వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్..
బందోబస్తును పర్యవేక్షించిన ఎస్పీ జానకి షర్మిల
నవతెలంగాణ – భైంసా
సమస్యాత్మక ప్రాంతమైన భైంసా పట్టణంలో గణనాథుని నిమజ్జనోత్సవవేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మధ్యాహ్నం ప్రారంభమైన శోభ యాత్ర రాత్రి వరకు కొనసాగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేసి, నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉంచారు. ఎస్పీ జానకి షర్మిల, ఏ ఎస్ పి అవినాష్ కుమార్ ల ఆధ్వర్యంలో 600 మంది పోలీసులు బందోబస్తుల పాల్గొన్నారు. సమస్యాత్మక ప్రాంతమైన పంజేషా చౌక్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక పికేటింగ్ లు ఏర్పాటు చేశారు.
మున్నూరు కాపు సంఘం గణేష్ నగర్ ఆధ్వర్యంలో ఉదయం వేళ ఉత్సవాలపై సమావేశం జరగుగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, సబ్ కలెక్టర్ సాంకెత్ కుమార్, తో పాటు పలువురు హాజరై మాట్లాడారు. అనంతరం గణేష్ నిమజ్జోత్సవాన్ని గణేష్ నగర్, గోపాలకృష్ణ మందిర్ లో ప్రారంభించి, గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద నిమజ్జనోత్సవం లో పాల్గొన్నారు. భైంసా లోని పలు కాలనీల నుండి డప్పు చప్పుళ్ళు, చిన్నారుల కోలాటాలు, సౌండ్ సిస్టంలో మధ్య యువకుల నృత్యాలతో శోభయాత్ర కొనసాగింది. వివిధ సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఉత్సవాలు రాత్రి వరకు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. వేడుకలకు బైంసాతో పాటు పరిసర గ్రామాల నుండి పెద్ద మొత్తంలో ప్రజలు తరలివచ్చారు.