– ‘తెలంగాణ బ్రాండ్’ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
– 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు
– 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలు
– సమన్వయం కోసం స్పెషల్ ఆఫీసర్, నోడల్ అధికారులు
– మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ‘గోదావరి పుష్కరాలు-2027’ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సంఘం సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. పుష్కరాల నిర్వహణ, ఆయా శాఖల సన్నద్ధత, భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డి నేతృత్వంలో సరస్వతీ పుష్కరాలు, సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిందని తెలిపారు. అదే స్ఫూర్తితో మరింత రెట్టించిన ఉత్సాహంతో రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. ఈ పుష్కరాలకు ఎనిమిది కోట్ల మంది భక్తులు తరలి వచ్చే అవకాశముందన్నారు. అందుకనుగుణంగానే గోదావరి ప్రవహించే జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశామన్నారు.
ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయల కల్పనపైన్నే ఫోకస్
కొన్నేండ్లుగా జరుగుతున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ప్రణాళికలను సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరంగా పనుల్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల చివరి నాటికి డీపీఆర్‌లను పూర్తి చేయాలని ఆదేశించారు. తొలి దశలో భాగంగా రద్ధీగా ఉండే తొమ్మిది ప్రాంతాలను ‘టైర్ 1’ కింద ఎంపిక చేశామన్నారు. సమన్వయ లోపం తలెత్తకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. ప్రతిఘాట్ దగ్గర ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఎమర్జెన్సీ రూట్, అత్యాధునిక వైద్య సౌకర్యాలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. పుష్కర ఏర్పాట్లలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.
బాసర నుంచి భద్రాచలం వరకు
వచ్చే ఏడాది జరుగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి సమగ్ర రోడ్ల అనుసంధానం కల్పించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. బాసర, భద్రాచలం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాలే కాకుండా మధ్యలో ఉన్న ఇతర ప్రముఖ దేవాలయాలకు కూడా సౌకర్యవంతమైన రోడ్ల కనెక్టివిటీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. భద్రాచలం దేవస్ధానం మాస్టర్ ప్లాన్‌కు ముఖ్యమంత్రి ఆమోదం తీసుకోవాలన్నారు.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



