– దేశీయ కోటా పెంచండి
– జహీరాబాద్ ఇండిస్టియల్ స్మార్ట్ సిటీకి సహకరించండి
– వరంగల్ విమానాశ్రయానికి ఆర్థికసాయం చేయండి
– హైదరాబాద్-బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి : కేంద్ర మంత్రులు పీయూశ్ గోయల్, జేపీ నడ్డాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మంగళవారం కేంద్రమంత్రిని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. వర్షకాలం సీజన్‌కు సంబంధించి ఏప్రిల్-జూన్ నెలల మధ్య 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కావల్సి ఉండగా, కేవలం 3.07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు రావడంతో సాగు పనులు ప్రారంభమయ్యాయనీ, యూరియా సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని కోరారు. జులై నెలకు సంబంధించి 63 వేల మెట్రిక్ టన్నులు దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా, 97 వేల మెట్రిక్ టన్నుల విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారని వివరించారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణకు పెంచాలనికోరారు. యూరియా సరఫరా కోసం రైల్వే శాఖ తగిన రేక్‌లు కేటాయించడం లేదనీ, వాటి సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రి పీయూశ్ గోయల్‌తో భేటీ
జహీరాబాద్ ఇండిస్టియల్ స్మార్ట్ సిటీ అభివద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. దీనికోసం జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్ట్ (ఎన్‌ఐసీఐటీ) ఆమోదించిన రూ.596.61 కోట్లను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్ ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని పేర్కొంటూ వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని అభ్యర్ధించారు. హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్ సాధ్యాసాధ్యాల అధ్యయనం చేస్తున్నామని కేంద్రమంత్రికి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆదిభట్లలో రక్షణ, ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేసిందనీ, అందువల్ల హైదరాబాద్-బెంగళూర్ పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్ కారిడార్‌గా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధి ప్రతిపాదనలు ఇస్తామనీ, ఇక్కడ వందకు పైగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కేంద్రమంత్రుల్ని కలిసిన బృందంలో సీఎంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు ఉన్నారు.
మాజీ పీఎం చంద్రశేఖర్‌కు నివాళి
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా కే చంద్రశేఖర్ రాణించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ప్రధాన మంత్రులుగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకునిగా పలు విధాన నిర్ణయాల్లో చంద్రశేఖర్ ప్రభుత్వానికి అండగా నిలిచారని చెప్పారు.
వైఎస్‌ఆర్‌ది చెరగని ముద్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (వైఎస్‌ఆర్) చెరగని ముద్ర వేశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి తన అధికారిక నివాసంలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం, ఔటర్ రింగు రోడ్డు, పింఛన్ల పెంపు వంటి కార్యక్రమాలతో ఉమ్మడి రాష్ట్ర ప్రజల్లో వైఎస్‌ఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని తెలిపారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ఆయన ఎప్పుడూ చెప్పేవారనీ, ఆ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు.