నవతెలంగాణ-తలకొండపల్లి: గ్రామ ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన త్రాగునీరు అందించడం తమ లక్ష్యమని సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చీపునుంతల గ్రామంలోని నూతనంగా ఏర్పాటు చేసిన మూడో వార్డులో.. మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ, ఉపసర్పంచ్ గుమ్మడి రాజు స్థానిక నాయకులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మాజీ సర్పంచ్ బండి రఘుపతి తన వంతుగా రూ.50వేల రూపాయలు మంజూరు చేశారని చెప్పారు. కాలనీలలో సురక్షితమైన, నాణ్యమైన త్రాగునీరు అందించడానికి దోహదం చేస్తుందన్నారు. గ్రామ అభివృద్ధికి దాతల సహాయ, సహకారాలు ఉండాలని సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ కోరారు. గ్రామ అభివృద్ధికి కృషిచేస్తున్న మాజీ సర్పంచ్ బండి రఘుపతి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గుజ్జుల మహేష్, వార్డు సభ్యులు శ్రీరామ్, అల్వాల్ రెడ్డి, రాజు, శారద, అంజమ్మ, కార్యదర్శి యాదగిరి, గ్రామ నాయకులు వెంకట్రాజిరెడ్డి, రామచంద్ర రెడ్డి, చెన్నకేశవులు, నరసింహ, స్వామి, యాదమ్మ, శివ ,సాయినాథ్, అలివేల, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.



