No menu items!
Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeప్రధాన వార్తలుప్రభుత్వోద్యోగుల జంగ్‌సైరన్‌

ప్రభుత్వోద్యోగుల జంగ్‌సైరన్‌

- Advertisement -

– లక్షమందితో భారీ బహిరంగ సభ
– సెప్టెంబర్‌ 8 నుంచి 18 వరకు జిల్లా స్థాయి చైతన్య సదస్సులు
– పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి
– దానికోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం : ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ శ్రీనివాసరావు
– అక్టోబర్‌ 12న చలో హైదరాబాద్‌
– లక్షమందితో భారీ బహిరంగ సభ
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ జంగ్‌సైరన్‌ మోగించింది. దానిలో భాగంగా అక్టోబర్‌ 12న లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వచ్చే నెల ఎనిమిది నుంచి 18 వరకు జిల్లా స్థాయి చైతన్యసదస్సులు నిర్వహించి ఉద్యోగులను సమాయత్తం చేసేందుకు బస్సుయాత్ర చేపడతామని ప్రకటించింది. తమ డిమాండ్ల సాధన కోసం 20 నెలలు ఎదురుచూశామనీ, ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. సమస్యల పరిష్కారంకోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం తప్ప తమముందు మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ జంగ్‌సైరన్‌ మోగించింది. దానిలో భాగంగా అక్టోబర్‌ 12న లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వచ్చేనెల ఎనిమిది నుంచి 18 వరకు జిల్లాస్థాయి చైతన్య సదస్సులు నిర్వహించి ఉద్యోగులను సమాయత్తం చేసేందుకు బస్సుయాత్ర చేపడతామని ప్రకటించింది. తమ డిమాండ్ల సాధన కోసం 20 నెలలు ఎదురుచూశామనీ, ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. సమస్యల పరిష్కారంకోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం తప్ప తమముందు మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

కొందరు మంత్రులు మమ్మల్ని గుర్తుపట్టడం లేదు : జగదీశ్వర్‌
ప్రతినెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్తున్నదని ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌ అన్నారు. జీతభత్యాలు సకాలంలో చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న రూ.13 వేల కోట్ల బిల్లులను చెల్లిస్తామంటూ మంత్రివర్గం ఆమోదించిందని గుర్తు చేశారు. నెలకు రూ.700 చెల్లిస్తామన్నారనీ, మూడు నెలల్లో రూ.2,100 కోట్లు ఎక్కడ చెల్లించారంటూ ప్రశ్నించారు. పీఆర్సీ గడువు ముగిసి రెండేండ్లు అవుతున్నదనీ, నివేదిక సిద్ధంగా ఉన్నా తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు డీఏల కోసం సమ్మె నోటీసు ఇచ్చిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. తాము దాచుకున్న సొమ్మును కూడా ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికే 200 నెలలు ఆగామనీ, ఇంకెన్ని రోజులు ఆగాలని అడిగారు. ఉద్యోగులు నిరాశా, నిస్పృహల్లో ఉన్నారని చెప్పారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్లు కూడా ఇవ్వడం లేదని అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో అవమానాలను భరిస్తున్నామని అన్నారు.

కొందరు మంత్రులు ఉద్యోగ సంఘాల నేతలను గుర్తు పట్టడం లేదన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదనీ, ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వమేదైనా ఉద్యోగులకు ఇబ్బందులకు గురిచేస్తున్నదని వివరించారు. ఆరోగ్య కార్డులను ఇవ్వాలని కోరారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. వివిధ కారణాలతో ఉద్యోగులను కలెక్టర్లు సస్పెండ్‌ చేస్తున్నారని అన్నారు. వారికి రావాల్సిన బిల్లులు, ఇతర సౌకర్యాల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను బలహీనవర్గాల ప్రజలకే అమలు చేయాలని చెప్పారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల గురించి సీఎం, డిప్యూటీ సీఎం తెలుసుకుని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గన్‌మెన్‌, పీఏలను అడిగినా ఉద్యోగుల పరిస్థితి తెలుస్తుందన్నారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకే అక్టోబర్‌ 12న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో ఎల్బీ స్టేడియం లేదా సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ సభను నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే అక్కడే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినం : శ్రీనివాసరావు
సెప్టెంబర్‌ ఒకటో తేదీన పెన్షన్‌ విద్రోహ దినం కార్యక్రమాన్ని చేపడతామని ఉద్యోగ జేఏసీ సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. హైదరాబాద్‌ లలిత కళాతోరణంలో ఐదారు వేల మంది ఉద్యోగులతో నిరసన తెలుపుతామని అన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులకు శాపంగా మారిందని చెప్పారు. 63 డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చామన్నారు. ఆగస్టు 15 వరకు వాటిని పరిష్కరించకుంటే కార్యాచరణను ప్రకటిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించామని చెప్పారు. అయినా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉద్యమ కార్యాచరణకు వెళ్లామని అన్నారు.

బిల్లులు రాక ఉద్యోగుల మనోవేదన : ముజీబ్‌
ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ రకాల బిల్లులు రాకపోవడం వల్ల మనోవేదనకు గురవుతున్నారని ఉద్యోగ జేఏసీ డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌ ముజీబ్‌ హుస్సేని అన్నారు. ఇటీవల 200 నుంచి 300 మంది ఉద్యోగులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును వేరే అవసరాలకు వాడుకోవడం సరైంది కాదని చెప్పారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ ఉద్యోగికి రూ.26 వేల బిల్లు కోసం 17 రోజులు అధికారుల చుట్టూ తిరిగామని అన్నారు. అయినా ఆ బిల్లు మంజూరు కాలేదనీ, 18వ రోజు ఆ ఉద్యోగి మరణించారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్‌ సెక్రెటరీ జనరల్‌ పి దామోదర్‌రెడ్డి, కోచైర్మెన్లు చావ రవి, వంగ రవీందర్‌రెడ్డి, జి సదానందంగౌడ్‌, అనిల్‌కుమార్‌, టి లింగారెడ్డి, పి మధుసూదన్‌రెడ్డి, కె లక్ష్మయ్య, పి కృష్ణమూర్తి, డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌ ఎ సత్యనారాయణ, స్థితప్రజ్ఞ, నాయకులు ఎ వెంకట్‌, కస్తూరి వెంకటేశ్వర్లు, బి శ్యామ్‌, కటకం రమేష్‌, మామిడి నారాయణ, ఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad