పీఎస్‌బీల్లో 49 శాతం ఎఫ్‌డీఐలు
మోడీ సర్కార్ కొత్త ప్రతిపాదనలు
ఆర్బీఐ సంప్రదింపులు
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను క్రమంగా ప్రయివేటు, విదేశీపరం చేసేలా మోడీ సర్కార్ కుట్రలు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ బ్యాంకు లలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచేలా కొత్త ప్రతిపాదనలు చేసింది. ఒకవేళ విదేశీ సంస్థలకు తొలుత 49 శాతం వాటా కట్టబెడి..ఆ తర్వాత మరింత వాటా శాతాన్ని పెంచితే చాలు.. ప్రభుత్వరంగ బ్యాంకులు కాస్త విదేశీ సంస్థల యాజమాన్యాల్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ (పీఎస్‌బీ)ల్లో ప్రస్తుతం ఎఫ్‌డీఐల పరిమితి 20 శాతంగా ఉంది. దీన్ని రెట్టింపు పైగా చేయడానికి వీలుగా భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)తో ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. ప్రయివేటు బ్యాంక్‌ల కంటే పీఎస్‌బీలు బలహీనంగా ఉన్నాయని.. వాటికి మరింత మూలధనం అవసరమని మోడీ సర్కార్ తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఈ రంగంలో ఎఫ్‌డీఐలకు రెడ్‌కార్పెట్ వేస్తోంది. దేశంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఉన్నాయి. వీటి మొత్తం ఆస్తులు 1.95 లక్షల కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.170 లక్షల కోట్లు) ఉంది. ఇవి బ్యాంకింగ్ రంగంలో 55 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రభుత్వం ఈ బ్యాంకుల్లో కనీసం 49 శాతం వాటాకు తగ్గించు కోవాలనేది లక్ష్యం. ప్రస్తుతం కెనరా బ్యాంక్‌లో విదేశీ యాజమాన్యం వాటా 12 శాతం ఉండగా, యూకో బ్యాంక్‌లో దాదాపు సున్నాకి దగ్గరగా ఉంది. ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా భారత బ్యాంక్‌లు పటిష్టంగా పని చేయడంతో విదేశీ సంస్థలు ఇక్కడి విత్త సంస్థల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో 60 శాతం వాటాను 3 బిలియన్ డాలర్ల (రూ.26వేల కోట్లు)కు దుబారుకి చెందిన ఎమిరేట్స్ ఎన్‌బీడీ కొనుగోలు చేసింది. యెస్ బ్యాంక్‌లో 20 శాతం వాటాను 1.6 బిలియన్ డాలర్ల (రూ.14వేల కోట్లు)కు జపాన్‌కు చెందిన సుమిటోమో మిత్సురు బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులలో వాటాలను విదేశీ సంస్థలకు విక్రయించడం ద్వారా ఖజానా నింపుకోవాలని కేంద్రం యోచిస్తోంది.
ప్రజలకు చౌక సేవలకు ప్రయివేటు బ్యాంకుల దూరం
సాధారణంగా ప్రయివేటు బ్యాంక్‌లు ప్రజలకు చౌక బ్యాంకింగ్ సేవలను అందించడం లేదు. పేద, మధ్య తరగతి ప్రజలకు జన్‌ధన్ లాంటి ఖాతాలను ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నాయి. సామాజిక బాధ్యతలకంటే లాభాలే పరమవదిగా పని చేస్తున్నాయి. పలు బ్యాంక్‌లు సేవింగ్ ఖాతాల్లోనూ రూ.10వేల డిపాజిట్ ఉండాలని షరతులు విధిస్తోన్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య ఇంకా విదేశీ సంస్థలకు భారత బ్యాంక్‌ల్లో పెట్టుబడులకు అనుమతిస్తే.. సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను దూరం చేయడమే అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. ప్రస్తుతం ప్రయివేటు బ్యాంక్‌ల్లో విదేశీ పెట్టుబడుల పరిమితి 74 శాతంగా ఉంది.
సవాళ్లు..
లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ ఎఫ్‌డీఐలను అనుమతించడం ద్వారా అక్కడి స్థానిక ఆర్థిక విధానాలపై ప్రభుత్వాలు నియంత్రణ కోల్పోయాయి. దీంతో ఆర్థిక సంక్షోభాలు ఏర్పాడిన ఘటనలు ఉన్నాయి. భారత్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు వ్యవసాయ, ఇతర ప్రాధాన్యత రంగాల రుణాల జారీలో కీలకంగా ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పీఎస్‌బీల్లో ఎఫ్‌డీఐలు పెరిగితే ఈ లక్ష్యాలు నీరుగారనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ బ్యాంక్‌ల్లో ప్రయివేటు, విదేశీ వాటాలు పెరిగితే లాభదాయకత పరమావధిగా పని చేస్తాయి. దీంతో సామాజిక లక్ష్యాలు దెబ్బతినడం ద్వారా ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ సంస్థల చేతికి ప్రభుత్వ బ్యాంకులు!
- Advertisement -
- Advertisement -



