Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుసాగిలపడేందుకు సిద్ధం!

సాగిలపడేందుకు సిద్ధం!

- Advertisement -

ట్రంప్‌ ప్రశంసతో పొంగిపోతున్న మోడీ
దానిలో భాగంగానే బ్రిక్స్‌ సదస్సుకు డుమ్మా
జియో పొలిటికల్‌ వ్యూహంలో పావుగా భారత ప్రధాని

నవతెలంగాణ-హైదరాబాద్‌
నిన్న మొన్నటి వరకు భారత్‌పై రంకెలేస్తూ, 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పుడు జియో పొలిటికల్‌ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ చైనా, రష్యాలకు దగ్గరవడం చూసిన ట్రంప్‌ తొలుత వ్యగ్యంగా, ఆ తర్వాత మోడీపై ఎక్కడలేని అప్యాయతతో తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్టుకే ప్రధాని మోడీ పొంగిపోతున్నారు. అన్నీ కుదిరితే అమెరికా ముందు మరోసారి సాగిలపడేందుకు ఉవ్విళ్లూరుతున్నారని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానిలో భాగంగానే వచ్చేవారం జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు ఆయన డుమ్మా కొడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ట్రంప్‌ విసురుతున్న జియో పొలిటికల్‌ వ్యూహంలోకి మోడీని లాగేందుకే ఆయనీ జిమ్మిక్కులు చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. అయితే ట్రంప్‌ భారత్‌ ప్రధాని మోడీని పొగడ్తకే పరిమితం చేశారు తప్ప, తాను విధించిన 50 శాతం టారిఫ్‌ల నుంచి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. గత వారం షాంఘైలో జరిగిన ఎస్‌సిఓ సదస్సు సందర్భంగా చైనా, భారత్‌, రష్యా దేశాల అధినేతలు కలుసుకుని, పలు అంశాలపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించినందుకు గుర్తుగా 80వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ చైనా తన సైనిక పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఆ సందర్భంలో చైనా, రష్యా, ఉత్తర కొరియా దేశాధినేతలు ఒక వేదికపై నిలిచారు. ఈ పరిణామాలన్నిటినీ క్రమ పద్ధతిలో పరిశీలిస్తే ఇప్పుడున్న ప్రపంచ బలాబలాల్లో మార్పులకు దారి తీస్తున్నట్టు స్పష్టమవుతోంది. తొలుత భారత రష్యాలను చైనాకు వదిలేశామనీ, ఆ తరువాతి రోజు రష్యా, చైనా, ఉత్తర కొరియా తమపై కుట్ర చేస్తున్నాయన్న ట్రంప్‌ వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాల మధ్య స్నేహాన్ని చెడగొట్టడమే లక్ష్యంగా ట్రంప్‌ ఇప్పుడు మోడీని ముగ్గులోకి లాగుతున్నారనే విశ్లేషణలు చోటుచేసుకుంటున్నాయి. ఇదంతా అమెరికా జియో పొలిటికల్‌ వ్యూహంలో భాగమేనని చెప్తున్నారు.

సుంకాల సంగతేమిటి?

ట్రంప్‌ వ్యూహం ట్రంప్‌నకు ఉంటే, భారత ప్రధాని మోడీ ప్రతిస్పందనపైనే ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాలు, భారతదేశ ఆర్థిక స్థితిగతులు ఆధారపడి ఉన్నాయి. సుంకాలను సాధ్యమైనంత వరకు తగ్గించాల్సిందేనని మోడీ కుండ బద్దలు కొట్టి చెప్పకుంటే, ట్రంప్‌తో స్నేహం అక్కరకు రానిదే అవుతుంది. ట్రంప్‌ ప్రతీకార సుంకాలను గట్టిగా ప్రతిఘటించిన చైనా, మెక్సికో వంటి దేశాల ధీరత్వానికి అమెరికా తలొంచకతప్పలేదు. ఆ దేశాలపై సుంకాల విధింపును పరిమితం చేయక తప్పలేదు. కానీ అందుకు భిన్నంగా భారత్‌ నుండి దిగుమతయ్యే టెక్స్‌టైల్స్‌, దుస్తులు, రొయ్యలు, చేపలు ఇతర సముద్ర ఉత్పత్తులు, లెదర్‌, వజ్రాభరణాలు సహా అన్నింటిపైనా ట్రంప్‌ ప్రభుత్వం సుంకాలను 50 శాతానికి పెంచింది. ట్రంప్‌తో మోడీ అంటకాగితే భారత్‌లో సుంకాల గురించి ప్రజలు ప్రశ్నించడం తథ్యం. ఈ పరిస్థితుల్లో మోడీ ఏం నిర్ణయం తీసుకుంటారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. మోడీ ప్రభుత్వం పార్లమెంటునుగానీ, రాష్ట్రాలను గానీ విశ్వాసంలోకి తీసుకోకుండా అమెరికాతో ఒప్పందాలకు ముందడుగులు వేసింది. ఇప్పుడు అవే తప్పటడుగులుగా నిలుస్తున్నాయి. అమెరికా పట్ల కచ్చితమైన వ్యాపార ఒప్పందాలు చేసుకోవడంలో విఫలమైన మోడీ, చివరకు ట్రంప్‌ ఒత్తిళ్లకు ధీటైన సమాధానం కూడా చెప్పలేకపోయారు. ఇప్పుడైనా ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిందే. ఈ విషయం భారతీయుల ఆత్మగౌరవానికి ముడిపడి ఉందనే విషయాన్ని ప్రధాని మోడీ గుర్తుంచుకోవాల్సి ఉంటుందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad