Tuesday, December 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయండి

తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయండి

- Advertisement -

హడ్కో ఛైర్మెన్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై చర్చ

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హడ్కో చైర్మెన్‌ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కులశ్రేష్ఠ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, హైదరాబాద్‌ మెట్రో విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్‌, రేడియల్‌ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని సీఎం హడ్కో చైర్మెన్‌్‌కు విజ్ఞప్తి చేశారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నుంచి బెంగళూర్‌, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారులు, బందరు పోర్ట్‌ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి, బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణాలపై ముఖ్యమంత్రి… హడ్కో చైర్మెన్‌ మధ్య చర్చ సాగింది. గతంలో అత్యధిక వడ్డీ రేటుతో ఇచ్చిన రుణాలకు సంబంధించి రుణ పునర్వ్యవ్యస్థీకరణ (లోన్‌ రీకన్‌స్ట్రక్చన్‌) అంశాన్ని సీఎం, హడ్కో చైర్మెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై హడ్కో చైర్మెన్‌ సానుకూలంగా స్పందించారు. సానుకూల వద్ది రేటుతో ఉన్న తెలంగాణలో ప్రాజెక్టులకు తక్కువ వడ్డీరేటుతో దీర్ఘ కాల రుణాలు ఇవ్వాలని సీఎం కోరారు.

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని హడ్కో చైర్మెన్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి తెలియజేశారు. మరో 10 లక్షల ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి రుణాలు వేగంగా మంజూరు చేయాలని సీఎం కోరగా చైర్మెన్‌ కులశ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న భారత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని హడ్కో ఛైర్మెన్‌ను సీఎం ఆహ్వానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి కే.ఎస్‌.శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌, గహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్‌, హడ్కో రీజినల్‌ చీఫ్‌ పి.సుభాష్‌ రెడ్డి, హడ్కో జాయింట్‌ జనరల్‌ మేనేజర్లు ఆశీష్‌ గుండాల, సయ్యద్‌ రహీముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -