంది.
యువజనం, నిరసనల వెల్లువ, ఫలితం-ప్రభుత్వాల పతనం
దక్షణాసియాలో, 2025వ సంవత్సరంలో యువత నాయకత్వంలో జరిగిన నిరసనలు ప్రభుత్వాలను అస్థిర పరిచాయి. నేపాల్‌లో యువత నిరాశతో వీధుల్లోకి వచ్చింది. అవినీతి, నిరుద్యోగం, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో తమకు భాగం లేదనే భావన ప్రమాదకరమైన పరిస్థితిని సృష్టించాయి. బంగ్లాదేశ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఆర్థికంగా కఠిన పరిస్థితులు, ప్రజాస్వామిక వాతావరణం కుదించుకు పోవడంతో పాటు, అణిచివేత పెరగటంతో గతేడాది నిరసన జ్వాలలు లేచాయి. అత్యధిక ప్రజానీకంలో ఉన్న అసంతృప్తిని మత ఛాందస శక్తులు తెలివిగా వాడుకున్నాయి. ఈ మత ఛాందస శక్తులు మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. మతపరమైన విభజన సమస్యలకు పరిష్కారం కాదు, ఎవరికీ ఉపయోగపడేది కూడా కాదు. ఈ పరిణామాలు వామపక్షనికి సవాళ్లు విసురుతున్నాయి. యువత ఆగ్రహాన్ని అర్థం చేసుకుని, వారిని సంఘటన పరిచి, నిజమైన ప్రత్యామ్నాయం కోసం రాజకీయ దృక్పథాన్ని వారిలో కల్పించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నిరసనలు తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూసే ప్రచ్చన్న శక్తులు పట్ల జాగారూకత చూపించకుండా, ఆ నిరసనలను గొప్పగా చూపించడం పెద్ద తప్పిదమవుతుంది.
యూరోప్ – బహిరంగ వర్గ పోరాటాల పున:ప్రస్థానం
అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ సమాజాల్లో వర్గ రాజకీయాలు అదుపులో ఉన్నాయనే భావనకు విరుద్ధంగా 2025 యూరప్ అంతటా చెప్పుకోదగిన కార్మికవర్గ ప్రతిఘటనలు జరిగాయి. ఫ్రాన్స్‌లో, గ్రీస్‌లో నిలకడగా సమరశీల కార్మిక వర్గ పోరాటాలు జరిగాయి. ఇటలీ, పోర్చుగల్‌లలో సమ్మెలు జరిగాయి. బ్రిటన్ కార్మికుల ఆగ్రహజ్వాలలను ఈ ఏడాది చవిచూసింది. ఈ పోరాటాలు జరగటానికి వున్న కారణాలు అస్పష్టంగా ఏమీ లేవు. ఎన్నో ఏండ్లు బాధలు పడి పోరాటాల ద్వారా సాధించుకున్న సంక్షేమ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ధరల పెరుగుదలను వేతనాలు అందుకోలేకపోతున్నాయి.
ప్రభుత్వ ధనం కార్పొరేట్లకు లాభాలు కల్పించే దిశగా మళ్లించబడుతున్నది. సామాజిక వ్యయం కత్తిరించబడుతూ, సైనిక వ్యయం పెరుగుతున్నది. ఈ వైరుధ్యాలు మరింత ఎక్కువగా ముందుకు వస్తున్నాయి.ముఖ్యంగా ఈ పోరాటాలు మనకు చెప్పేది ఏమిటంటే, పెట్టుబడిదారీ విధానం వర్గ ఘర్షణలను అదుపులో పెడుతుంది గానీ, పరిష్కరించలేదు. ఈ పోరాటాలు ఒక సాధారణమైన సత్యాన్ని బలంగా చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికవర్గం అనేక దేశాలలో ఇటు వంటి సమస్యలనే ఎదుర్కొంటున్నది. ఈ సమస్యల పరిష్కారం కోసం వివిధ దేశాల కార్మిక వర్గాల మధ్య బంధం నెలకొల్పడం జరుగుతున్నది. అలాగే భౌగోళిక నిరసనలు ఒకదానితో మరొకటి కలుపుకుని సాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
(మిగతా భాగం వచ్చేవారం)
(”పీపుల్స్‌డెమోక్రసీ” సౌజన్యంతో)
అనువాదం : కర్లపాలెం
ఎం.ఏ. బేబీ



