Sunday, December 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం'కీలక దశ'లో గాజా కాల్పుల విరమణ ఒప్పందం!

‘కీలక దశ’లో గాజా కాల్పుల విరమణ ఒప్పందం!

- Advertisement -

రెండోదశపై కసరత్తు
పలు ప్రశ్నలు, సందేహాలను పరిష్కరించాల్సి వుందన్న నేతలు

దోహా : గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం ‘కీలక దశ’లో వుందని కతార్‌ ప్రధాని షేక్‌ మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ అల్‌ తాని వ్యాఖ్యానించారు. మొదటి దశ ముగిసిందని, ఇక ఒప్పందాన్ని మరింత బలపరిచేలా రెండోదశను అమలు చేయడానికి అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ మధ్యవర్తుల కసరత్తు జరుగుతోందని చెప్పారు. దోహాలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ”ఇప్పుడు మనం ఒక విరామం ఇచ్చాం” అని పేర్కొన్నారు. ”దీన్ని ఇంకా కాల్పుల విరమణగా పరిగణించలేం, పూర్తిగా ఇజ్రాయిల్‌ బలగాలు వైదొలగకుండా, గాజాలో సుస్థిరత నెలకొనకుండా, ప్రజలు స్వేచ్ఛగా లోపలకు, బయటకు రాకపోకలు సాగించకుండా కాల్పుల విరమణ జరిగిందని చెప్పలేం.

” అని ప్రధాని షేక్‌ మహ్మద్‌ వ్యాఖ్యానించారు. రాబోయే దశ అయినా తాత్కాలికమే అవుతుందని కతార్‌ ప్రధాని వ్యాఖ్యానించారు. పాలస్తీనా దేశం ఏర్పడటమే ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి స్థాపనకు అత్యవసరమైన అంశమని వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణకు మూల కారణాన్ని, సమస్యను పరిష్కరించనిదే సమస్య పరిష్కారం కాదని అన్నారు. టర్కీ విదేశాంగ మంత్రి హకన్‌ ఫిదాన్‌ మాట్లాడుతూ, గాజాలో అంతర్జాతీయ భద్రతా బలగాల ఏర్పాటుపై పెద్ద ప్రశ్న నెలకొని వుందన్నారు. ఈ బలగాల్లో ఏ ఏ దేశాలు వుంటాయో ఇంకా స్పష్టత రాలేదన్నారు. అసలు కమాండ్‌ వ్యవస్థ ఎలా వుంటుందీ, అది చేపట్టబోయే మొదటి మిషన్‌ ఏమిటి ఇలాంటివేవీ తెలియవన్నారు. వేలాదిగా ప్రశ్నలు దీనిపై తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు.

కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ మారణహోమం
ఒప్పందంలో మొదటి దశలో భాగంగా రెండేళ్లుగా సాగుతున్న భీకర పోరును తాత్కాలికంగా ఆపారు. అక్టోబరు 10న తొలి దశ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడుల్లో 360మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. గాజాలో తమ ఆధీనంలో వున్న భూభాగంలోకి అడుగుపెట్టిన పాలస్తీనియన్లపై దాడులు జరిపామని ఇజ్రాయిల్‌ ఆర్మీ సమర్ధించుకుంటోంది. రెండో దశలో భాగంగా గాజాలో అంతర్జాతీయ భద్రతా బలగాలను మోహరించాల్సి వుంది. సాంకేతిక పరంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వుంది. హమాస్‌ ఆయుధాలు అప్పగించాల్సి వుంది. గాజా నుండి పూర్తిగా ఇజ్రాయిల్‌ బలగాల ఉపసంహరణ జరగాల్సి వుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -