Sunday, October 26, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిగూగుల్‌ సెంటర్‌ క్రెడిట్‌ 'వార్‌'

గూగుల్‌ సెంటర్‌ క్రెడిట్‌ ‘వార్‌’

- Advertisement -

పది రోజుల కిందట విశాఖపట్టణంలో గూగుల్‌ ఎ.ఐ డేటా సెంటర్‌ ప్రకటన, సంతకాలు జరిగినప్పటి నుంచి ఏపీ లోనే అదో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరో విధంగా చూస్తే దేశంలో ప్రపంచంలో కూడా ఎ.ఐ డేటా సెంటర్ల గురించి, వాటి ప్రభావం గురించి విస్తారమైన చర్చ జరుగుతున్నది. ఇక ఏపీలో షరామామూలుగా టీడీపీ, వైసీపీల మధ్య డేటా సెంటర్‌ సాధన ఘనత ఎవరిదన్న రభస సాగుతున్నది. దీన్ని స్థాపించడం నిజంగా అసాధారణ స్థాయిలో చెప్పుకోదగిన విజయమా లేక రుద్దబడిందా అనేది మరో చర్చ. దీనివల్ల లాభం ఎంత? ముఖ్యంగా కొత్తగా వచ్చే ఉద్యోగాలెన్ని? అనేదానిపైనా రకరకాల వాదనలు. అసలు ఇది ఎవరిదన్న ప్రశ్న కూడా ముందుకొచ్చింది. వీటికి సమాధానాలు తెలుసుకోవడం అవసరమే గాక అనివార్యం కూడా అవుతున్నది. ఇందుకు సంబంధించి నేతల పోటాపోటీ ప్రకటనలు, ఆరోపణలు, ఆర్భాటాలు గాకుండా వాస్తవంగా గత ఆరేడేండ్లలో వాస్తవంగా జరిగిందేమిటో ఇప్పుడు జరుగుతున్నదేమిటో నిర్దిష్టంగా చూద్దాం.

క్రెడిట్‌ వార్‌
గూగుల్‌ ఎ.ఐ డేటా సెంటర్‌ ఘనమైందా కాదా అనేది తర్వాత. అసలు ఎవరు తెచ్చారు? చంద్రబాబు నాయుడు హయాంలో 2019 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, అదానీ గ్రూపునకూ మధ్య అవగాహన కుదిరింది. రూ.70 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ రాబోతున్నట్టు జనవరి 9న దీనిపై చంద్రబాబు ట్వీట్‌ చేశారు. తదుపరి ఎన్నికల్లో ఓడిపోయారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో కరోనా ముగింపు దశలో అదానీ గ్రూపు మళ్లీ చర్చలు మొదలుపెట్టింది. అదానీ తాడేపల్లిలో జగన్‌ అధికార నివాసంలో చర్చలు జరిపి వెళ్లారు. 2023 మే 23న అదానీ డేటా సెంటర్‌ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ‘అదానీ బిగిన్స్‌ వర్క్‌’ అని ఇంగ్లీషు వాణిజ్య పత్రికలు కూడా వార్తలు ప్రచురించాయి. ఆ రోజున శంకుస్థాపనకు అదానీ రాలేదు. ఆయన కుమారులైన జీతూ, గౌతం అదానీలు హాజరైనారు. 21,844 కోట్ల పెట్టుబడితో సెంటర్‌ వస్తుందని 1800 మందికి ప్రత్యక్షంగా 32వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించి ఇందుకోసం 60.29 ఎకరాలు కేటాయించారు. చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందంలో కొన్ని అంశాలను తాము మార్పు చేయించామన్నారు.

జగన్‌ 2024లో ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2024 డిసెంబర్‌ 5న గూగుల్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి దానిపై ఐ.టి మంత్రి లోకేశ్‌ తరచూ చెబుతూ వచ్చారు. హైదరాబాద్‌కు గూగుల్‌ రావడానికి ఇంతకాలం పడితే ఏపీకి ఏడాదిలోనే వచ్చేసిందన్నారు. చంద్రబాబు మైక్రోసాఫ్ట్‌ తెస్తే, లోకేశ్‌ బాబు గూగుల్‌ తెచ్చాడన్నారు. అక్టోబర్‌ 15న ఢిల్లీలో ‘భారత ఎ.ఐ శక్తి సమిట్‌’ పేరిట జరిగిన ఈవెంట్‌లో సంతకాలు ప్రకటించారు. ఈ మొత్తం సందడిలో ఎక్కడా అదానీ పేరు వినిపించలేదు. కేంద్ర రాష్ట్ర నేతల సమక్షంలో జరిగిన ఒప్పందంలోనూ అదానీ కనిపించలేదు. కానీ గూగుల్‌ క్లౌడ్‌ సిఇవోగా వున్న థామస్‌ కురియన్‌ అదానీని ముందు కలిశారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నందుకు గర్వంగా వుందని అదానీ ట్వీట్‌ చేశారు. ప్రపంచ కుబేరుల జాబితాలు ప్రకటించే ‘ఫోర్బ్స్‌’ పత్రిక అదానీ గూగుల్‌తో కలసి దీన్ని స్థాపిస్తున్నట్టు వార్త ఇచ్చింది. ‘రాయిటర్స్‌’ కూడా అదే పేర్కొంది. మరి ప్రధాని మోడీగానీ చంద్రబాబు, లోకేశ్‌లు గానీ ఈ హడావుడిలో అదానీ పేరు ఎందుకు పక్కన పెట్టినట్టు? ఆఖరుకు సర్కారును బలపర్చే మీడియా కథనాల్లోనూ ఎక్కడా ఆ పేరే రాలేదే? ఇక్కడ తామే తెచ్చామని వాదించిన వైసీపీ వారు కూడా అదానీ పేరు తీసుకురాలేదు.

ఈ చర్చ వచ్చాకనే చిన్న వివరణతో సరిపెట్టడానికి ప్రయత్నించారు. అప్పటికీ అదానీ కేవలం కాంట్రాక్టరు మాత్రమేనన్నట్టు కొందరు అధికార ప్రతినిధులు చెప్పుకొచ్చారు. వైసీపీ విషయానికి వస్తే ఏకంగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కేవలం అదానీ వల్లనే, ఆయన సింగపూర్‌ వెళ్లి సముద్ర గర్భంలో కేబుళ్లు వేసేందుకు ఏర్పాటు చేసినందువల్లనే ఈ డేటా సెంటర్‌ సాధ్యమైందని కుండబద్దలు కొట్టి మరీ ప్రకటించారు. అదానీకి క్రెడిట్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నలు గుప్పించారు. విషయం ఏమంటే గూగుల్‌ అదానీ ఒప్పందం మోడీ చలవతో కుదిరితే రెండు ప్రాంతీయ పాలక పార్టీలు తలవంచాయన్నమాట. ఇందువల్ల ఆర్థిక క్రెడిట్‌ మొత్తం అదానీ ఖాతాకే జమ అవడం తథ్యం. గంగవరం, కృష్ణపట్టణంతో సహా ప్రతి చోటా అదానీ చొరబాటు చూస్తున్న ప్రజల స్పందనను తగ్గించేందుకే ఏలినవారు గూగుల్‌ ప్రచారానికే పరిమితమయ్యారన్నమాట.

