జిల్లా అదనపు కలెక్టర్లను ఆదేశించిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
నవతెలంగాణ – వనపర్తి
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. గురువారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డి.సి.ఎస్.ఓ.లు (జిల్లా పౌర సరఫరాల అధికారులు), డి.ఎం.సి.ఎస్.లతో కలిసి ధాన్యం కొనుగోలు పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని ఎన్ఐసి హాల్ నుండి అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ వీసీలో పాల్గొన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ.. రైతుల ఖాతాల్లో కనీస మద్దతు ధర (MSP) చెల్లింపులను ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ధాన్యం అక్రమంగా ప్రవేశించకుండా నివారించడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం యొక్క సీ.ఎం.ఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీలను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సీ.ఎం.ఆర్ డెలివరీల కోసం ఫిబ్రవరి వరకు గడువు పొడిగింపు లభించినందున, ఆ పురోగతిని కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాథ్, డి ఎం జగన్, డి ఆర్ డి ఓ ఉమాదేవి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



