ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరిగే అవకాశం
సీఎన్‌జీ కొరతతో ఇదే ప్రత్యామ్నాయం
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో భారీ మార్పులు
న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ మార్కెట్‌లో ఇంధన సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. గ్యాస్ కొరతతో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది పలు రంగాలను ప్రభావితం చేస్తున్నది. భారత్‌లోనూ ఈ పరిస్థితి కనిపిస్తున్నది. సీఎన్‌జీ కొరతతో భారత ఆటోమొబైల్ మార్కెట్ ఈవీల వైపు మళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. భారత్ తన సహాజ వాయువు అవసరాల్లో పెద్ద భాగాన్ని మధ్యప్రాచ్య దేశాల నంచి దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా ఖతర్ నుంచి వచ్చే ఎల్‌ఎన్‌జీ గ్యాస్ చాలా భాగం ఇదే మార్గం ద్వారా వస్తుంది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు పెద్ద అడ్డంకిగా మారాయి. యుద్ధం వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది.
ఫలితంగా సీఎన్‌జీ కొరత ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో సీఎన్‌జీ పంపుల వద్ద వాహనాల క్యూలు ఏర్పడతాయి. అప్పుడు వాహనాలను సీఎన్‌జీతో నడిపే వినియోగదారులకు ఇబ్బంది మొదలవుతుంది. ఫలితంగా సీఎన్‌జీ వెహికిల్స్‌పై వినియోగదారులు నమ్మకాన్ని కోల్పోతారు. దీంతో వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు. ఇతర ప్రత్యామ్నాయాల్లో ఒకటిగా ఉన్న పెట్రోల్ ఖరీదు ఎక్కువ. కాబట్టి వినియోగదారులు అటువైపు చూసే అవకాశాలు చాలా తక్కువ. అలాంటి సమయంలో ఎలక్ల్రిక్ వెహికిల్స్ ప్రత్యామ్నాయం అవుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో విద్యుత్ సరఫరాపై ఉన్న పాత అనుమానాలు ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను పెంచలేకపోయాయి. దీంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ఆశించినంతగా జరగలేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, ముఖ్యంగా సీఎన్‌జీ కొరత ఆటోమొబైల్ మార్కెట్‌ను ఇప్పటి వరకు తక్కువస్థాయిలో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల దిశగా నెట్టే అవకాశం కనిపిస్తోంది.
1980లలో భారత్‌లో తరచూ విద్యుత్ కోతలు ఉండేవి. దేశంలోని కీలక నగరాలుగా చెప్పబడే కోల్‌కతా వంటి సిటీలలోనూ గంటల తరబడి విద్యుత్ కోత ఉండేది. ఆ సమయంలో చాలా కుటుంబాలు ఇన్వర్టర్లు, పెద్ద బ్యాటరీలు ఉపయోగించేవి. ఆ అనుభవం కారణంగా ఇప్పటికీ చాలా మందికి విద్యుత్‌పై పూర్తి నమ్మకం లేకపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రభావితం చేస్తోందని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెప్తున్నారు. భారత్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వాటా మొత్తం మార్కెట్‌లో నాలుగు శాతమే. చాలా మంది కొనుగోలుదారులు బ్యాటరీ చార్జ్ అయిపోతే మధ్యలో నిలిచిపోతుందేమో అన్న భయంతో ఇంకా సంప్రదాయ ఇంధన వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ పరిస్థితి క్రమంగా మారుతోందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కొత్త తరం ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగిన బ్యాటరీలు వస్తున్నాయని అంటున్నారు.
కొన్ని కొత్త ఎలక్ట్రిక్ వాహనాల్లో వెహికిల్ టు లోడ్ (వీ2ఎల్) అనే సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా కారులోని బ్యాటరీని ఇంటికి బ్యాకప్ విద్యుత్ సరఫరాగా కూడా ఉపయోగించుకోవచ్చని వారు వివరిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నెలకొన్న ప్రధాన ఆందోళన సీఎన్‌జీ సరఫరా. భారత్ సహజ వాయువు అవసరాల్లో చాలా భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలోని హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే సరఫరాపై దేశం ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రపంచ రాజకీయ పరిస్థితుల వల్ల ఈ సరఫరాలో అంతరాయం కలిగితే సీఎన్‌జీ వాహనాల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత్‌లో సీఎన్‌జీ వాహనాలు విస్తృతంగా పెరిగాయి. ప్రస్తుతం భారత్‌లో అమ్ముడయ్యే కార్లలో ఐదింటిలో ఒకటి సీఎన్‌జీ కారే. అయితే గ్యాస్ కొరత ఏర్పడితే ఈ వాహనాలను పెట్రోల్‌పై నడపాల్సి వస్తుంది.
అది ఖర్చును మరింతగా పెంచుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్ని వంట గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులో ఉన్న గ్యాస్‌ను ముందుగా వంటగ్యాస్, ఎరువుల తయారీకి ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇదే జరిగితే రవాణా రంగానికి గ్యాస్ సరఫరా తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే సీఎన్‌జీ పంపుల వద్ద పెద్ద క్యూలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ అనుభవం వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఇంధన సరఫరాలో అంతరాయం కూడా భారత ఆటోమొబైల్ రంగాన్ని మళ్లీ భారీ మార్పు దిశగా నడిపించే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు.



