నవతెలంగాణ-హైదరాబాద్: దక్షణాఫ్రికాలో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జీ20 శిఖరాగ్ర సమావేశం అట్టహాసంగా జరుగుతోంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆ కూటమి సభ్యదేశాలతో పాటు 42 దేశాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీల ప్రొపెసర్లు, పలువురు ఆర్థిక వేత్తలు విచ్చేశారు. అదే విధంగా ఇతర దేశాల అధినేతలు కూడా జీ20 సభ్యదేశాల ఆహ్వానం మేరకు హాజరైయ్యారు.
జీ20 సమావేశాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రమే పీఎం మోడీ సౌతాఫ్రికాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొనడంతో పాటు సమావేశం తర్వాత పలు దేశాల అధ్యక్షులతో పీఎం భేటీ కానున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సమ్మిట్ ను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సమావేశం శనివారం(నవంబర్ 22) నుండి రెండు రోజుల పాటు జోహన్నెస్‌బర్గ్‌లోని 150,000 చదరపు మీటర్ల నాస్రెక్ ఎక్స్‌పో సెంటర్‌లో జరుగుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్.
జీ20 శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో సిరిల్ రామపోసా ప్రభుత్వం జోహెన్సె బర్గ్‌లో కట్టుదిట్టమైన భద్రతా కల్పించింది. సమావేశ పరిసర ప్రాంతాల్లో దాదాపు 3500 మంది పోలీసులతో పాటు ఇతర భద్రతా బలగాలతో బందోబస్తు కల్పించారు.
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక శక్తుల అనధికారిక ఆర్థిక సమూహంగా 1999లో G20 స్థాపించబడింది. అప్పటి నుండి, G20 నాయకులు శిఖరాగ్ర సమావేశాల కోసం ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా సమావేశమవుతున్నారు.ముఖ్యమైన సమస్యలను చర్చించడానికి G20 దేశ ప్రతినిధులు ఏడాది పొడవునా సమావేశమవుతారు. కానీ కూటమి సభ్యదేశాల నాయకులు ప్రస్తుతం వార్షిక శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. గత నవంబర్‌లో బ్రెజిల్‌లో, నాయకులు 2030 గడువు నాటికి ఐక్యరాజ్యసమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
దక్షిణాఫ్రికా 2024 నవంబర్ నుంచి అధ్యక్ష పదవిని నిర్వహిస్తోంది. తాజా సమావేశం తర్వాత అధ్యక్ష బాధ్యతలను అమెరికాకు(నవంబర్ 30, 2025) అప్పగించనుంది.




