నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. బుధవారం గద్వాల ఐడిఓసి లోని సమావేశపు మందిరంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ నియమ, నిబంధనలపై నిర్వహిస్తున్న శిక్షణపై పూర్తి అవగాహనతో ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో సంబంధిత అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, పరస్పరం సమన్వయంతో పని చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఏ దశలోనూ అలసత్వానికి తావు లేకుండా, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అనుక్షణం జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమిస్తూ, ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కల్పించేలా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.
నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ తదితర అన్ని ప్రక్రియలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డిపిఓ నాగేంద్రం, శిక్షణ జిల్లా నోడల్ అధికారి రమేష్ బాబు, మాస్టర్ ట్రైనర్స్ నరేష్, జహీరుద్దీన్, అగస్టీన్, విష్ణు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.



