పోలింగ్ సిబ్బంది వివరాలు టీ పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయండి
జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం
జనవరి 20 లోపు షెడ్యూల్ విడుదల?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, కార్పోరేషన్ల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు సంబంధిత అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాలెట్ బాక్సులు అంచనా వేసి, అవసరమైన సామగ్రి సిద్ధం చేయాలని ఆదేశించారు.
రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్ సర్వెలెన్స్ టీంల(ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ సర్వెలెన్స్ టీం(ఎస్‌స్‌టీ)ల నియామకం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది నియామకం కోసం ఉద్యోగుల వివరాలను టీ పోల్ యాప్‌లో తక్షణమే అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు ఎన్నికల సంఘం నిర్వహించింది. గురువారం ప్రధాన రాజకీయ పార్టీల రాష్ట్ర స్థాయి ప్రతినిధులతో హైదరాబాద్‌లో సమావేశం కానుంది. తెలంగాణలో గడువు ముగిసిన 117 మున్సిపాల్టీ పాలకవర్గాలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి షెడ్యూల్ ఈ నెల 20వ తేదీ లోపు విడుదలయ్యే అవకాశం ఉంది.
జనవరి 16న ఓటర్ల తుది జాబితా
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల మూడో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్నందున అందుకు తగ్గట్టు ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఓటర్ల జాబితా సవరణ గడువును రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించింది. తెలంగాణ మున్సిపాల్టీ చట్టం, 2019లోని సవరించిన సెక్షన్ 195-ఏ ప్రకారం వార్డు వారీ ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12న ప్రచురిస్తారు. 13 నాటికి పోలింగ్‌స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి వాటిని టీ పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. జనవరి 16న పోలింగ్‌స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురిస్తారు.



