– పట్టు వస్త్రాలు సమర్పించిన ఖైరతాబాద్ పద్మశాలి సంఘం
– జోరు వానలోనూ గణపతి దర్శనానికి బారులు తీరిన జనం
– క్యూ లైన్‌లో మహిళకు ప్రసవం
నవతెలంగాణ – బంజారాహిల్స్
దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న ఖైరతాబాద్ మహాగణపతికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ నిర్వహించారు. ఇక ప్రతి ఏడాదీలాగే ఖైరతాబాద్ పద్మశాలి సంఘం రూపొందించిన పట్టు వస్త్రాలను సభ్యులు మహాగణపతికి సమర్పించారు. అలాగే చేనేత కళాకారులు రూపొందించిన 75 అడుగుల జంధ్యం, గరిక మాల, చేనేత కండువాలను వేశారు. ముందుగా విజయ గణపతి ఆలయం, సచివాలయం శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సంఘం సభ్యులు ద్వారక హౌటల్ చౌరస్తా నుంచి గుర్రపు బంకిలో ర్యాలీగా వస్త్రాలను గణపతి విగ్రహం వద్దకు తీసుకొచ్చారు. వేద మంత్రోచ్ఛరణలు, ఒగ్గు డోలు కళాకారుల నృత్యాలు, సంప్రదాయ సంగీత వాయిద్యాల మధ్య పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రధాన పూజా కార్యక్రమాన్ని నిర్వాహకులు ప్రారంభించారు.
ఏకదంతునికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏకదంతున్ని పూజించినట్టు చెప్పారు. ఐక్యమత్యంతో గణపతి నవరాత్రులను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.
గవర్నర్ రాక సందర్భంగా పోలీసులు గణపతి విగ్రహానికి నలువైపులా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓవైపు జోరున వాన కురుస్తున్నా జనం దర్శనానికి బారులు తీరారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాగణపతి దర్శనానికి మూడు వైపుల నుంచి జనాన్ని అనుమతిస్తుండగా.. బారీకేడ్లను ఏర్పాటు చేశారు. 500 మందికిపైగా పోలీసులు భద్రతా విధుల్లో కొనసాగుతున్నారు. వీరికి తోడు నిర్వాహకులు నియమించిన సిబ్బంది కూడా పర్యవేక్షిస్తున్నారు. గణపతి విగ్రహానికి నలువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
లైన్‌లో మహిళకు ప్రసవం
ఖైరతాబాద్ మహాగణపతికి బుధవారం తొలిపూజ జరుగుతున్న సమయంలోనే ఒక విశేష ఘటన జరిగింది. గణపతిని దర్శించుకునేందుకు లైన్‌లో నిల్చున్న రాజస్థాన్‌కు చెందిన గర్భిణి రేష్మకి పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అక్కడే ఆమెకు పలువురు ప్రసవం చేశారు. అనంతరం పోలీసులు ఆమెను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
మహాగణపతికి గవర్నర్ తొలి పూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES