Saturday, December 13, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిగిగ్‌ వర్కర్స్‌ - భాగస్వాములా? బానిసలా?

గిగ్‌ వర్కర్స్‌ – భాగస్వాములా? బానిసలా?

- Advertisement -

అభివృద్ధి ముసుగులో ‘గిగ్‌’ వర్కర్ల పేరుతో కొత్త సేవలు విస్తరిస్తున్నాయి. వినిమయదారులు ఉన్న చోటికే వాహనాలు ఆన్‌లైన్‌ బుకింగ్‌తో వస్తున్నాయి. వినియోగదారులకు ఇది సౌకర్యవంతంగా ఉన్నది. మరి డ్రైవర్ల పరిస్థితేమిటి? కస్టమర్లతో వీరు వ్యక్తిగతంగా పని కుదుర్చుకొని పూర్తి చేస్తారు. దానికి పరిహారం వినియోగదారుల నుంచి పొందుతారు. ప్రత్యేకంగా ‘యాజమాన్యం- కార్మికులు’ అన్న సంబంధం ఉండదు. చేసిన కాలానికి కాకుండా, పూర్తి చేసిన పనికి పరిహారం పొందుతారు. సంప్రదాయంగా ఉండే పనిస్థలం ఉండదు. ఇది సమిష్టి, సామూహిక కృషి కాదు. ఉబెర్‌, ఓలా, పోర్టర్‌ తదితర ప్లాట్‌ ఫారాలకు అనుసంధానంగా పనిచేసే వారితోపాటు, అనుసంధానం కాని ఇతర కార్మికులు కూడా, ఈ పద్ధతిలో పనిచేసే వారంతా ‘గిగ్‌’ వర్కర్స్‌ అంటున్నారు. కానీ క్రమంగా, ప్లాట్‌ఫారంతో అనుసంధానం కాకుండా ఉండే ‘గిగ్‌’ వర్కర్స్‌ నిలదొక్కు కోవడం సాధ్యం కాదు. ఏదో ఒక యాప్‌ ప్రాతిపదికన పనిచేసే ప్లాట్‌ఫారంతో అనుసంధానం కావల్సిందే. పూర్తిగా ఇదే జీవనాధారంగా పనిచేసే వారితో పాటు, పార్ట్‌టైమ్‌ ఆదాయం కోసం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది.

ఇప్పుడిప్పుడే ఈ రంగంలో యువతులు కూడా ప్రవేశిస్తున్నారు. తెలంగాణలో 8 నుంచి 10 లక్షల మంది గిగ్‌ వర్కర్స్‌ ఉంటారు. అత్యధికులు హైదరాబాద్‌, పరిసర ప్రాంతాలలో పనిచేస్తున్నారు. వీరి పని స్వభావం స్థూలంగా అత్యంత అస్థిరమైన, అనిశ్చితమైంది. వీరికి కార్మిక చట్టాలేవీ వర్తించవు. లేబర్‌ కోడ్స్‌ కూడా వీరి సమస్యలకు పరిష్కారం చూపలేదు. యాప్‌ ప్రాతిపదికన వీరితో పని చేయిస్తున్న ప్లాట్‌ఫారాల యాజమాన్యాల మీద కూడా చట్టపరమైన పర్యవేక్షణ లేదు. వీరికి కూడా ఏ చట్టమూ వర్తించదు. కార్మికులకూ, వినియోగదారులకు మధ్య తాము మధ్యవర్తులంగానే సేవలందిస్తున్నామనీ, ఈ కార్మికులతో తమకేం సంబంధం లేదనీ ఇప్పటికే ప్రకటించారు. కార్మికుల గురించి ఎలాంటి బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరు. పైగా తాము సామాజిక సేవలందిస్తున్నామంటున్నారు. వీరికి ఆదాయమే తప్ప బాధ్యతలు లేవు.

ఏ సంబంధమూ లేదంటూనే, ఆన్‌లైన్‌లో కార్మికులను నియంత్రిస్తున్నారు. యాజమాన్యం నుంచి ఏక పక్ష నియంత్రణే తప్ప, కార్మికులు సంప్రదించేందుకు, ఫిర్యాదు చేసేందుకు అవకాశం లేదు. కార్మికులుగా వీరికి గుర్తింపు లేదు. పని భద్రత లేదు. సెలవులు, వైద్యం, ప్రావిడెంట్‌ ఫండ్‌, పెన్షన్‌ లాంటి సామాజిక భద్రతలేవీ వర్తించవు. పరిమిత ఆదాయం, అది కూడా స్థిరంగా ఉండదు. భౌతిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడులు పెరుగుతున్నాయి. గిగ్‌ ఆర్థిక వ్యవస్థ గొప్ప ముందడుగుగా ప్రచారం జరుగుతున్నది. యువతకు కొత్త అవకాశాలు అందిస్తున్నదని చెబుతున్నారు. ఈ పనికి ముద్దుపేర్లు పెట్టి మభ్యపెడుతున్నారు. కార్మికులు అని కాకుండా భాగస్వాములు (పార్ట్‌నర్స్‌) అని అంటున్నారు. నిజానికి బానిసలని చెప్పవచ్చు. వీరిని స్వతంత్ర కాంట్రాక్టర్లుగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వీరు స్వతంత్రులుగా కనిపిస్తున్నప్పటికీ, స్వతంత్ర కార్మికులుగా కూడా లేరనేది స్పష్టం. ప్లాట్‌ఫారాల యాజమాన్యాల చుట్టూ, దిక్కులేని పక్షుల్లా తిరగవల్సి వస్తున్నది. మరో ప్రత్యామ్నాయం లేకనే ఈ పనిలో ఉండవల్సి వస్తున్నది.

ఈ పని ఎప్పుడైనా ఉపయోగించుకోగలిగే విధంగా, కార్మికులకు అనువైనదిగా చెబుతున్నారు. కార్మికుల మీద ఎవరి నియంత్రణ, ఆధిపత్యం లేని స్వయం ప్రతిపత్తి ఉంటుందన్నారు. తమ పని మీద తమకే అధికారం, పట్టు ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. వెంటవెంటనే చెల్లింపులు జరుగుతాయనీ, ఎక్కువ సమయం పని చేసి ఎంతైనా సంపాదించుకోవచ్చంటున్నారు. పనిలో చేరడానికి ఎలాంటి అవరోధాలు లేవు. ఒక సెల్‌ఫోన్‌, వాహనం, కనీసస్థాయిలో చదువుంటే చాలు అంటున్నారు. ఉపాధి సమస్యలు, నిరుద్యోగ సమస్య నుంచి ప్రజల దృష్టి మరలించడానికే ఈ వాదనలు. పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకోసమే ఈ ప్రచారాలు. గిగ్‌ వర్కర్స్‌ అభద్రతా భావంతో సతమతమవుతున్నారు. అయినప్పటికీ వేగంగా విస్తరించడానికి రెండు కారణాలు. గిగ్‌ వర్కర్స్‌ అందించే సేవలు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. చవక గానూ, అందుబాటులో ఉంటున్నాయి. అందువల్ల వినియోగదారులు వీరి సేవలకు ఆకర్శితులవుతున్నారు. వినియోగదారులకది సౌకర్యవంతమైనదే! కానీ ‘గిగ్‌’ వర్కర్ల పాలిట శాపంగా తయారైంది. పెరుగుతున్న డిమాండ్‌ను ఉపయోగించుకొని, ప్లాట్‌ఫారాల యాజమాన్యాలు, యువత శ్రమను పిండుకుంటున్నారు.

రోడ్డు ప్రమాదాలు, బెదిరింపులు జరిగినప్పుడు వీరికి భద్రత లేదు. వినియోగదారులు డబ్బు చెల్లించకపోతే యాజమాన్యానికి బాధ్యత లేదు. పోలీసులు చలానా వేస్తే డ్రైవర్‌ భరించవల్సి వస్తున్నది. బుక్‌ చేసి మధ్యలో క్యాన్సిల్‌ చేస్తే మినిమమ్‌ ఫేర్‌ లేదు. వెయిటింగ్‌ చార్జీ లేదు. రోడ్‌ బ్లాక్‌ అయినా, ట్రాఫిక్‌ సమస్య ఏర్పడినా రేటు మారదు. పైపులు, కంకర, ఇసుక, పశువుల రవాణాకు వేర్వేరు వాహనాలు ఉపయోగించాలి. వాహనంలో అదనపు లోడ్‌, అదనపు ఎత్తు లేదా పొడవు సరుకు లోడ్‌ చేయ టం చట్ట విరుద్ధం. అంగీకరించకపోతే డ్రైవర్లదే బాధ్యతగా క్యాన్సల్‌ చేస్తున్నారు. అంగీకరిస్తే పోలీసులు వేధిస్తున్నారు. ఒకే బండి, ఒకే కిరాయితో ముగ్గురు, నలుగురు కస్టమర్ల నుంచి సరుకు పిక్‌అప్‌ బుక్‌ చేస్తున్నారు. లోడింగ్‌, అన్‌లోడింగ్‌ పనులు కూడా డ్రైవర్లే చేయాలని వత్తిడి చేస్తున్నారు.

ప్లాట్‌ఫారం యాజమాన్యం కస్టమర్లకు వెయింటింగ్‌ టైమ్‌ సౌకర్యం ఇస్తారు. ఆ భారం డ్రైవర్ల మీద పడుతున్నది. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్‌లో 20 నుంచి 30 నిమిషాలు వృధా అవుతున్నది. ఎయిర్‌పోర్టుకు పోయేటపుడు చెల్లించే రేటు, తిరుగు ప్రయాణంలో ఇవ్వటం లేదు. గిగ్‌ వర్కర్స్‌కు టాయిలెట్స్‌, మంచినీరు, పార్కింగ్‌ స్ధలం, నిలువ నీడ వంటి సమస్యలున్నాయి. వారంలో కనీసం 75 గంటలు పనిచేసి, అరవై శాతం పనితనం ప్రదర్శించిన వారికి మాత్రమే ఇన్యూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ ఇందుకు అనేక ఆంక్షలు. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య లాగిన్‌ అయ్యింది మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. మిగిలిన సమయంలో తీసుకున్న బుకింగ్స్‌, లాగిన్‌ సమయం పరిగణలోకి తీసుకోరు. రోడ్డు ప్రమాదం జరిగితే, ఆ వారంలో 72 గంటలు లాగిన్‌ అయి ఉంటేనే వర్తిస్తుంది.

కొన్ని యాజమాన్యాలు తమకూ, డ్రైవర్లకు మధ్య వెండార్స్‌ పేరుతో కొందరితో ఒప్పందం చేసుకుంటున్నారు. దగ్గరి బుకింగ్స్‌ అన్నీ వెండార్స్‌ పోతాయి. డ్రైవర్లను వెండార్స్‌ వైపు నెట్టుతున్నారు. కస్టమర్లు డ్రైవర్లకు నగదు చెల్లించినప్పటికీ, వీరు యాజమాన్యానికి ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. జమ చేయాల్సిన మొత్తం రూ.2 వేలు దాటితే బుకింగ్స్‌ ఆగిపోతాయి. చెల్లించిన తర్వాతనే మొదలవుతాయి. సాధారణంగా రేట్లు పెరుగుతూ ఉండాలి. డ్రైవర్ల ఆదాయం పెరుగుతూ ఉండాలి. కానీ గత సంవత్సరంతో పోల్చితే సగానికి పడిపోయింది. యాజమాన్యాల వేధింపులకు అడ్డు, అదుపూ లేదు. బుకింగ్స్‌ ఒప్పకోలేదనే పేరుతో యాప్‌ ప్లాట్‌ఫారం నుంచి సస్పెండ్‌ లేదా డిస్మిస్‌ చేస్తారు. ఎక్కువ బుకింగ్స్‌ క్యాన్సిల్‌ అయినా ఐడీ బ్లాక్‌ చేస్తున్నారు. ఒకసారి సస్పెండ్‌ అయిన డ్రైవర్‌ మళ్లీ ప్లాట్‌ఫారంతో అనుసంధానం కావాలంటే పోలీసుల దగ్గర నుంచి లెటర్‌ తేవాలంటున్నారు. ప్యాసింజర్‌ ఆటోలకు గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు బుకింగ్‌ ఇస్తున్నారు. ఒప్పుకోకపోతే సస్పెండ్‌ చేస్తున్నారు. ఒప్పుకుంటే పోలీసులు చలాన్లు వేస్తున్నారు.

