– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ
– భువనగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి పట్టణ శివారు 700 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ భూమిని చదును చేసి పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా కేంద్రంలో బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల సీపీఐ(ఎం) పోరాట ఫలితంగా 700 సర్వే నెంబర్‌లో అధికారులు సర్వే నిర్వహించి 20 ఎకరాలు సీలింగ్ భూమిగా, 18 ఎకరాలు పట్టాగా.. మొత్తం 38 ఎకరాలు ఉన్నదని తేల్చారని వివరించారు. ఆ భూమిని చదును చేసి ప్లాట్లుగా మార్చి పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేక.. కిరాయిలు కట్టలేక పేద ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు. కిరాయి ఇంట్లో ఉంటూ ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఆ సమయంలో వారి బాధ వర్ణించలేమన్నారు. 20 ఏండ్లుగా పోరాటాలు నిర్వహిస్తున్నా పట్టా కాగితాలకే పరిమితమయ్యారు తప్ప ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించలేదన్నారు. 700 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ భూమిని చదును చేసి పట్టణంలోని పేద ప్రజల ఇండ్ల స్థలాలకు కేటాయించి ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గుడిసేవాసుల భూపోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, వనం రాజు, నాయకులు దండగిరి, కోటగిరి వీరబ్రహ్మం, కొత్త లక్ష్మయ్య, నరాల నరసింహ, పల్లెర్ల గంగయ్య, గుడిసెవాసుల కమిటీ సభ్యులు దొడ్డి శంకర్, నారి కలమ్మ, అరుణ, స్రవంతి, మౌనిక, మంజుల, స్వామి, యాదగిరి, హేమలత, అంజయ్య పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిని ఇండ్ల స్థలాలకు కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



