– పెట్టుబడులపై కట్టుకథలు : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రైజింగ్-2047 పేరుతో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. పెట్టుబడులపై కట్టుకథలు చెప్పి గ్లోబల్ సమ్మిట్‌కు రూ.కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. విజన్ డాక్యుమెంట్‌లో విజన్ లేదనీ, దాన్ని చేరుకునే మిషన్ లేదనీ, అది విజన్ డాక్యుమెంట్ కాదనీ, ‘విజన్ లెస్’ డాక్యుమెంట్ అని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ లేవని తెలిపారు. రెండేండ్లుగా రూ.కోట్లు ఖర్చు చేసి తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని రూ.కోట్ల పెట్టుబడులు వచ్చాయి? అందులో ఎన్ని కంపెనీలు స్థాపించబడ్డాయి, ఎంత మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని బహిరంగ సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి గ్లోబల్ సమ్మిట్ వేదికగా టోనీ బ్లెయిర్, దువ్వూరి సుబ్బారావు ఇచ్చిన కితాబు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని తెలిపారు. అది గ్లోబల్ సమ్మిట్ లాగా లేదనీ, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో లాగా ఉందని ఆరోపించారు. రెండేండ్ల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్‌రెడ్డి చేసిన పబ్లిసిటీ స్టంట్ గ్లోబల్ సమ్మిట్ అని తెలిపారు. 18 రాష్ట్రాల సీఎంలు, ఐదు వేల మంది విదేశీ ప్రతినిధులు వస్తరని ప్రకటించారనీ, మంత్రులు పోయి ఒక్కో ముఖ్యమంత్రికి స్వయంగా ఆహ్వాన పత్రికలను అందించారని గుర్తు చేశారు. కనీసం ఒక్క ముఖ్యమంత్రి రాలేదనీ, ఐదు వేల మంది విదేశీ ప్రతినిధుల్లో ఎక్కువ మంది రాలేదని తెలిపారు. ఏఐసీసీ నేతలు కూడా రాలేదనీ, ఒక్క డీకే శివకుమార్ తప్ప కాంగ్రెస్ ఎంపీలు కూడా రాలేదని పేర్కొన్నారు. అది గ్లోబల్ సమ్మిట్ కాదనీ, లోకల్ సమ్మిట్ అని అట్టర్‌ఫ్లాప్ పొలిటికల్ షో అని తెలిపారు. ఫార్మా సిటీ పక్కన ఉన్న భూములు ముందుగానే సీఎం బినామీలతో కొనిపించి లే అవుట్లు చేసి రెడీగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు అక్కడ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి ఆ భూములను తెగనమ్మడానికి ప్రణాళిక వేశారని తెలిపారు. ఈ సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాంకు తెరతీశారని ఆరోపించారు.
గ్లోబల్ సమ్మిట్ అట్టర్‌ఫ్లాప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



