ఉపాధ్యాయులు జవాబుదారీతనంతో పనిచేయాలి సమాజంతో మరింత మమేకం కావాలి
– ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచేలా కృషి చేయాలి
– తరగతి గదికొక టీచర్ ఉండేలా సర్కారు బడులుండాలి
– పర్యవేక్షణ వ్యవస్థను మెరుగుపర్చాలి
– పదోన్నతులు, బదిలీలు చేపట్టిన ప్రభుత్వానికి అభినందనలు
నవతెలంగాణతో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు, వారి తల్లిదండ్రుల గుర్తింపే ఉపాధ్యాయులకు గొప్ప అవార్డులాంటిదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ అన్నారు. సమాజంతో మరింత మమేకం కావాలన్నారు. ఉపాధ్యాయులు జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరముందని చెప్పారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతుందనీ, ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో తరగతి గదికొక ఉపాధ్యాయుడు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్యవేక్షణ వ్యవస్థను మెరుగుపర్చాలని కోరారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు రెండుసార్లు పదోన్నతులు, గతేడాది బదిలీలు, డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినందుకు అభినందనలు చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల ఉపాధ్యాయుల్లో అసంతృప్తి ఉందనీ, వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి
బొల్లె జగదీశ్వర్‌కు వెంకట్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు…
ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యనందించాలి
‘విద్యావ్యవస్థలో మార్పులు రావాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్ మార్చాలి. ఊరికో బడి కాకుండా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదికొక టీచర్ ఉండాలి. విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలి. ప్రయివేటు విద్యాసంస్థల్లో తరగతికొక టీచర్ ఉండడం వల్ల తల్లిదండ్రుల్లో నమ్మకమున్నది. ప్రభుత్వ బడుల్లో తరగతిగదికొక టీచర్ లేడు. ఉన్నవాళ్లు కూడా బోధనేతర పనుల్లో ఉంటున్నారు. ఆన్‌లైన్ రిపోర్టులను పంపేందుకు ఓ టీచర్ నిమగం కావాల్సి వస్తున్నది. ప్రాథమిక పాఠశాలల్లో పూర్తి చేసుకుని ఉన్నత పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు కనీస ప్రమాణాలు ఉండడం లేదు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు చదువు సరిగ్గా చెప్పడం లేదంటూ ఉన్నత పాఠశాలల్లోని టీచర్లు అంటున్నారు. ఉపాధ్యాయులను ఉపాధ్యాయులే నిందించే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ బడులను అప్‌గ్రేడ్ చేసినప్పుడే అవసరమైన ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలి. విద్యపై ఖర్చు పెట్టుబడి కాదనీ, అభివృద్ధికి సూచిక అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. మాటల్లోనే కాకుండా ఉపాధ్యాయుల నియామకం, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలి.’అని వెంకట్ చెప్పారు.
జిల్లాస్థాయిలో విద్యాభివృద్ధికి నిధులుండాలి
‘జిల్లా స్థాయిలోనే విద్యాభివృద్ధికి నిధులుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు లేదా డీఈవోల వద్ద నిధులుంటే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం వాటిని ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం మన ఊరు- మనబడి కార్యక్ర మాన్ని చేపట్టింది. ఈ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో పనులు చేస్తు న్నది. రాబోయే కాలంలో ఇంకో ప్రభుత్వం వస్తే వేరే పేరుతో పనులు చేస్తుంది. అలా కాకుండా జిల్లాలోనే నిధులుంటే పాఠశాలల అవసరా లను బట్టి ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది.’అని వెంకట్ అన్నారు.
తెలంగాణ విద్యావిధానం కమిటీలో మేధావులుండాలి
‘తెలంగాణ విద్యావిధానం రూపకల్పన కమిటీలో ప్రజాప్రతినిధులు, అధికారులే కాకుండా విద్యావేత్తలు, మేధావులకు కూడా చోటు కల్పించాలి. సమగ్ర విద్యావిధానాన్ని రూపొందించాలి. విద్యారంగంలో బోధనకు సంబంధించి ఎస్‌సీఈఆర్టీ ప్రయోగాలు చేస్తున్నది. ఎన్‌జీవోలు, అధికారులు అనుకున్నదే అమలు చేస్తున్నారు. లిప్, ఎఫ్‌ఎల్‌ఎన్ వంటి వాటి వల్ల నాణ్యత దెబ్బతింటున్నది. ఉపాధ్యాయులు అనుకున్నది బోధిం చడం లేదు. బోధనా పద్ధతుల్లో మార్పులపైనా ఆ కమిటీ దృష్టిసారించాలి’అని వెంకట్ సూచించారు.
అసర్, న్యాస్ నివేదికలు శాస్త్రీయమేనా?
‘అసర్, న్యాస్ సర్వే నివేదికలు శాస్త్రీయమేనా?. విద్యార్థులను ర్యాండమ్‌గా ఎంపిక చేసి వారి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తాయి. ఆ పిల్లల్లో ప్రమాణాలు తక్కువగా ఉండొచ్చు. మిగిలిన పిల్లలు బాగా చదవొచ్చు కదా?. మొదటి సారి న్యాస్ నిర్వహించినపుడు పిల్లలకు అవగాహన లేదు. రెండోసారి నిర్వహించినపుడు తెలంగాణ కొంత మెరుగైన ఫలితాలను కనబరిచింది. ఉపాధ్యాయులు న్యాస్‌పై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోవడానికి అనేక కారణాలున్నాయి. ఉపాధ్యాయుల్లో ఉన్న లోపంతోపాటు పర్యవేక్షణ వ్యవస్థ లేదు. అందుకే టీచర్లలో జవాబుదారీ తనం పెరగాలి. పర్యవేక్షణ వ్యవస్థ పటిష్టం కావాలి. 20 ఏండ్లుగా పర్యవేక్షణ పోస్టులను భర్తీ చేయడం లేదు. ప్రయివేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్లోనూ ప్రమాణాలు కనిపించడం లేదు.’అని వెంకట్ చెప్పారు.
ఉపాధ్యాయులు మరింత కష్టపడి పనిచేయాలి
‘ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులకు జవాబుదారీతనంగా పనిచేయాలి. పిల్లలు, తల్లిదండ్రుల గుర్తింపే టీచర్లకు గొప్ప అవార్డు. పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలి. ఉపాధ్యాయుల పట్ల గౌరవం పెరగాలంటే మరింత కష్టపడి పనిచేయాలి. సమాజంలో మమేకమై పనిచేయాలి. అప్పుడే ప్రభుత్వ స్కూళ్లు, ఉపాధ్యాయులకు మనుగడ ఉంటుంది. బోధనతోపాటు సమాజంలో ఉన్న సమస్యలపైనా స్పందించాలి.’అని వెంకట్ చెప్పారు.
అందుకే ఉపాధ్యాయుల్లో అసంతృప్తి
‘పదేండ్లలో బీఆర్‌ఎస్ పాలనలో ఉపాధ్యాయులు విసిగివేసారిపోయారు. విద్యారంగాన్ని పట్టించుకో లేదు. ఉపాధ్యాయుల సమస్యలు చెప్పే అవకాశం లేదు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో సమస్యలు పరిష్కారమవుతాయన్న విశ్వాసం పెరిగింది. అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా పరిష్కారం కాకపోవడంతో ఉపాధ్యాయుల్లో అసంతృప్తి ఉన్నది. హామీలు ఇచ్చేటపుడే పార్టీలు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేర్చాలి. హైకోర్టులో ఉన్న అడ్డంకులను తొలగించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. బదిలీలు చేపట్టింది. ఉపాధ్యాయ నియామకాలు చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మంగళవారం జరిగిన సమావేశంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్ బిల్లుల కోసం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఆరోగ్య కార్డులు ఇస్తామన్నారు. దీంతో ప్రభుత్వంపై సానుకూల దృక్పథం ఏర్పడింది.’అని వెంకట్ వివరించారు.
ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలి
‘ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. ప్రభుత్వ స్కూళ్లలో ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులే ఎక్కువ మంది చదువుతారు. నాణ్యమైన బోధనను అందించాలి. అయితే ప్రభుత్వం ఎస్సీ పిల్లలను బెస్ట్ అవైలబుల్ పేరుతో ప్రయివేటు స్కూళ్లను ఎంపిక చేసి చదివిస్తున్నది. ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తున్నది. ప్రయివేటు విద్యాసంస్థలకు ఫీజులు కేటాయించడం సరైంది కాదు. దానివల్ల ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. పిల్లల సంఖ్య తగ్గుతున్నది.’అని వెంకట్ అన్నారు.