సాంకేతిక విజయమేనా?
ఇక అశ్వమేధ యాగంలో రాజ్యాలు జయించినట్టు అందరితో పోటీ పడి మరీ గొప్ప శక్తియుక్తులతో దీన్ని తీసుకొచ్చామనేది టిడిపి నేతల హంగామా. కర్నాటక, తమిళనాడుల రాజకీయాలు కూడా ఇందులో తోడైనాయి. తాము దీనికోసం ఎగబడలేదనీ, 22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడానికి సిద్ధపడలేదని కర్నాటక మంత్రి ప్రియాంక ఖర్గే అంటున్నారు. తమిళుడైన గూగుల్‌ సిఇవో సుందర్‌ పిచారు భారత దేశాన్ని ఎంచుకున్నారని లోకేశ్‌ ముక్తాయించారు. ఏపీతో అదానీ అనుబంధం ఇందుకు కీలకమైందని స్పష్టంగా కనిపిస్తూనే వుంది. అదలా వుంచితే ఎ.ఐ డేటా సెంటర్‌ కేవలం వరమేనా? శాపం లక్షణాలు కూడా వున్నాయా? ఎన్‌డిటివి అదానీ గ్రూపు యాజమాన్యం (లోకి) తెచ్చుకున్న సంస్థ. ఈ విషయమై అక్టోబరు 16న ఎస్‌విబి భట్టాచార్య అనే నిపుణుని వ్యాసం ప్రచురించింది. దాని శీర్షికలోనే దీంతో ముడిపడిన సమస్యలను సూచించింది, సాంకేతికంగా కలిగే లాభాలను చెబుతూనే పర్యావరణ పరంగా తలెత్తే సవాళ్లనూ చెప్పింది.

అంతకు మించి సాంకేతిక రంగంలోనూ భారతదేశం స్వంతంగా ఎదగడానికి ఇది ఎలా ప్రతిబంధకాలు సృష్టించగలదో చెప్పింది. డేటా సేకరణ వల్ల దేశానికి రాజకీయ వాణిజ్య రంగాల్లో దేశ సార్వభౌమతాన్నికి ఆటంకాలు ఏర్పడతాయని స్పష్టం చేసింది (ఈ రచన వ్యక్తిగతమైనా నేటి మీడియా పరిస్థితుల దృష్ట్యా అదానీ గ్రూపు సంస్థలో ప్రచురించడమే ఒక సంకేతం.). సాంకేతికంగా దీనివల్ల భారత దేశానికి ఒరిగేదేమీ వుండదు. ఎందుకంటే ఇందులో సాంకేతిక పరిజ్ఞానం పంచుకోవడం, బదలాయింపు వంటి షరతులేమీ లేవు. పైగా మన వాణిజ్య డేటా మొత్తం వారి చేతుల్లోకి పోవడం వల్ల ఇక్కడ వ్యాపారాలకు నష్టం. గూగుల్‌పై భారత ప్రభుత్వ అదుపు ఏమీ వుండదు. కంప్యూటర్‌ విజ్ఞానంలో కీలకమైన అల్గోరిథమ్‌ వ్యవస్థను మనకు పరిచయమే చెయ్యరు. కాకపోతే గూగుల్‌ వచ్చింది గనక మిగతావారూ కూడా వస్తారనేది ఆశ. అది వారి సంబంధాలను బట్టి వుంటుంది.

ఉద్యోగాల ఊదర
ఇక ఎ.ఐ డేటా సెంటర్‌ వల్ల లక్ష 80 వేల ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టడం గురించి. జగన్‌ హయాంలో 1800 మందికి ప్రత్యక్షంగా, 32వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇక మొన్న గూగుల్‌ ఒప్పందం తర్వాత టీడీపీకే చెందిన కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఈ కేంద్రం వల్ల 5 నుంచి 6 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పినట్టు పిఐబి వార్త ఇచ్చింది. పరోక్షంగా మొత్తం (టోటల్‌ అనే మాట వాడారు) 20 నుంచి 30 వేల ఉద్యోగాలు రావచ్చన్నారు. దీనివల్ల ఏపీకి మొత్తం 10 వేల కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేశారు. మరి రెండు లక్షల ఉద్యోగాల కబుర్లు ఎలా వచ్చాయి? ఇప్పుడు దేశంలోని గూగుల్‌ ఉద్యోగులందరి సంఖ్య అంత వుండదేమో. విశాఖలో ఏర్పాటు చేసే కేంద్రానికి సంబంధించి గూగుల్‌ అధికారిక సైట్‌లోనైతే అసలు ఉద్యోగాల సంఖ్యనే ఇవ్వలేదు. సాంకేతికంగా వ్యాపారాలకు కలిగే ప్రయోజనం గురించి ప్రధానంగా చెప్పారు. అంతేగాక హైదరాబాద్‌, బెంగళూరు, పూనా, చెన్నై వంటి చోట్ల గల గూగుల్‌ కేంద్రాలతో సింగపూర్‌, మలేషియా, ఆస్ట్రేలియా తదితర అంతర్జాతీయ కేంద్రాలతో అనుసంధానం చేసుకుంటామన్నారు.

