నవతెలంగాణ-హైదరాబాద్: ఆగష్టు 27న ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోవడానికి నగరవాసులు పోటెత్తారు. స్వామి దర్శనం కోసం గంటల తరబడి భక్తులు క్యూలైన్‌లో నిలబడ్డారు. దీంతో నిన్న అర్ధరాత్రి వరకు 5 లక్షల మంది భక్తులు విశ్వశాంతి మహా గణపతిని దర్శించుకున్నారని ఉత్సవ సమితి అంచనా వేస్తుంది.
అదే విధంగా ట్యాంక్ బండ్ పై నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతుంది. నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి బొజ్జ గణపయ్యాను తీసుకొని ట్యాంక్ బండ్‌కు తరలివస్తున్నారు భక్తులు. దీంతో వినాయక విగ్రహాల వరుసతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. భక్తుల, దర్శకుల గణేష్ నామస్మరణాలతో మారుమోగుతోంది.
మరోవైపు భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసులు తగు ఏర్పాట్లు చేశారు. దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా వేలాదిగా తరలివచ్చిన భక్తులు మహా గణపతిని దర్శించుకుంటున్నారు. వినాయక నవరాత్రుల్లో మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.