నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పల్వాయి ప్రశాంత్ గౌడ్ మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కేసు నమోదు చేసుకొని విచారణ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేష్ చద్ర తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇయాజ్ అను వ్యక్తి అతని అనుచరులైన మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి ఫేస్బుక్ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా కార్లు అమ్ముతామని నమ్మించారు. సెల్ఫ్ డ్రైవింగ్ కోసం కార్లను కిరాయికిచ్చే వ్యక్తుల నుండి కార్లు కిరాయికి తీసుకుని వాటి యొక్క నెంబర్ ప్లేట్ మార్చి ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టి కార్ల యొక్క ఒనర్ల పేరుతో డూప్లికేట్ ఆర్‌సి, డూప్లికేట్ ఆధార్, ఇతర కార్డులు తయారు చేస్తున్నారు. అనంతరం ఇవే కార్లను అమ్మి లక్షలలో డబ్బులు వసూలు చేశారు.
మళ్ళీ ఆ కార్లను దొంగిలించి, తిరిగి ఒనర్లకు ఇచ్చేస్తున్నారు. ఇలా అమాయక ప్రజలను మోసం చేస్తూ.. ఫోన్ నెంబర్ లను మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏడుగురు వ్యక్తులు కలిగిన గ్యాంగ్ (Habitual offenders) ను ఛేదించుటకు ఈ కేసులో ఏఎస్పి, కామారెడ్డి టీమ్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతంగా చేశారు. పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను పట్టుకొని కేసును చేదించడం జరిగిందన్నారు.
నిందితులు రంగారెడ్డి జిల్లా గోపి నగర్, శేరిలింగంపల్లి మండలం మహమ్మద్ ఇయాజ్, రంగారెడ్డి జిల్లా, శాంతినగర్ కాలనీకి చెందిన మహమ్మద్ జాహీద్ అలీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పృథ్వీ జగదీష్, సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు రామచంద్రపురం బీరంగూడ కు చెందిన రాచర్ల శివకృష్ణ, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం నికి చెందిన కర్ణకోట సాకేత్, ఆలీ ( పరారీలో ఉన్నాడు).
స్వాధీన పరచుకున్న సొత్తు వివరాలు:
ఇనోవా కారు, ఒక ల్యాప్ టాప్ , ఎర్తిగా కారు, 10 మైక్రో సిమ్ కార్డులు, బాలెనో కారు, ఖాళీ చిప్ కార్డ్ లు, 15 మొబైల్ ఫోన్ లు, ఫోర్జరీ చేసిన ఆర్ సి లు, కారు GPS పరికరముపై తెలిపిన వాటిని స్వాధీన పరచుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయనైనది.
ఈ నేరస్తులు ఇంతకు ముందు 1) శంకర్పల్లి ,2) మంచాల ,3) అంబార్ పేట్ ,4) రామచంద్రపురం ,5) చందానగర్ ,6) మియాపూర్, 7) అత్తాపూర్ పోలీసు స్టేషన్ కేసులలో నేరస్తులు గా ఉన్నారు.
ఇట్టి కేసు దర్యాప్తులో పాల్గొని కేసుని చేధించిన కామారెడ్డి రూరల్ సీ.ఐ. ఎస్.రామన్, మాచారెడ్డి ఎస్సై ఎస్.అనిల్, కానిస్టేబుళ్ సుభాష్ రెడ్డి , సిద్దిరాములు, శ్రీకాంత్, ఐటీ సెల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పిఎస్ సిబ్బందిని అభినందించడం జరిగిందన్నారు.