కనుక ఇక్కడ ఎ.పి కి ప్రత్యేకంగా ఏదో చెప్పిందిగానీ, లేక హామీ ఇచ్చిందిగానీ లేదు. పైగా డేటా సార్వభౌమత్వం తమ చేతుల్లో వుంచుకుని రేవులను సంధానం చేసుకోవడం భద్రతా పరంగానూ సున్నితమైన సమస్యే. అసలు మౌలికంగా ఎ.ఐ అనేది మనుషులను తగ్గించి కృత్రిమ మేథను ఉపయోగిస్తుంది. డేటా ఆపరేషన్లు తేలిగ్గా చేస్తుంది. ఉదాహరణకు సందర్భం వేరైనా ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ శుక్రవారం (24వ తేదీ) ఒక వార్త ఇచ్చింది. సూపర్‌ కంప్యూటర్స్‌ మూడున్నర ఏళ్లలో చేసే పని రెండు గంటల్లో చేసే ‘విల్లో చిప్‌’ జయప్రదమైందని సుందర్‌ పిచారు ప్రకటించారు. ఎ.ఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అన్నీ అందుకే ఉద్దేశించబడ్డాయి. కనుక ఈ సెంటర్‌ ఉద్యోగ కల్పన ప్రధానమైంది కాదు. వారెవరూ అలా చెప్పలేదు కూడా.

అదానీ – అమెరికా బంధమేంటి?
గూగుల్‌ ఎ.ఐ గురించి ఇంతగా మాట్లాడుతున్న సమయంలో అమెరికా పరిస్థితి ఏంటో కూడా చూడాలి. ఆర్థికంగా తీవ్ర సవాళ్లలో కూరుకుపోయిన అమెరికా ఇప్పుడు ఎ.ఐ గాలిబుడగపై కేంద్రీకరించాలని నిర్ణయించింది. డోనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో భారీ ఎత్తున ఈ కంపెనీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రపంచమంతటా ఏ.ఐ కేంద్రాలపై భారీగా పెట్టుబడి పెట్టాలనీ, ప్రోత్సహించాలనీ నిర్ణయానికొచ్చారు. ఇందులో భాగంగా గూగుల్‌ 25 బిలియన్లు, బ్లాక్‌స్టోన్‌ 25 బిలియన్లు, కోర్‌వీవ్‌ 6 బిలియన్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాయి. ఈ ఊపులో ట్రంప్‌ వైట్‌హౌస్‌లో తలపెట్టిన బాల్‌రూం నిర్మాణానికి గూగుల్‌ 20 మిలియన్లు కేటాయించింది. ఆపిల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌లు, లాక్‌హీడ్‌ వంటివి కూడా పాలుపంచుకుంటున్నాయి. ఎ.ఐ గురించి ఇంతగా చెబుతున్నా ఇప్పటికీ కంపెనీల కార్యకలాపాలలో దాని వినియోగం 9.2 శాతం మాత్రమే వుందని, దాన్ని బాగా పెంచాలని నిర్ణయానికొచ్చాయి.

ఇంకా చెప్పాలంటే రీగన్‌ కాలంలో సైనిక పారిశ్రామిక వ్యవస్థ తరహాలో ఎ.ఐ వ్యవస్థను పెంపొందించాలనేది వ్యూహం. అదానీ, అంబానీల వంటి వారు ఈ గొలుసు కట్టులో భాగంగా వుంటారు. ఆయుధాలతో దీన్ని పోల్చడానికి లేదు గానీ ఆధిపత్యం, ఆర్థిక ప్రయోజనాల విషయంలో అదే ఆధిపత్యం కొనసాగుతుంది. కంప్యూటర్‌ డేటా కేంద్రాలను స్థాపించినంత మాత్రాన కంప్యూటర్‌ పరిజ్ఞానం వచ్చినట్టు కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే అమెరికా ఎ.ఐ విషయంలో చైనాతో యుద్ధం చేస్తున్నది. ఇందులో తన విస్తరణ కోసం ఇండియా వంటి దేశాలను ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలో ఆ రెండు దేశాల తర్వాత స్థానంలో వున్న ఇండియా స్వతంత్ర సాంకేతిక శక్తిని పెంచకుండా ఆపడమూ జరుగుతుంది. ఎందుకంటే మన కార్పొరేట్లు తమ లాభం చూసుకుంటారే గాని దేశ సాంకేతిక సార్వభౌమత్వం గురించి ఆలోచించరు కదా.

పర్యావరణ వేటు
ఇక పర్యావరణ పరంగా విపరీతమైన నీటి వినియోగం, విద్యుత్‌ వినియోగం వంటి వాటిపై చాలా చర్చ జరిగింది. ఇక్కడ ఆ సమస్య తలెత్తబోదని మంత్రులు చెబుతున్నారుగానీ విపరీతంగా డేటా వాడే కేంద్రాలలో అది కుదిరేది కాదు. అమెరికాలోని ఇండియానాపోలిస్‌ లో స్థానిక వత్తిడి వల్ల గూగుల్‌ తనే ఎ.ఐ డేటా సెంటర్‌ స్థాపన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. చిలీ వంటి చిన్నదేశంలోనూ ఇదే జరిగింది. మెక్సికో, సౌదీ అరేబియా, ఇంకా కొన్ని యూరోపియన్‌ దేశాలలోనూ ఇదే జరిగింది. తూర్పు ఇంగ్లాండ్‌లో హెర్డ్‌ఫోర్డ్‌షైర్‌లో గూగుల్‌ డేటా సెంటర్‌ నిర్మాణం వల్ల ఉద్యోగాలు చాలా వస్తాయని ప్రచారం జరిగి అనుమతిస్తే నిర్మాణ దశలోనే భరించలేని కాలుష్యమంటూ నిరసనలు సాగుతున్నాయి.

‘టైమ్‌’ మేగజైన్‌ ఏప్రిల్‌ 2020లోనే ఈ సమస్యలు లేవనెత్తింది. గూగుల్‌ ఎ.ఐ డేటా సెంటర్‌ వినియోగించే విద్యుత్‌ భారం గురించి అమెరికాలోనే ఒప్పందాల కోసం ఆపసోపాలు పడుతున్నది. ఈ మధ్యనే 100 మెగావాట్ల విద్యుత్‌ కోసం ఒప్పందం కూడా చేసుకుంటున్నది. ఒకప్పటి అణు విద్యుత్‌ చర్చలు కూడా మళ్లీ వస్తున్నాయి. భయంకరంగా వేడెక్కిపోయే ఈ సెంటర్లను చల్లార్చడానికి అపారమైన నీటి వనరులు అవసరమవుతాయి. దానిపైన వ్యతిరేకతకు మరో ప్రధాన కారణం. ఏమైనా డేటా సెంటర్లు వినియోగించే నీటి పరిమాణం ఎంత అనేది వ్యాపార రహస్యం (ప్రొప్రటేరియల్‌ సీక్రెట్‌)గా వుంటుంది. ఈ విషయం ఎప్పటికీ బయటకు రాదు.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -