మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నవతెలంగాణ-జన్నారం
జిల్లాలోని జన్నారం మండలం చింతగూడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి పుదారి రాజన్న, కుమారుడు పుదారి సత్యనారాయణలు ఒకే రకమైన కండరాల వ్యాధితో బాధపడుతూ కదలలేని స్థితిలో ఉన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాద్ నుండి అందిన సూచనల మేరకు జిల్లా యంత్రాంగం వారి కుటుంబాన్ని సంప్రదించి వివరాలు నిర్ధారించిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా కదలలేని స్థితిలో ఉన్న పుదారి రాజన్న, సత్యనారాయణల కుటుంబానికి తెల్ల రేషన్కార్డు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుండి చౌకధరల దుకాణం ద్వారా ప్రతి నెల 18 కిలోల బియ్యం అందించడం జరుగుతుందని, సత్యనారాయణ దివ్యాంగుల వర్గం క్రింద నెలకు 4 వేల 16 రూపాయలు చేయూత పెన్షన్ పొందుతుడగా, పుదారి రాజయ్య 2 వేల 16 రూపాయల వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం రాజయ్య వైకల్యాన్ని నిర్ధారించేందుకు స్లాట్ బుక్ చేసి వైకల్య ధృవీకరణ పత్రం జారీ చేయబడిన తరువాత వృద్ధాప్య ఫించన్ను దివ్యాంగ ఫించన్గా సవరించడం తీసుకుంటుందని, తద్వారా వారికి అధిక ఫించన్ మొత్తం లభిస్తుందని తెలిపారు. వారిరువురికి మెరుగైన చికిత్స అందించడం కోసం ప్రభుత్వ ఖర్చులతో వారిని హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్చాలని ప్రతిపాదించబడిందని, వారి సమ్మతితో లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేయబడుతుందని తెలిపారు. ప్రస్తుతానికి జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద పలియేటివ్ (ఉపశమనకారకం) కేర్ యూనిట్ ద్వారా జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించడంతో పాటు వారికి వీల్ చైర్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం వారి చికిత్స కొరకు ఇప్పటికే చేసిన వైద్య బిల్లులతో ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో పాటు వారికి అవసరమైన అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని తెలిపారు.