Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబ్యాట్‌ దొంగతనానికి వచ్చి బాలిక హత్య

బ్యాట్‌ దొంగతనానికి వచ్చి బాలిక హత్య

- Advertisement -

– ఇంటి పక్క బాలుడే నిందితుడు
– కూకట్‌పల్లి హత్య కేసును ఛేదించిన పోలీసులు
– వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి
– కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదుట బాధిత తల్లిదండ్రుల ధర్నా
– ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య పరామర్శ


నవతెలంగాణ – మియాపూర్‌/కూకట్‌పల్లి
హైదరాబాద్‌ నగరంలో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి పక్క బాలుడే హత్య చేసినట్టు నిర్ధారించారు. బ్యాట్‌ దొంగతనం కోసం వచ్చిన బాలున్ని బాలిక అడ్డుకోవడం వల్లే చంపేసినట్టు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి శనివారం సీపీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈనెల 18వ తేదీన తల్లిదండ్రులు పనికెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేండ్ల బాలిక మధ్యాహ్నం హత్యకు గురైంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో బాలిక ఇంటి పక్కనే ఉండే ఓ బాలుడిపై అనుమానంతో విచారించగా.. తెలివిగా సమాధానాలు చెప్పి తప్పించుకున్నాడు. బాలిక ఇంటి నుంచి అరుపులు వినిపించాయని చెప్పాడు. అనంతరం ఆ బాలుడిని విడిచిపెట్టారు. అనుమానితులందరినీ విచారి స్తున్న క్రమంలో ఆ బాలుడి ముఖ కవళికలపైనే అనుమానం రావడంతో మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.

ఈసారి గట్టిగా విచారించగా.. బాలికను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. ఆ రోజు బాలిక ఇంట్లో ఎవరూ లేరనుకుని బ్యాట్‌ దొంగతనం కోసం బాలుడు వెళ్లాడు.. అయితే, ఆ సమయంలో బాలిక చూసి కేకలు వేయడంతోపాటు అతన్ని అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఆమెను మంచంపైకి తోశాడు. విషయం బయటకు పొక్కుతుందని భావించి తన వెంట తీసుకెళ్లిన కత్తితో బాలికను విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం నిందితుడు తన ఇంటికి వెళ్లి రక్తం మరకలు ఉన్న షర్ట్‌ను వాషింగ్‌ మిషన్‌లో వేసి వేరొక షర్ట్‌ వేసుకున్నాడు. ఆ తరువాత తనకేమీ తెలియనట్టు బాలిక ఇంటి పరిసర ప్రాంతాల్లోనే తిరిగాడు. పోలీసుల విచారణను గమనిస్తూ.. వారిని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే బాలుడు పాఠశాలకు వెళ్లకపోవడం, సినిమాలు, ఓటీపీ యాప్‌లో ఎక్కువ క్రైమ్‌ మూవీస్‌ చూసేవాడని, దాని ప్రభావంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సీపీ వెల్లడించారు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లి సంగీతనగర్‌లో బాలిక ఇంటి సమీపంలో నివాసముం టున్నారు. వారి కుమారుడు (హత్య కేసులో నిందితుడు) బాలిక తమ్ముడు చదివే పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్నాడు.

మా బిడ్డను చంపిన వాడిని కఠినంగా శిక్షించాలి : తల్లిదండ్రులు
తమ బిడ్డను చంపిన వాడు అదే విధంగా చావాలంటూ కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మృతురాలు సహస్ర తల్లిదండ్రులు రేణుక, కృష్ణ, బంధువులు శనివారం ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా సహస్ర తల్లి మాట్లాడుతూ.. తమ పాపకు జరిగినట్టు మరెవ్వరికీ జరగొద్దని, వాడిని మైనర్‌గా పరిగణనలోకి తీసుకోవద్దని, క్రూరమైన హంతకుడిగానే పరిగణించి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కఠిన చట్టం తీసుకురావాలని, ఇలాంటివి చేయాలంటేనే భయపడేలా నిందితుడిని శిక్షించాలని అన్నారు. తమ బిడ్డను చంపినట్టుగానే నిందితున్ని చంపాలని, ఇలాగే వదిలేస్తే తన లాంటి తల్లులు ఎంతో మంది కడుపుకోత అనుభవిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రూపాయి రూపాయి కూడబెట్టుకుని పిల్లలను పోషించుకుంటున్నామని.. ఇంత చిన్న వయసులో ఇలా చంపాలనే ఆలోచన ఎలా వచ్చిందని, మా బిడ్డను అన్ని కత్తి పోట్లు ఎలా పొడిచాడని కన్నీరు పెట్టుకున్నారు. నిందితున్ని మా ముందుకు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

సహస్ర చట్టం తీసుకొస్తాం : ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య
కూకట్‌పల్లిలో హత్యకు గురైన బాలిక కుటుంబ సభ్యులను తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య పరామర్శించారు. సంగీతనగర్‌లోని బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వాళ్లకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాలికను అతి కిరాతకంగా చంపిన నిందితునికి కఠినంగా శిక్షిపడేలా చర్యలు తీసుకుని.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను కోరినట్టు చెప్పారు. బాధిత కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ చట్టం ద్వారా, ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందేలా చూస్తానని హామీనిచ్చారు. మరోసారి ఇలాంటి నేరాలు జరగకుండా సహస్ర పేరుతో ప్రత్యేక చట్టం తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సహస్ర కుటుంబానికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌, ఎక్స్‌గ్రేషియా, ఇతర పథకాలు వచ్చేలా చూస్తామని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad