ఉగ్రవాదంపై సమిష్టి పోరు : మోడీ
వాణిజ్య చెల్లింపులకు ఇరుదేశాల కరెన్సీ
రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : అమెరికా వంటి దేశాల నుంచి ఒత్తిళ్ళు ఎదురవుతున్నప్పటికీ భారత్-రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్, మోడీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల ఒత్తిళ్ళ కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ కొంతకాలంగా తగ్గించు కుంటున్నప్పటికీ సరఫరాలను పెంచేందుకు త్వరలో చర్యలు చేపడతామన్నారు. గతేడాది ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 12 శాతం పెరిగిందని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌తో వాణిజ్య సహకారంతో పాటు రక్షణ సహకారాన్ని కూడా మరింత పెంచుకుంటామని అన్నారు. రెండు దేశాలు చెల్లింపుల కోసం తమ తమ జాతీయ కరెన్సీలను ఉపయోగించుకుంటున్నాయని, సుమారు 96శాతం వాణిజ్య చెల్లింపులు జాతీయ కరెన్సీలలోనే జరుగుతున్నాయని చెప్పారు.
భవిష్యత్తులో కూడా జాతీయ కరెన్సీల్లోనే వాణిజ్యాన్ని పెంపొందించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ఇరువురు నేతలు తెలిపారు. ”భారత్‌లో అతి పెద్ద అణు విద్యుత్ ప్లాంటును నిర్మించడానికి ఒక ప్రధాన ప్రాజెక్టును చేపడుతున్నాం. ఆరు రియాక్టర్ యూనిట్లలో ఇప్పటికే రెండింటినీ గ్రిడ్‌కు అనుసంధానించాం, ఈ ప్లాంటు పూర్తి సామర్ధ్యంతో పనిచేస్తే భారత ఇంధన అవసరాలు తీరుతాయి. పరిశ్రమలు, నివాస గృహాలకు చౌకగా విద్యుత్ లభిస్తుంది” అని పుతిన్ అన్నారు. సైనిక సాంకేతిక రంగంలో రెండు దేశాలు సన్నిహిత సహకారాన్ని పెంచు కుంటున్నాయని ఇరు దేశాల నేతలు తెలిపారు. భారత సైనిక దళాల ఆధునీకరణకు గత అర్థ శతాబ్ద కాలంగా రష్యా సహకరిస్తోందని అన్నారు. మోడీతో జరిపిన చర్చలు సంతృప్తిని కలిగించాయని పుతిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదంపై పోరులో కలిసి నడుస్తాం : మోడీ
ఉగ్రవాదంపై పోరులో భారత్, రష్యా కలిసి నడుస్తాయని మోడీ అన్నారు. శాంతి కోసం జరిపే ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రయత్నంలో తాము భుజం భుజం
కలిపి నడుస్తామని చెప్పారు. ఇటీవల పహల్గాంలో జరిగిన దాడికి, గత సంవత్సరం రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాలులో జరిగిన దాడికి మూల కారణం ఉగ్రవాదమేనని అన్నారు. మానవత్వ విలువలపై జరుగుతున్న ఈ ప్రత్యక్ష దాడులను ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు ఏకమయ్యాయని తెలిపారు. భారత్, రష్యా, అమెరికాతో పాటు జి-20, బ్రిక్స్ వేదికలు కూడా ఉగ్రవాదంపై పోరులో పరస్పరం సహకరించుకుంటున్నాయని మోడీ వివరించారు.
ప్రొటోకాల్ వదిలి..
23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, ప్రధాని మోడీ ప్రొటోకాల్ వదిలి ఆలింగనం చేసుకుని వ్యక్తిగతంగా స్వాగతించారు. తదనంతరం పుతిన్ కు భగవద్గీతను కానుకగా ఇచ్చారు. ఇది ఇద్దరు నాయకుల మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ఇండియా-రష్యా బిజినెస్ ఫోరమ్‌కు హాజరయ్యారు. భారతదేశంలో ఆర్‌టీ ఛానెల్‌ను ప్రారంభించారు. ఆ తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందులో పాల్గొన్నారు.
వ్యూహాత్మక భాగస్వామ్యం : పుతిన్
”వాస్తవానికి ఇండియా, రష్యా మధ్య పౌర అణుశక్తి, కీలకమైన ఖనిజాల విషయంలో దశాబ్దాలుగా పరస్పర సహకారం కొనసాగుతూ ఉంది. దీనికి తోడు ధృవాల వద్ద భారత నావికులకు రష్యా శిక్షణ ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్కిటిక్‌లో సహకారాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలు కూడా ఈ ఒప్పందాల్లో భాగంగా ఉన్నాయి. కాగా, ఇకపై భారత్, రష్యా మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు పెంచాలి” అని పుతిన్ అన్నారు. జాతీయ కరెన్సీల్లో వాణిజ్యాన్ని స్థిరీకరించడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కీలక ఒప్పందాలు ఇవే!
ఇంధన సరఫరా : భారతదేశానికి నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని రష్యా హామీ ఇచ్చింది.
పారిశ్రామిక సహకారం : రష్యాలో యూరియా ప్లాంట్‌ను స్థాపించడానికి భారత కంపెనీలు, రష్యాకు చెందిన యూరల్‌చెమ్‌తో ఒప్పందం చేసుకున్నాయి.
ఆహార భద్రత.. వినియోగదారుల రక్షణ : భారతదేశానికి చెందిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, రష్యాకు చెందిన వినియోగదారుల రక్షణ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది.
ఆరోగ్య రంగం : వైద్యం, ఆరోగ్య సంరక్షణలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
పోర్టు అండ్ షిప్పింగ్ : సీ లాజిస్టిక్స్‌లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్, రష్యాలు ఎంవోయూపై సంతకాలు చేశాయి.
వలసలు : ఇరుదేశాల మధ్య వలసలు, మొబిలిటీని సులభతరం చేసేందుకు భారత్, రష్యాలు ఓ అంగీకారానికి వచ్చాయి.
వీటికి అదనంగా, కొత్త అంతర్జాతీయ లాజిస్టిక్స్ మార్గాలను నిర్మించడానికి రష్యా, భారత్ కలిసి పనిచేస్తాయని పుతిన్ అన్నారు. చిన్న మాడ్యూలర్ న్యూక్లియర్ రియాక్టర్లు, తేలియాడే అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.



