Tuesday, December 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసంక్షోభం నుంచి సంక్షేమం దిశగా..

సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా..

- Advertisement -

పంచాయతీ ఎన్నికల్లో మంచోళ్లకు అవకాశమివ్వండి
ముంచేటోళ్లను తెచ్చుకోవద్దు
దశ-దిశ మారుస్తున్నాం.. దానికోసమే ‘గ్లోబల్‌ సమ్మిట్‌’
గ్రామాలు బాగుండాలంటే నిధులు తెచ్చేవాళ్లను ఎన్నుకోవాలి
రెండేండ్లలో కొడంగల్‌- నారాయణపేట ఎత్తిపోతల పూర్తిచేస్తాం: మక్తల్‌లో రెండేండ్ల ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
”ఒక్కసారి ఆశీర్వదిస్తే రెండేండ్ల అధికారంలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం.. పదేండ్లు అధికారం ఇస్తే వందేండ్లకు సరిపడా అభివృద్ధిని చేసి చూపిస్తాం” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ”సర్పంచ్‌ ఎన్నికల్లో మంచోళ్లకు అవకాశమివ్వండి.. ముంచేటోళ్లని దూరం పెట్టండి. కాళ్లల్లో కట్టెలు పెట్టేటోళ్లు.. హాఫ్‌, ఫుల్‌ బాటిల్స్‌ పట్టుకుని వస్తారు. వాళ్ల మాయలో పడితే అభివృద్ధికి అడ్డుపడినట్టే.. మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి గ్రామాభివృద్ధికి నిధులు తెచ్చేవారిని ఎన్నుకోండి” అని చెప్పారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. మంత్రి శ్రీహరి అధ్యక్షతన మక్తల్‌లో రెండేండ్ల ప్రజాపాలన విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ”ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో గత ప్రభుత్వం రూ. 8లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ప్రజలపై భారం మోపింది.

ఆ సంక్షోభాన్ని అధిగమిస్తూ.. సంక్షేమం వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నాం” అని చెప్పారు. ”తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 ద్వారా రూరల్‌ అగ్రికల్చరల్‌ రీజియన్‌ ఎకానమీగా అభివృద్ధి చేయబో తున్నాం. రెండేండ్లలో కొడంగల్‌ మక్తల్‌ నారాయణపేట ఎత్తిపోతలను పూర్తి చేసి పాలమూరుకు సాగునీరు అందివ్వాలనే లక్ష్యం పెట్టుకున్నాం. 96 శాతం రైతులు భూములిచ్చారు. ఎవరైనా అడ్డు పడితే ఊరుకోం. ఈ దిశగా పనులు పూర్తి చేయాలి. లేదంటే అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలకు ఈ సభ నుంచే శంఖారావం పూరిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సైతం పాలమూరు జిల్లాపై వివక్ష కొనసాగిందన్నారు. కూతవేటు దూరంలో ఉన్న కృష్ణానది నీటిని బీడు భూములకు మళ్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లా నుంచి సాధారణ వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారని, ఇక్కడి ప్రజల ఆదరాబిమానాలతోనే తాను ఈ రాష్ట్రానికి రెండో సీఎం అయ్యానని అన్నారు.

తట్ట బుట్ట నెత్తిన పెట్టుకుని వలసలు పోయే ఈ జిల్లా ప్రజలకు త్వరలోనే సాగు నీరు అందిస్తామని హామీనిచ్చారు. కరువు జిల్లా నుంచి ఎంపీగా గెలిచిన మాజీ సీఎం కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టులకు మొండి చేయి చూపారని విమర్శించారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు చేసి, సంగం బండ పగలగొట్టడానికి కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్దండాపూర్‌ నిర్వాసితులకు 100 శాతం పరిహారం అందించామన్నారు. 2014లో తెచ్చిన 69 జీఓను తొక్కి పెట్టి కొడంగల్‌- నారాయణపేటకు తీరని అన్యాయం చేశారని అన్నారు. తాము ఈ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌ పరిధిలో ఐఐటీ, ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏండ్ల తరబడి ఎస్సీ వర్గీకరణకు నోచుకోలేదని, సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తాము తెలంగాణలో అమలు చేశామని గుర్తు చేశారు.

గొర్రెలు, బర్రెలు వంటి పశువులు, చేపల లెక్కలు తేల్చిన మాజీ సీఎం కేసీఆర్‌ బీసీల లెక్కలు మాత్రం తేల్చలేదని ఎద్దేవా చేశారు. గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని 2047వరకు గొప్ప రాష్ట్రంగా తీర్చి దిద్దుతామన్నారు. దానిలో భాగంగానే ఈనెల 8, 9, 10 తేదీల్లో గ్లోబల్‌ సమ్మిట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. అభివృద్ధికి గీటురాయిగా కాంగ్రెస్‌ బలపరిచిన వారినే సర్పంచులుగా గెలిపించాలని సీఎం కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిట శ్రీహరి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసుధన్‌రెడ్డి, అనిరుధ్‌రడ్డి, మేఘారెడ్డి, ఈర్లపల్లి శంకర్‌, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, నాయకులు సీతాదయాకర్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మెన్లు శివకుమార్‌రెడ్డి, శివసేనారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -