నవతెలంగాణ-వనపర్తి : గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నైట్‌క్లబ్ ఓనర్లు అయిన గౌరవ్ , సౌరభ్ లూత్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదం అనంతరం ఈ ఇద్దరూ థాయ్‌లాండ్ కు పారిపోయిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన ఐదు రోజుల అనంతరం పుకెట్‌లో వీరిని భారత దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది.
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గోవాలోని అర్పోరాలోని క్లబ్, బిర్చ్ బై రోమియో లేన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం తర్వాత కొన్ని గంటలకు లూత్రా సోదరులు ఇండిగో విమానంలో థాయ్‌లాండ్‌కు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే లూత్రా బ్రదర్స్ పాస్‌పోర్టులను కూడా అధికారులు రద్దు చేశారు.



