Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బెస్ట్ అవైలబుల్ స్కూల్ కి నిధులను విడుదల చేయాలి: సీపీఐ(ఎం) డిమాండ్

బెస్ట్ అవైలబుల్ స్కూల్ కి నిధులను విడుదల చేయాలి: సీపీఐ(ఎం) డిమాండ్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ :బెస్ట్ అవైలబుల్ స్కూల్ కి నిధులను విడుదల చేసి దళిత గిరిజన పిల్లలకు చదువును అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటం కొరకు ప్రయివేట్ పాఠశాలలలో చేర్పించడానికి నిర్ణయించి, గత కొంతకాలంగా ఆయా వర్గాల పిల్లలకు అడ్మిషన్లను ఇప్పించటం జరిగింది.

నిజామాబాద్ జిల్లాలో ఆరు పాఠశాలల్లో వందలాది మంది పిల్లలకు చేర్పించి చదువు నేర్పటం జరుగుతున్నది. గత సంవత్సరం నుండి పిల్లలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆయా పాఠశాలల యాజమాన్యం తల్లిదండ్రులు పిల్లల ఫీజులను కడితేనే చదువు చెప్పిస్తామని చెప్పి పిల్లలను ఇంటికి పంపుతున్నారు. ఫలితంగా తమ పిల్లల చదువు దూరమవుతుందని దళిత గిరిజన కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు గత కొంతకాలంగా జిల్లాలో ఆందోళనలు నిర్వహించారు. అయినా ఇంతవరకు వారి ఫీజు లను చెల్లించకుండా కాలయాపన చేయటంతో పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు అవుతున్నా.. ఆయా పిల్లలను పాఠశాలలకు పంపలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ను చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని మెరుగుపరుస్తామని ప్రకటనలు ఇస్తూ వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకే చదువు లేకుండా చేయటం ఏ రకంగా సామాజిక న్యాయం అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఫీజులను చెల్లించి పిల్లలకు నాణ్యమైన విద్య అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. లేనియెడల విద్యార్థుల కొరకు సీపీఐ(ఎం) తరఫున ఆందోళన చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నాయకులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -