నవతెలంగాణ – వనపర్తి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయడం సంతోషకరమైన అంశమైనా, పేదలు ఇండ్ల నిర్మాణం చేసుకోవడానికి పెట్టిన నిబంధనలు ఆటంకంగా మారినవని, వాటిని ప్రభుత్వం వెంటనే మార్చాలని సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా డిమాండ్ చేస్తున్నది ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యం. డి. జబ్బార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుపేదలకు ఖాళీ స్థలం ఉండాలని, స్థలాలు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశం లేదని పేర్కొనడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇంటి ముందు నాలుగు చక్రాల వాహనం, ట్రాక్టర్, కారు ఉండరాదని చెప్పడం వారికి ఇండ్లు ఇచ్చే ఉద్దేశమే లేకపోవడం అని పేర్కొన్నారు.
గతంలో నిర్మించిన బేస్మెంట్ ఉంటే బిల్లు రాదని, రాష్ట్ర ప్రభుత్వం ఎల్ 1, ఎల్ 2,ఎల్3 నిబంధన పెట్టారని తెలిపారు. ఈ నిబంధనలతో ఎంతో మంది లబ్ధిదారులను పక్కన పెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు మంజూరు చేస్తుందని, ప్రస్తుతం స్టీల్, సిమెంటు, ఇసుక, ఇటుక ధరలు భారీగా తెలిపారు. కాబట్టి 5 లక్షలకు ఇల్లు నిర్మాణం చేసుకునే అవకాశం లేదని పేర్కొన్నారు. మళ్లీ 5 లక్షలు అప్పు చేయాల్సి వస్తుందని, కాబట్టి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు మార్చాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి యోజన పథకం కింద 10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు మొత్తం 15 లక్షలు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉంటే నిబంధనలు సడలించి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే అవకాశం ఇవ్వాలన్నారు. నిబంధనలు మార్చకుండా లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించడమంటే వారిని మోసం చేయడమేనని, కాబట్టి ముఖ్యమంత్రి మంత్రులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని సుమా సమీక్షించి నిబంధనలు సడలించాలని ఆయన డిమాండ్ చేశారు.



