నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్..
వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం లేదు..
డాక్టర్లు ఉన్నా వసతులు, పరికరాలు, మందులు లేవు..
సీపీఐ(ఎం) ఆద్వర్యంలో హాస్పిటల్ సమస్యలపై సర్వే..
నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించాలి
సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం
నవతెలంగాణ – వైరాటౌన్
వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు ప్రభుత్వ వైద్యం అందడంలేదని, బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడంతో వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ అవస్థలు పడుతుందని, వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా ప్రజలకు సరైన వైద్యం అందటం లేదని, డాక్టర్లు ఉన్నా వైద్యం చేయటానికి సౌకర్యాలు, పరికరాలు లేవని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం విమర్శించారు. సీపీఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆద్వర్యంలో గురువారం వైరా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సమస్యలపై సర్వే చేశారు. సీపీఐ(ఎం) బృందం హాస్పిటల్ మొత్తం పర్యటించి వసతులు, వైద్య సౌకర్యాలను పరిశీలించారు.
హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ బాలు, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఆశాజ్యోతి, డాక్టర్ మాధురి, డాక్టర్ విజయ్ కుమార్, వైద్యం కోసం వచ్చిన పేషంట్లతో మాట్లాడి పలు రకాల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టిన వైరా నియోజకవర్గంలో పేదల ప్రాణాలను గాలికి వదిలేశారని విమర్శించారు. వైరా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో డాక్టర్లు ఉన్నా వైద్యం చేయటానికి సౌకర్యాలు, పరికరాలు లేవని, ముఖ్యమైన రక్త పరీక్షలు చేయడానికి శాంపిల్స్ ఖమ్మం పంపించి రిపోర్టు వచ్చేవరకు ఎదురు చూడాల్సిన దుస్థితిలో పేదలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల వ్యాధులకు వైద్య సేవలు అందించడం లేదని, డాక్టర్లు, సిబ్బంది కోరత ఉందని, అన్ని రకాల వ్యాధులకు మందులు, ఇంజెక్షన్లు లేవని, మహిళలకు డెలివరీ సమయంలో ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ థియేటర్ లేదని, పసి పిల్లలకు వైద్యం అందించడానికి ఇంక్యుబేటర్ బాక్స్ కూడా లేదని, హాస్పిటల్ బిల్డింగ్ శిధిలావస్థకు చేరిందని, మహిళలకు బాత్రూం సౌకర్యం కూడా లేదని, బాత్ రూమ్స్ లో చెట్లు మోలిసి చాలా అపరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు.
డెలివరీలు, అత్యవసర వైద్యం చేయకుండా ఖమ్మం పంపుతున్నారని తెలిపారు. వైరా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నిధులను వెంటనే కేటాయించాలి, అన్ని రకాల వైద్య సేవలు అందించాలి, డాక్టర్లు, సిబ్బందిని నియమించాలి, ఆపరేషన్ థియేటర్, ఇంక్యుబేటర్ బాక్స్ ఏర్పాటు చేయాలి, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలి, నిధులను వెంటనే కేటాయించి నూతన బిల్డింగ్ నిర్మించి అన్ని రకాల సౌకర్యాలు, పరికరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యురాలు మచ్చా మణి, నాయకులు గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహనరావు, పైడిపల్లి సాంబశివరావు, కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, మల్లెంపాటి ప్రసాదరావు, మాడపాటి మల్లికార్జునరావు, మాడపాటి వెంకటేశ్వరరావు, కురుగుంట్ల శ్రీనివాసరావు, చిట్టోజు నాగేశ్వరరావు, దేవబత్తిని నాగేశ్వరరావు, గొడ్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.



