ట్రంప్, నెతన్యాహూలపై ఫత్వా జారీ చేసిన మత నేత
వారికి సహకరిస్తే నిషేధం తప్పదని స్పష్టీకరణ
జెరుసలేం : సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ, ఇతర సీనియర్ షియా మత పెద్దలపై వస్తున్న బెదిరింపులను ఇరాన్ మత నేత గ్రాండ్ అయతొల్లా మకరం షిరాజీ సోమవారం తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మతపరమైన ఆదేశాలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూలను దేవుని శత్రువులుగా ప్రకటిస్తూ ఆయన అరబిక్ భాషలో ఫత్వా జారీ చేశారని, మతపరమైన డిక్రీ ద్వారా వారి చర్యలను ఖండించారని జెరుసలేం పోస్ట్ పత్రిక తెలియజేసింది. ‘ఇస్లామిక్ వ్యవస్థకు, మత అథారిటీకి, నాయకత్వానికి మూల స్తంభంగా నిలిచిన ఏ వ్యక్తి ప్రాణాలకైనా…ముఖ్యంగా సుప్రీం నేతకు హాని తలపెడితే అది మతపరంగా నిషిద్ధమే అవుతుంది’ అని షిరాజీ తన ఫత్వాలో రాశారు.
ముప్పును ఎదుర్కొంటున్న వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని, అలాంటి బెదిరింపులకు పాల్పడే వారితో ఘర్షణ పడకతప్పదని ఆయన స్పష్టం చేశారు. ఆ పవిత్రతను ఉల్లంఘించడం పాపమేనని తెలిపారు.
ప్రపంచంలోని ముస్లింలు అందరూ ఏకం కావాలని, ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరించిన అమెరికా, ఇజ్రాయిల్ నాయకులను గద్దె దించాలని షిరాజీ పిలుపునిచ్చారు. ఈ శత్రువులకు ముస్లింలు లేదా ఇస్లామిక్ దేశాలు మద్దతు కానీ, సహకారం కానీ అందిస్తే నిషేధానికి గురవుతారని హెచ్చరించారు. ‘ప్రపంచంలోని ముస్లింలు అందరూ ఇలాంటి శత్రువులకు, వారి బహిరంగ నేరాలకు వ్యతిరేకంగా ఏకం కావాలి. వారు కూడా ఇలాంటి చర్యలకే పాల్పడితే తీవ్రమైన, దైవ సంబంధమైన శిక్షకు గురవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి సందేహానికి తావు లేకుండా వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం’ అని ఫత్వాలో పేర్కొన్నారు. బహిరంగ నేరాలకు పాల్పడే వారు దేవునిపై యుద్ధం ప్రకటించే వారేనని, వారు దేవుడికి, దేశానికి వ్యతిరేకంగా శత్రుత్వం పెంచుకుంటారని ఫత్వా తెలిపింది. దేవునిపై యుద్ధం ప్రకటించే వారికి ఇరాన్‌లో మరణశిక్ష విధిస్తారు.న