కొత్తలో డ్రైవర్లకు ఆకర్షణీయమైన ఆదాయం ఉంటుందని నమ్మించారు. క్రమంగా కస్టమర్లను ఆకర్శించేందుకు రేటు తగ్గిస్తూ వచ్చారు. కానీ యాజమాన్యం కమీషన్‌ మాత్రం పెంచుకుంటున్నది. వెయిటింగ్‌ టైమ్‌కు కస్టమర్‌ మీద అదనంగా రేటు పెంచిన సందర్భాలలో కూడా ఆ డబ్బు కూడా తీసుకుంటున్నది. డ్రైవర్‌ చాలా దూరం ప్రయాణించిన తర్వాత, చివరి సమయంలో కస్టమర్‌ క్యాన్సల్‌ చేస్తే, కస్టమర్‌ మీద వేసే జరిమానా డబ్బు కూడా యాజమాన్యమే తింటున్నది. పెట్రోల్‌/డీజిల్‌ ఖర్చు భరించేది, సమయం నష్టపోతు న్నది డ్రైవర్లు. తమ వాహనం మీద కంపెనీ అడ్వర్‌ట్తైజ్‌మెంట్‌ స్టిక్కర్‌ వేయాలి. అందుకు యాజమాన్యం చెల్లించేది కేవలం వెయ్యి రూపాయలు. కానీ చిన్న గీతపడినా రూ.5 నుండి 7 వేలు ఖర్చు పెట్టి కొత్త స్టిక్కర్‌ వేయాలి. మార్కెట్‌లో ప్లాట్‌ఫారాల మధ్య పోటీలో వినియమదారులకు రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు. నష్టపోతున్నది డ్రైవర్లే. సాధా రణంగా కస్టమర్లు గమ్యం చేరిన తర్వాత ఫీడ్‌బ్యాక్‌ ఆప్షన్‌ పట్టించుకోరు. ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వకపోయినా. ఆదాయం కోత పెట్టి యాజమాన్యం మింగుతున్నది. కమీషన్‌కు అదనంగా యాజమాన్యాలు ప్లాట్‌ఫారం చార్జీ పేరుతో అదనంగా రూ.20 కోత పెడుతున్నారు.

మొత్తం మీద, వీరిమధ్య పోటీలో కస్టమర్లను నిలుపుకునేందుకు, పెంచుకునేందుకే ప్రాధాన్యత. కష్టాలు డ్రైవర్లకూ, లాభాలు యాజమా న్యాలకు. రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకులు, డ్రైవర్లు గాయపడినా, వాహనం ధ్వంసమైనా….ప్లాట్‌ఫారం యాజమాన్యం ప్రయాణికుల కోసం మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైవర్లను పట్టించుకోరు. పైన చెప్పిన సమస్యలతో పాటు పెరుగుతున్న వలసల ప్రభావం కూడా వెన్నాడుతున్నది. యాజమాన్యం సొంత వాహనాలకు, వెండార్స్‌ వాహనాల, లీజుకు పెట్టిన వాహనాలకు వలస డ్రైవర్లను నియమించి తక్కువ రేట్లతో పని చేయించుకుంటున్నారు. లోడింగ్‌, ఆన్లోడింగ్‌ వంటి పనులు కూడా ఉచితంగా చేయించుకుంటున్నారు. ఒకే దేశం-ఒకే పన్ను విధానం కూడా యాజమాన్యాల దోపిడీకి బాగా ఉపయోగపడుతున్నది.
ఈ బాధలు భరించలేక, ప్లాట్‌ఫారాల బంధం వదులుకొని, వ్యక్తిగతంగా వాహనాలు నడుపుకుందామనుకుంటే సాధ్యం కావటం లేదు. వ్యక్తిగతంగా రవాణా రంగంలో నిలదొక్కుకునే పరిస్థితి పోతున్నది. దీనివల్ల సంప్రదాయ పద్ధతిలో బతకలేక, కొత్త పద్ధతిలో యాజమాన్యాల దోపిడీ, వేధింపులు తాళలేక డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న గిగ్‌ వర్కర్ల పరిస్థితి నడిసముద్రంలో దిక్సూచి లేని నావలాగా తయారైంది. కార్మికోద్యమానికి ఇదొక కొత్త సవాలుగా నిలిచింది.

ఎస్‌.వీరయ్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -