Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆశాలపై ప్రభుత్వ దమనకాండ

ఆశాలపై ప్రభుత్వ దమనకాండ

- Advertisement -

అక్రమ అరెస్టులకు సీఐటీయూ ఖండన

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆశాలపై ప్రభుత్వం దమన కాండ కొనసాగించిందని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు, సీఐటీయూ నాయకులను అక్రమంగా అరెస్టు చేయటం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆశాలకు రూ.18 వేలు ఫిక్స్డ్‌ వేతనంగా ఇవ్వాలని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్లతో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌ వద్ద కార్యక్రమం నిర్వహించేందుకు ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నిర్ణయించిన నేపథ్యంలో చివరి నిమిషం వరకు పర్మిషన్‌ ఇవ్వకుండా వేధించడంతో పాటు హైదరాబాద్‌ చేరుకున్న ఆశా వర్కర్లపై తీవ్ర నిర్భంధాన్ని విధించడం శోచనీయమని వారు తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారానికి శాంతియుతంగా ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వకుండా నిర్భంధాన్ని ప్రయోగించడమేంటని ప్రశ్నించారు.

కార్మికుల పట్ల, వారి సమస్యల పట్ల ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోతే భవిష్యత్‌లో ఉధృత పోరాటాలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి వరంగల్‌లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి ఇంట్లోకి పోలీసులు జొరబడి భీబత్సం సృష్టించి, ఆమెను అరెస్ట్‌ చేయడమేంటని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆశాలను అరెస్ట్లు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించి, పోరాటాన్ని అణచివేశామని ప్రభుత్వ పెద్దలు భ్రమలు పడుతున్నారని పేర్కొన్నారు. శాంతియుతంగా డీబీఆర్‌ మిల్స్‌ నుండి ప్రదర్శనగా వస్తున్న వారిని అరెస్ట్‌ చేశారనీ, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ నుండి సెక్రటేరియట్‌ వరకు ఎక్కడి వాళ్ళనక్కడ అరెస్ట్‌ చేయడం అత్యంత దుర్మార్గమని తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు భూపాల్‌, కార్యదర్శులు శ్రీకాంత్‌, సుధాకర్‌, ఆశా యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పి. జయలక్ష్మి, ఆర్‌. నీలాదేవి, గంగమణిలతో పాటు సీఐటీయూ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ అధ్యక్షులు దశరథ్‌, హైదరాబాద్‌ సౌత్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మీనా, ఎం. శ్రావణ్‌ కుమార్‌తో పాటు వేలాది మందిని అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించారని తెలిపారు.

ఎస్‌. వీరయ్య పరామర్శ..
ఆశా వర్కర్ల ”చలో హైదరాబాద్‌” కార్యక్రమం సందర్భంగా పోలీసులు అరెస్ట్‌ చేసి, వివిధ పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించిన ఆశాలను, ఆ సంఘం నాయకులను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) కేంద్ర కమిటీ సభ్యులు ఎన్‌. వీరయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లిఖార్జున్‌ తదితరులు పరామర్శించారు. పోరాటంలో వారు చూపిన తెగువను అభినందించారు.

వర్కింగ్‌ ఉమెన్‌ సమన్వయ కమిటి ఖండన
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని వర్కింగ్‌ ఉమెన్‌ సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఎస్వీ రమ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18వేలు చెల్లిస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టుగా అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా హామీలను ఎందుకు అమలు చేయటం లేదని అడగటం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు. హామీలు అమలు చేయకపోగా అక్రమ అరెస్టులకు పాల్పడటం తగదని హితవు పలికారు.

కేవీపీఎస్‌ ఖండన
ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ‘ఛలో హైదరాబాద్‌’ కార్యక్రమం నిర్వహిస్తే ఆశా వర్కర్లు, సీఐటీయూ రాష్ట్ర నేతలను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి, అక్రమంగా అరెస్టు చేయడాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్‌ బాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని అడిగినందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిందని విమర్శించారు. అరెస్టు చేసిన నాయకులను, ఆశా కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -