నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు మాట్లాడుతూ .. పాఠశాల చుట్టూ దాదాపు 90 మీటర్ల మేర ప్రహరీ గోడను నిర్మించి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
ప్రహరీ గోడ నిర్మాణంతో పాఠశాలకు భద్రత మరింత పెరుగుతుందని, విద్యార్థులు అనవసరంగా బయటకు వెళ్లకుండా పాఠశాల పరిధిలోనే ఉండగలుగుతారని చెప్పారు. అలాగే కుక్కల బెడద తగ్గడంతో పాటు బయటి వ్యక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నియంత్రణ ఏర్పడుతుందని, పాఠశాల ప్రశాంతంగా సాగేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం ఇస్తారు,వార్డు సభ్యులు కొత్తపల్లి రేణుక మైసయ్య,చౌడబోయిన లావణ్య రవి,చౌడబోయిన కనకయ్య, చౌడబోయిన మహేష్,ఆంజనేయులు, పోతారం కనకయ్య పాల్గొన్నారు. అలాగే పాఠశాల హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు, వడ్ల నితిన్, చౌడబోయిన రాజు, మహేందర్, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.



