Friday, June 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపెరుగుతున్న అంతరం

పెరుగుతున్న అంతరం

- Advertisement -

ట్రంప్‌ బిల్లుపై మస్క్‌ కన్నెర్ర
అది అసహ్యకరమైన రోత బిల్లు అంటూ మండిపాటు
వాషింగ్టన్‌ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేసిన పన్ను-వ్యయ బిల్లుపై ఆయన సన్నిహితుడు, బిలియనీర్‌ ఎలన్‌ మస్క్‌ మరోసారి మండిపడ్డారు. దీనిని అసహ్యకరమైన రోత బిల్లుగా అభివర్ణించారు. మస్క్‌ వ్యాఖ్యలను చూస్తుంటే ట్రంప్‌తో నెలకొన్న విభేదాలు పూడ్చలేని స్థాయికి చేరాయని అర్థమవుతోంది. అమెరికా బడ్జెట్‌లో అనేక ట్రిలియన్‌ డాలర్ల పన్ను మినహాయింపులు, మరిన్ని రక్షణ ఖర్చులు ఉన్నాయి. అదే సమయంలో అదనపు రుణాలు తీసుకునేందుకు ఈ బడ్జెట్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తోంది. దీన్ని గత నెలలో ప్రతినిధుల సభ సమర్పించింది. అయితే ‘దీనికి ఓటు వేసిన వారు సిగ్గు పడాలి’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మస్క్‌ ధ్వజమెత్తారు. ట్రంప్‌ రెండో పదవీ కాలపు అజెండాపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన వరుసగా పోస్టులు పెడుతూ వ్యయ బిల్లు ‘దారుణంగా ఉంది… పంది మాంసంతో నిండిపోయింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా రాజకీయాల్లో పంది మాంసం అనే పదం శాసనకర్తల నియోజకవర్గాల్లో ప్రాజెక్టులపై చేసే ఖర్చును సూచిస్తుంది.
ఇప్పటికే ఉన్న బడ్జెట్‌ లోటును ఈ బిల్లు రెండున్నర ట్రిలియన్‌ డాలర్లకు పెంచుతుందని, అమెరికా పౌరులపై మోయలేని రుణ భారాన్ని మోపుతుందని మస్క్‌ అన్నారు. అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ట్రంప్‌ ఏర్పాటు చేసిన డోజ్‌లో మస్క్‌, ఆయన బృందం 129 రోజులు పనిచేసింది. గతవారం ఆయన అకస్మాత్తుగా బాధ్యతల నుండి వైదొలిగారు. ప్రభుత్వం నుండి బయటికి వచ్చిన తర్వాత ట్రంప్‌పై మస్క్‌ తన అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. ట్రంప్‌ ప్రణాళిక నిరుత్సాహపరుస్తోందని ఆయన గతంలోనే వ్యాఖ్యానించారు. ‘ట్రంప్‌ అజెండాను కొందరు రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. వారిని వ్యతిరేకించే వారికి ఆర్థికంగా మద్దతు ఇస్తాను’ అని గతంలో ప్రతినబూనిన మస్క్‌ …. తాజా పోస్టులో రాజకీయ హెచ్చరికలు చేశారు. వచ్చే నవంబరులో అమెరికా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు.
ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే…
ట్రంప్‌ బిల్లును ఎలన్‌ మస్క్‌ వ్యతిరేకించడానికి పలు కారణాలు ఉన్నాయి. మస్క్‌ నేతృత్వంలోని టెస్లా వంటి కార్ల తయారీ సంస్థలకు ఉపకరిస్తున్న ఎలక్ట్రిక్‌ వాహనాల ట్యాక్స్‌ క్రెడిట్‌ను ట్రంప్‌ బిల్లు తగ్గిస్తోంది. తన కంపెనీ తరఫున లాబీయింగ్‌ చేయడానికి ఏప్రిల్‌ చివరి నాటికి మస్క్‌ కంపెనీ 2,40,000 డాలర్లు ఖర్చు చేసింది. బిల్లులో కొన్ని చర్యలు చేపట్టాలని మస్క్‌ తెర వెనుక సూచించినప్పటికీ ఫలితం లేకపోయింది. శ్వేతసౌధంలో మస్క్‌ ‘ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగి’ హోదాలో పనిచేశారు. జీతం భత్యం లేని ఆయన పదవీకాలాన్ని చట్టం ద్వారా 130 రోజులకు పరిమితం చేశారు. పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు మస్క్‌ ప్రయత్నించారు కానీ అందుకు శ్వేతసౌధం అధికారులు ససేమిరా అన్నారు. తన స్టార్‌లింక్‌ ఉపగ్రహ వ్యవస్థను జాతీయ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌లో ఉపయోగించాలని మస్క్‌ కోరుకున్నారు. అయితే ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. తాజాగా నాసా అధినేత పదవికి మస్క్‌ సన్నిహితుడైన జేర్డ్‌ ఐసాక్‌మాన్‌ నామినేషన్‌ను ట్రంప్‌ వెనక్కి తీసుకోవడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి.
ఐసాక్‌మాన్‌ నామినేషన్‌ ఉపసంహరణ నిర్ణయం వెనుక శ్వేతసౌధంలో మస్క్‌తో తరచూ విభేదించిన అధికారి సెర్గియో గార్‌ ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. డెమొక్రాట్లకు ఐసాక్‌మాన్‌ విరాళాలు అందించే వారని, ఈ నేపథ్యంలోనే ఆయన విషయంలో సెనెటర్లు ఆందోళన వ్యక్తం చేశారని తెలుస్తోంది. కాగా మస్క్‌ తాజా వ్యాఖ్యలపై శ్వేతసౌధం స్పందించింది. బిల్లుపై మస్క్‌ వైఖరి ఏమిటో ట్రంప్‌కు తెలుసునని ఓ అధికారి తెలిపారు. ఇది అతి పెద్ద, అందమైన బిల్లు అని ఆమె అన్నారు. దానికే ట్రంప్‌ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. ఏదేమైనా మస్క్‌ వ్యాఖ్యలు రిపబ్లికన్లలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు రిపబ్లికన్లు ట్రంప్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -