జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి
గీతన్నలకు అందని కేంద్ర సంక్షేమ పథకాలు : బహిరంగసభలో కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ.రమణ
సూర్యాపేటలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ ప్రారంభం
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నికలకు ముందు కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి.రమణ అన్నారు. అలాగే, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాల్గో మహాసభ సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కల్లుగీత కార్మికుల రణభేరి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవి.రమణ ప్రసంగిస్తూ.. కార్మికుల పెన్షన్‌ను రూ.4వేలకు పెంచుతామని చెప్పి పెంచలేదన్నారు. ఎక్స్‌గ్రేషి యా రూ.10 లక్షలు మాటలకే పరిమితమైందన్నారు. ప్రతి సొసైటీకీ ఐదెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెల్లించే సుంకంలో కల్లుగీత కార్మికులకు 25శాతం వాటా కల్పించాలన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ముంపులో నష్టపోయిన వారికి ఇంటి నిర్మాణంతోపాటు, వృత్తి, ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు ఎంతో మంది ప్రమాదవశాత్తు తాటిచెట్టు మీద నుంచి కింద పడి చనిపోతున్నారని, వారి కుటుంబాలను పరామర్శించే తీరిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేదా అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ఎలాంటి స్కీములూ ప్రవేశ పెట్టలేదన్నారు. నిత్యం స్వదేశీ వస్తువులను వాడాలని చెప్పే బీజేపీ నాయకులు స్వదేశీ కల్లు, నీరాపై ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. వారికి కార్పొరేట్ శక్తుల లాభాలే తప్ప కల్లుగీత కార్మికుల సంక్షేమం పట్టదన్నారు. ప్రతి సొసైటీకీ రూ.20 లక్షలు కేటాయించాలని కోరారు. సర్వాయి పాపన్న విగ్రహాలకు పూలమాలలేసి దండాలు పెడుతున్న పాలకులు.. ఆయన వారసులైన కల్లుగీత కార్మికుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించారని విమర్శించారు. కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభలో చర్చించి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తామని చెప్పారు. కల్లుగీత కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కాటమయ్య రక్షణ కిట్టు ఇవ్వాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
కల్లు గీత వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియాను వెంటనే చెల్లించాలన్నారు. నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమ నెలకొల్పాలన్నారు. కల్లు గీత కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్లు కేటాయించి కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పాటల సీడీ ఆవిష్కరణ
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి.రమణ రచించగా.. ప్రముఖ సింగర్ మానుకోట ప్రసాద్ ఆలపించిన ‘మోకు పైలం మోయి గౌడ వెంకీ పైలమోయి గౌడ’ అనే పాటల సీడి హైదరాబాద్ సుప్రజా ఆస్పత్రి ఎండీ సిగ విజయ్ కుమార్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాయకులు మానుకోట ప్రసాద్, సందీప్, శ్రీకాంత్ ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి.
తొట్ల మల్సూర్ స్మారక జ్యోతి అందజేత
కల్లుగీత కార్మిక సంఘం ఉద్యమ నిర్మాత తొట్ల మల్సూర్ స్వగ్రామమైన నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామం నుంచి తీసుకొచ్చిన స్మారకజ్యోతిని ఎంవి.రమణకు సభా వేదికపై అందజేశారు.
కదంతొక్కిన కల్లు గీత కార్మికులు
బహిరంగ సభకు ముందుగా సూర్యాపేట పట్టణంలో వేలాది మంది కల్లుగీత కార్మికులు మోకు, ముస్తాబులు, తాటి, ఈత కొమ్మలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎలుగూరి గోవింద్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ చౌగాని సీతారాములు, బొలగాని జయరాములు, గౌని వెంకన్న, బొల్లె వెంకటమల్లయ్య, ఎస్.రమేష్‌గౌడ్, బూడిద గోపి, పామనగుండ్ల అచ్చాలు, ఉషగాని వెంకటనరసయ్య, బండకింది అరుణ్, గౌరీఅంజయ్య, నాయకులు కక్కిరేణి నాగయ్య, బైరు వెంకన్నగౌడ్, టైసన్ శ్రీను, ఉయ్యాల నగేష్, మడ్డి అంజిబాబు, బత్తుల జనార్దన్, తుమ్మల సైదయ్య, అబ్బగాని భిక్షం, బోడపట్ల జయమ్మ, మద్దెలజ్యోతి, నోముల వెంకన్న, జెర్రిపోతుల కృష్ణ పాల్గొన్నారు.



