– మూడ్రోజులపాటు ఫెర్టిలిటీ సెంటర్లపై దాడులు
– రంగంలోకి 35 ప్రత్యేక బృందాలు
– గ్రేటర్‌లో తనిఖీలు షురూ.. తర్వాత జిల్లాల్లో..
నవతెలంగాణ-సిటీబ్యూరో
సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణాకు పాల్పడిన ‘సృష్టి ఫెర్టిలిటీ సెంటర్” ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అలర్టయింది. సరోగసీ దందాను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఫెర్టిలిటీ సెంటర్లలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనీ, అనుమతులు, నిబంధనలు పాటిస్తున్నాయా..? లేదా..? అనే విషయాలపై ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. మొదటగా గ్రేటర్ హైదరాబాద్, ఆ తర్వాత రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నుంచే గ్రేటర్ హైదరాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్లలో ప్రత్యేక బృందాలు తనిఖీలు మొదలు పెట్టాయి. ఈ తనిఖీలు శనివారం, ఆదివారం, సోమవారం మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. నాలుగవ రోజు మంగళవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసిన తర్వాత రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ తనిఖీలు చేపట్టనున్నాయి.
గ్రేటర్‌లో 157 సెంటర్ల గుర్తింపు
రాష్ట్రంలో కొన్నేండ్లుగా ఫెర్టిలిటీ సెంటర్ల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలతోపాటు వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లోనూ ఈ కేంద్రాలు ఎక్కువగా వెలిశాయి. మొదటి దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గుర్తించిన 157 ఫెర్టిలిటీ సెంటర్లలో ప్రత్యేక బృందాలు తనిఖీలు మొదలు పెట్టాయి. మూడ్రోజుల్లో ఈ తనిఖీలను ముగించిన తర్వాత రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని ఫెర్టిలిటీ సెంటర్లలో దాడులు నిర్వహించనున్నాయి. ఇందుకు 35 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతి బృందంలో ఒక వైద్య నిపుణుడు (డాక్టర్), ఒక డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌తోపాటు ఇతర అధికారులు ఉంటారు. ఈ బృందాలు మొత్తం 29 కీలక అంశాలను పరిశీలిస్తున్నాయి.
29 అంశాల చెక్ లిస్టుతో రంగంలోకి..
ఈ ప్రత్యేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫెర్టిలిటీ సెంటర్లలో సోదాలు నిర్వహించి, నిబంధనలను పరిశీలించనున్నాయి. ఈ తనిఖీల కోసం 29 అంశాలతో కూడిన ప్రత్యేక చెక్ లిస్టును రూపొందించాయి. ఈ చెక్ లిస్ట్‌లో లైసెన్స్‌ల పరిశీలన, క్వాలిటీ ట్రీట్‌మెంట్, పేషంట్స్ రికార్డ్ నిర్వహణ, మందుల నిల్వ, సిబ్బంది అర్హతలు, శస్త్రచికిత్సల భద్రతా ప్రమాణాలు, వైద్య విధానాలు, సరోగసీ వంటి నిబంధనలు అమలు వంటి అంశాలు ఉన్నాయి. ఆయా ఫెర్టిలిటీ సెంటర్లకు నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ఉందా..? డాక్యుమెంటేషన్ అంతా పక్కాగా ఉందా..? అన్న విషయాలను నిర్ధారిస్తుంది. ఈ కేంద్రాలపై ఇది వరకు ఏమైనా కేసులు నమోదయ్యాయా..? ఏమైనా చర్యలు తీసుకున్నారా..? వీటి బారినపడి ఎవరైనా మోసపోయారా..? అన్న వివరాలను సైతం సేకరిస్తున్నాయి. అలాగే ఈ కేంద్రాలపై మెడికల్ కౌన్సిల్ ఏమైనా చర్యలు తీసుకుందా..? అన్న వివరాలను సైతం పరిశీలిస్తున్నాయి.
నివేదిక తర్వాత చర్యలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు రోజులపాటు నిర్వహించిన తనిఖీల నివేదిక సర్కార్‌కు అందగానే నిబంధనలు పాటించని ఫెర్టిలిటీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులపై చర్యలతోపాటు అవసరమైతే లైసెన్స్‌ను రద్దు చేయడం, జరిమానాలు విధించడం, న్యాయపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా కలిపి ఒకేసారి చర్యలు ఉంటాయా..? లేక గ్రేటర్‌లో మొదట ఆ తర్వాత జిల్లాల్లో చర్యలు తీసుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.
‘సృష్టి’ ఘటనతో సర్కార్ యాక్షన్ ప్లాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES