Saturday, October 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఊపిరి పీల్చుకుంటున్న గాజా

ఊపిరి పీల్చుకుంటున్న గాజా

- Advertisement -

వైదొలుగుతున్న ఇజ్రాయిల్‌ సేనలు
స్వస్థలాలకు చేరుకుంటున్న నిరాశ్రయులు అయినా పాలస్తీనియన్లను వీడని భయాందోళనలు

జెరుసలేం/కైరో : ఇజ్రాయిల్‌ మారణహోమంతో మరుభూమిగా మారిపోయిన గాజా నగరంలో శాంతి నెలకొంటోంది. హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయిల్‌ సైన్యం శుక్రవారం గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి తన దళాలను ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. దీంతో ఇప్పటి వరకూ యుద్ధ భయంతో దక్షిణ ప్రాంతంలో తలదాచుకున్న నిరాశ్రయులు క్రమేపీ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే రెండు సంవత్సరాలుగా కొనసాగిన ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా గాజా నగరంలోని పలు ప్రాంతాలు నేలమట్టమయ్యాయి. జనావాసాలు శిథిలాలుగా మారిపోయాయి. బాంబుల మోతలు, కాల్పుల శబ్దాలు ఆగిపోయినప్పటికీ పాలస్తీనియన్లలో ఇంకా భయాందోళనలు వీడడం లేదు. యుద్ధం ఆగిపోయినట్లేనా అని వారు అనుమానంగా ప్రశ్నిస్తున్నారు. కాల్పుల విరమణ అమలులో ఉన్నదని, భయపడవద్దని తమకు ఎవరూ చెప్పడం లేదని తెలిపారు. కాల్పుల విరమణ ప్రారంభమైందని ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ధృవీకరించింది.

ఇక గాజాపై ఎలాంటి చర్యలు ఉండబోవని తెలిపింది. 72 గంటల్లో బందీలు, ఖైదీల మార్పిడి కూడా జరుగుతుంది. గాజాకు సహాయ సామగ్రి పంపిణీ కూడా మొదలు కాబోతోంది. ఐరాస, అంతర్జాతీయ సంస్థల పర్యవేక్షణలో ఆహారం, వైద్య పరికరాలు, ఇంధనం, వంటగ్యాస్‌ వంటి నిత్యావసరాలతో గాజా చేరుకునేందుకు ప్రతి రోజూ 600 ట్రక్కులను అనుమతిస్తారు. యుద్ధ సమయంలో తరలిపోయిన గాజా వాసులు ఈజిప్ట్‌ను వదిలి రఫా క్రాసింగ్‌ ద్వారా తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. ఖైదీల విడుదలకు సంబంధించిన విధివిధానాలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ తెలిపారు. గాజా స్ట్రిప్‌లో దక్షిణ ప్రాంతాన ఉన్న ఖాన్‌ యూనిస్‌ నుంచి ఇజ్రాయిల్‌ సేనలు వెనక్కి తిరిగాయి. అయితే అప్పుడప్పుడు కాల్పుల మోతలు విన్పిస్తున్నాయని స్థానికులు చెప్పారు. గాజా సెంట్రల్‌లోని నుస్సెరాట్‌ శిబిరంలో ఉంటున్న ఇజ్రాయిల్‌ సైనికులు తమ ఆవాసాలను ధ్వంసం చేసి సరిహద్దు వైపు కదిలారు. కొన్ని దళాలు మాత్రం ఇంకా అక్కడే ఉన్నాయి. గాజాకు మానవతా సాయంగా తక్షణమే 34 మిలియన్‌ డాలర్ల సాయాన్ని అందజేస్తామని జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడ్రిజ్‌ మెర్జ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -