Friday, June 13, 2025
E-PAPER
Homeమానవికాశ్మీర్ నుంచి ప్రపంచ రేస్ ట్రాక్ వరకు

కాశ్మీర్ నుంచి ప్రపంచ రేస్ ట్రాక్ వరకు

- Advertisement -

హుమైరా ముష్తాక్‌… భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన రేసర్‌. కాశ్మీర్‌ లోయల నుండి ప్రపంచ రేస్‌ట్రాక్‌ల వరకు ఆమె ప్రయాణం అత్యంత ధైర్య సాహసాలతో కూడుకున్నది. బ్రిటిష్‌ జీటీ ఛాంపియన్‌షిప్‌ 2025లో పోటీ పడుతున్న ఏకైక భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. కేవలం రేసింగ్‌ కార్లతోనే కాదు సమాజంలో మార్పు వైపు కూడా పరుగెడుతున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
ఈ నెల చివర్లో రేసర్‌ హుమైరా ముష్తాక్‌ ప్రతిష్టాత్మక బ్రిటిష్‌ జీటీ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఆమె కెరీర్‌లో మరో మైలురాయి. ముష్తాక్‌ బ్రిటిష్‌ ఎండ్యూరెన్స్‌ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడిన తొలి భారతీయ మహిళ. ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఉన్నత జీటీ (గ్రాండ్‌ టూరింగ్‌) రేసింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదానిలో ఏకైక భారతీయ మహిళా పోటీదారుగా ఆమె సిద్ధంగా ఉన్నారు. గ్రాండ్‌ టూరింగ్‌ కార్లు.. వేగం, మన్నిక, అధునాతన టెక్నాలజీతో ఎండ్యూరెన్స్‌ రేసింగ్‌ కోసం రూపొందించబడిన రేస్‌ కార్లు.
తల్లిదండ్రుల మద్దతుతో…
కాశ్మీర్‌లో పుట్టిన హుమైరా ప్రయాణం చాలా చిన్న వయసులోనే మొదలయింది. తన రెండేండ్ల వయసులోనే కార్ల పట్ల ఆసక్తి కనబరిచింది. బొమ్మ కార్లను నిర్వహించే విధానాన్ని గమనించిన తండ్రి ఆమెకు నాలుగేండ్ల వయసులో కస్టమ్‌ మేడ్‌ గో-కార్ట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇంట్లో ఒక మినీ ట్రాక్‌ను కూడా నిర్మించాడు. ‘నేను ప్రతి సాయంత్రం కారు నడిపేదాన్ని, అక్కడే నేను ప్రాథమిక విషయాలు నేర్చుకున్నాను’ అని హుమైరా గుర్తుచేసుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతో ముష్తాక్‌ గో-కార్టింగ్‌ నుండి సింగిల్‌-సీటర్‌కు చేరుకున్నారు. జేకే టైర్‌ మోటార్‌స్పోర్ట్స్‌ కోసం జరిగిన పరీక్షా సెషన్‌లో ఆమె తన ప్రతిభను కనబరిచారు. తర్వాత రెండు సీజన్ల ఫార్ములా రేసింగ్‌కు స్పాన్సర్‌ చేశారు. అయితే ఆమె ఎంచుకున్న మార్గంలో దూసుకుపోతున్న సమయంలో ఓ విషాదం జరిగింది. ఆమె 14వ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందు తండ్రి మరణించాడు.
అటు దు:ఖం ఇటు పట్టుదల
తండ్రి మరణం హుమైరాను నిరాశలోకి నెట్టింది. అయితే తల్లి ఆమెను లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రోత్సహించింది. ‘నీ తండ్రి బతికి ఉంటే ఆయన నిన్ను ఇలా చూసి భరించగలిగేవాడా?’ అన్న తల్లి మాటలు ఆమెను తిరిగి నిలబెట్టాయి. ఆ క్షణం ఆమె జీవితంలో ఒక మలుపుగా మారింది. దేశంలో రేసింగ్‌ చేసే మహిళలు పెద్దగా లేకపోవడంతో ఆమె తన సొంత మార్గాన్ని ఏర్పరచుకున్నారు. రేసింగ్‌తో పాటు చదువును కూడా సమతుల్యం చేసుకున్నారు. వైద్య నిపుణుల కుటుంబం నుండి వచ్చిన హుమైరా నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణురాలై దంతవైద్యం అభ్యసించారు. తన తల్లి కోరికను తీర్చారు. అయితే ఆమె మన సు ఎప్పుడూ రేసింగ్‌ ట్రాక్‌లోనే ఉంది.
అంతర్జాతీయ వేదికపై
కరోనా తర్వాత ఎంఆర్‌ఎఫ్‌ రేసింగ్‌తో రెండు సీజన్ల తర్వాత హుమైరా అంతర్జాతీయ మోటార్‌స్పోర్ట్స్‌కి మారిపోయారు. బ్రిటిష్‌ ఎండ్యూరెన్స్‌ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆస్టన్‌ మార్టిన్‌తో కలిసి పోటీ పడ్డారు. అంతేకాదు ఐటీసీసీసీ (ఇంటర్నేషనల్‌ టూరింగ్‌ కార్‌ కాంపిటీషన్‌ లైసెన్స్‌) అంతర్జాతీయ రేసింగ్‌ లైసెన్స్‌ పొందిన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె వార్తల్లో నిలిచారు. ఇది ఆమెకు ప్రపంచంలోని అత్యంత సవాలుతో కూడిన సర్క్యూట్‌లలో పోటీ పడటానికి అవకాశం కల్పించింది. అయితే ఈ సంచలనాత్మక విజయం ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తర్వాతనే జరిగింది. ఆమె సామర్థ్యంపై సందేహాలు ఉండడంతో సాధారణంగా జరిగే రెండు పరీక్షలకు బదులుగా ఏడు పరీక్షలు చేయించారు. ‘నేను దాన్ని ఎలా భరించాలో నాకు తెలియదు. కానీ నా స్పాన్సర్‌లతో నాకు డెలివబుల్స్‌ ఉన్నాయి. నేను ఉత్తీర్ణురాలిని’ అని ఆమె చెప్పారు. కేవలం రెండు టెస్ట్‌ పరుగులలో ప్రదర్శనను చూసి, ఆమెను సందేహించిన వారు ఆశ్చర్యపోయారు. ‘నాకు 23 ఏండ్లు అని, నా నాలుగేండ్ల వయస్సు నుండి ఈ ప్రయోగాలు చేస్తున్నానని చేబితే వారు నా మాటలు నమ్మలేకపోయారు’ అంటూ ఆమె గుర్తు చేసు కున్నారు.
రేసింగ్‌లో సవాళ్లు
మోటార్‌ స్పోర్ట్స్‌లో తీవ్రమైన శారీరక ఒత్తిడి ఉంటుంది. ‘రేస్‌ కారు లోపల ఉష్ణోగ్రత 55-60 డిగ్రీల వరకు ఉంటుంది, ముఖ్యంగా అబుదాబిలో’ అని హుమైరా చెప్పారు. రేసర్లు వేడి వల్ల కలిగే అలసట కారణంగా రేసు మధ్యలో ఎలా స్పృహ కోల్పో యేవారో ఆమె గుర్తుచేసు కున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోడానికి ఆమె జిమ్‌లో పూర్తి గేర్‌లో శిక్షణ ప్రారంభించారు. తీవ్రమైన పరిస్థితులకు శరీరం అలవాటు పడటానికి ఆమె స్వెట్‌సూట్‌, హెల్మెట్‌ ధరించారు.
విచిత్రంగా చూస్తారు
మిషన్‌ శక్తి అవార్డు గ్రహీత అయిన హుమైరా, మహిళలు ఇప్పటికీ ప్రవేశం కోసం పోరాడుతున్న క్రీడలో ధైర్యానికి చిహ్నంగా నిలుస్తున్నారు. ప్రొఫెషనల్‌ మోటార్‌ స్పోర్ట్స్‌లోని కొద్దిమంది మహిళలలో ఒకరిగా ఉన్న ఆమెకు అందులోని శక్తి తెలుసు. ‘నేను రేసింగ్‌ డ్రైవర్‌ని అని ప్రజలకు చెప్పినప్పుడు నన్ను వాళ్లు విచిత్రంగా చూస్తారు. కానీ నన్ను ట్రాక్‌లో చూసిన తర్వాత వారి ముఖాలు మారిపోతాయి’ అంటూ పంచుకున్నారు. కాశ్మీర్‌ లోయల నుండి అంతర్జాతీయ సర్క్యూట్‌లకు ఆమె చేసిన ప్రయాణం ఇప్పటికే నేటి తరం అమ్మాయిలకు స్ఫూర్తినిస్తోంది. ‘నేను ఆమెలా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పగలిగే మహిళా రేసర్లు ఎవరూ లేరు’ అని హుమైరా అంటున్నారు.
ఇంకా నేర్చుకుంటున్నాను
ఇప్పుడు పరిస్థితుల్లో కొంత వరకు మార్పు వచ్చింది. బ్రిటిష్‌ జీటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఆమె సిద్ధమవుతుంది. హుమైరా ఇప్పుడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాదు, ఇది మా వల్ల కాదేమో అని భావించే ప్రతి అమ్మాయి ఆశలను కూడా మోస్తోంది. ఆమె ప్రయాణాన్ని పట్టుదలకు, అడ్డంకులను బద్దలు కొట్టేందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ‘నేను ఈ క్రీడను బాగా తెలుసుకోవాలను కుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. ఈ క్రీడలో నేను మేధావిగా ఉండాలనుకుంటున్నాను’ అని హుమైరా తన మాటలు ముగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -