తెలంగాణను నిధుల సమస్య తీవ్రంగా వెంటాడుతున్నది. విద్యార్థుల ఫీజురియింబర్స్‌మెంటు నుంచి ఆరోగ్యశ్రీ, విద్యుత్ సంస్థలు, ఇతర ఇంజినీరింగ్ శాఖల బిల్లుల వరకు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. తాత్కాలిక సర్దుబాట్లతో శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఫీజుల కోసం ప్రయివేటు ఇంజినీరింగ్, వృత్తివిద్యా కళాశాలలకు తాళాలు వేయడానికి సైతం యాజమాన్యాలు వెనుకాడలేదంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఫీజు రియింబర్స్‌మెంటుపై చర్చలు జరుగుతుండగానే, మరోవైపు తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసేవలను కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రులు నిలిపివేశాయి. దీంతో ఆరోగ్య ఖర్చులు ఆకాశాన్నంటి జనం నెత్తిమీద పీడుగు పడ్డట్టయింది. తొమ్మిదినెలలుగా తమకు పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. సర్కారుకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా తమ ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించలేదని చెబుతున్నది. ఆర్థిక ఇబ్బందులతోపాటు ఆర్థికేతర సమస్యలూ అలాగే ఉన్నాయని మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. దీంతో సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కావడంతో లక్షలాది మంది రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు నిధులు చెల్లించడానికి సర్కారు అంగీకరించినా ఆస్పత్రులు సేవలు నిలిపివేయడాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తప్పుబట్టింది. గడిచిన కాలంగా నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లిస్తూనే ఉన్నామని వీరంటున్నారు. సంవత్సరాలుగా బకాయిలున్నాయని ఆస్పత్రులంటున్నాయి.
ఇదిలా ఉంటే, ఫీజు రియింబర్స్‌మెంటుతోపాటు స్కాలర్‌షిప్‌ల విషయం కాలేజీల బంద్ దాకా వెళ్లింది. లక్షలాది మంది విద్యార్థుల్లో ఆందోళనకు దారితీసింది. వారి భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. దాదాపు రూ. 8200 కోట్ల కోసం విద్యార్థి సంఘాలు రొడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఫీజు చెల్లించకుండా కాలేజీలు నడపలేమని యాజమాన్యాలు చెప్పాయి. ప్రధానంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివేవారి పరిస్థితి అడకత్తెరలో పొకచెక్కయింది. అధికారంలోకి వస్తే ఫీజు రియింబర్స్‌మెంటును పటిష్టంగా అమలుచేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు నిధుల్లేవనీ, ఆదాయం తక్కువగా ఉందనీ, ఖర్చు ఎక్కువ అవుతోందని పదే పదే వల్లే వేస్తున్నది. కాగా సమస్య పరిష్కారానికి సరైన దారిని ఎంచుకోవడంలోనూ ప్రభుత్వం తడబడుతోంది. అయితే నిధులను సమకూర్చుకునేందుకు అవసర మైన కసరత్తును సక్రమంగా చేయడం లేదు. రెండు, మూడు కమిటీలు వేసి వనరులు సమీకరించే కృషి జరుగుతున్నా, అవి ఆశించిన ఫలితాలను చూపించలేక పోతున్నాయి.
విద్యుత్ సంస్థలకూ బకాయిలతోపాటు ఇతర శాఖల్లోనూ నిధులు కటకటగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకొచ్చి కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపి తాత్కాలిక సర్దుబాటు కింద రూ. 600 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. తద్వారా కాలేజీల బంద్‌ను నివారించగలిగింది. శాశ్వత పరిష్కారం కింద గతంలో ప్రభుత్వం చెప్పినట్టుగా గ్రీన్‌ఛానెల్ విధానాన్ని అమల్లోకి తేవాలి. ఇంతకుముందే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినా, అమల్లో వెనుకబడింది. ఇప్పుడైనా ఈ పద్ధతిని అమలుచేసి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం ద్వారా సమస్య పరిష్కారానికి పూనుకోవాలి.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో చేసిన జీఎస్టీ సవరణతో ప్రతియేటా రూ. 5 వేల కోట్ల ఆదాయం తగ్గనుందని ఆర్ధిక శాఖ మంత్రి సెలవిచ్చారు. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి, ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఆలోచన చేయాలి. మోడీ సర్కార్‌పై ఒత్తిడి పెంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించుకోవాల్సి ఉంది. అప్పుడు గాని ఆర్థిక కష్టాలు కొలిక్కిరావు. మోడీ ప్రభుత్వం అన్ని ప్రజారంగాలకు నిధులు కోతపెడుతూ, కార్పొరేట్లకు లక్షల కోట్లను పలహారంగా చేస్తున్న వైనాన్నీ రేవంత్ సర్కారు గుర్తించాలి. ఆ మేరకు కలిసొచ్చే దక్షిణాది రాష్ట్రాలతోపాటు పోరాటానికి నడుంకట్టాలి.
రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండటంతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం లేదు. నీటిపారుదల, మిషన్ భగీరథ, ఆర్ అండ్‌బీతోపాటు ఇతర శాఖలనూ నిధుల కొరత వేధిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఘనంగా ప్రకటించిన ‘తెలంగాణ రైజింగ్-2047’ కాన్సెప్ట్‌ను కొనసాగిస్తారా? రాంరాం చెబుతారా? అనే చర్చా చోటుచేసుకుంటున్నది. కేంద్రం మౌలిక వసతుల కల్పన పేరిట రాష్ట్రాల మెడపై కత్తిపెట్టి రాష్ట్ర ఆర్థిక వనరులను తొక్కిపెడుతున్న విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రం గొంతెత్తాల్సి ఉంది. నిధుల కొరత పేరుతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలను సరిగ్గా నడపకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుంది.
నిధుల వెతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES