Wednesday, January 7, 2026
E-PAPER
Homeమానవిచక్రాల కుర్చీ నుంచి అంతరిక్షంలోకి

చక్రాల కుర్చీ నుంచి అంతరిక్షంలోకి

- Advertisement -

అంతరిక్ష యాత్ర అంటే అంత తేలిక కాదు. ఎంతో శిక్షణ, పట్టుదల, ధైర్యం అవసరం. అలాంటిది ఓ వికలాంగురాలు వీల్‌చైర్‌లో కూర్చొని అంతరిక్ష యాత్ర చేసి విజయవంతంగా తిరిగొచ్చింది. వీల్‌చైర్‌లో ఆ యాత్ర చేసిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. సంకల్పం ముందు ఎలాంటి లక్ష్యమైనా చిన్నబోవాల్సిందే అనే నానుడికి ఈమె జీవితం సరిగ్గా సరిపోతుంది. ఆమే జర్మనీకి చెందిన మైఖేలా బెంథాస్‌. అసాధారణమైన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో అంతరిక్షానికి వెళ్లి వచ్చిన ఆమె పరిచయం క్లుప్తంగా…

చిన్నతనం నుండే ఈమె సాహసాలను ఎంతో ఇష్టపడేది. ఆకాశం, నక్షత్రాలు, అంతరిక్ష యాత్రలపై ఆమెకు అపారమైన మక్కువ ఉండేది. అదే మక్కువ ఆమెను ఏరోస్పేస్‌, మెకాట్రానిక్స్‌ రంగంల్లో నిపుణరాలిగా మార్చింది. గతంలో ఆమె ఎన్నో సాహసాలు కూడా చేసింది. 2018లో మౌంటెన్‌ బైకింగ్‌ చేస్తుండగా గాయపడింది. వెన్నుపూస దెబ్బతినడంతో చక్రాల కుర్చీకే పరిమితమయింది. అయినప్పటికి అంతరిక్షం పట్ల జిజ్ఞాస తగ్గలేదు. ఇక అంతటితో తన జీవితం ముగిసిపోయిందని ఆమె కుంగిపోలేదు.

అంతరిక్షంలో విహరించి
ఎప్పటి నుండో స్పేస్‌లోకి వెళ్లాలని కలలను కంటున్న ఆమె ఎలాగైనా తన కలను నిజం చేసుకోవాలనుకుంది. అయితే ప్రమాదం తర్వాత ఆమె కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించలేదు. కానీ మైఖేలా మాత్రం పట్టిన పట్టువదలలేదు. వీల్‌చైర్‌లో ఉండే దానికి తగిన శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఏరోస్పేస్‌, మెకాట్రానిక్స్‌ ఇంజనీర్‌గా యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలో మైఖేలా పని చేస్తుంది. ఇటీవల అమెరికాకు చెందిన జెఫ్‌ బెజోస్‌కు సంబంధించిన బ్లూ ఒరిజిన్‌ సంస్థ ఇటీవల న్యూ షఫర్డ్‌ ఎన్‌ఎస్‌-97 సబ్‌ అర్బిటాల్‌ మిషన్‌ను నిర్వహించింది. అమెరికాలోని టెక్సాస్‌ నుండి వ్యోమనౌకలో మైఖేలా బెంథాస్‌తో పాటు మొత్తం ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్లారు. భూమి ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో కాసేపు విహరించి, భూమిపైకి ఆ ఆరుగురు క్షేమంగా తిరిగొచ్చారు.

పట్టువీడకుండా…
స్పేస్‌ యాత్ర చరిత్రలోనే వీల్‌చైర్‌లో కూర్చొని అంతరిక్ష యాత్రలో పాల్గొనడం ఇదే మొదటిసారి. వికలాంగులు సైతం ఇలాంటి సాహస యాత్రలు చేయవచ్చని బెంథాస్‌ నిరూపించింది. వికలాంగులకూ అంతరిక్ష కలలు సాకారం చేసుకోవచ్చంటూ లక్షలాది మందిలో ఆమె ఆశ, ధైర్యం నింపారు. అంతరిక్ష యాత్ర ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావాలని ఈమె విస్తృతంగా ప్రచారం చేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -