నవతెలంగాణ-హైదరాబాద్: బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జిఎస్‌టి కౌన్సిల్ 56వ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ఈ కౌన్సిల్‌లో జిఎస్‌టి సంస్కరణలపై చర్చించనున్నారు. ప్రధానంగా మానవ వినియోగ వస్తువులపై పడే పన్నుల రేట్లపైనా, వస్త్రాలు వంటి పలు రంగాలు, ఎంఎస్‌ఎంఇలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించే విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా రాబోయే రెండు రోజుల్లో పన్నుల శ్లాబులను తగ్గించడంపై జిఎస్‌టి కౌన్సిల్‌లో చర్చించనున్నారు. ప్రధానంగా 12 శాతం, 28 శాతం శ్లాబులను 5 శాతం, 18 శాతం తగ్గించడంపై చర్చ జరగనుంది. పొగాకు, అల్ట్రా లగ్జరీ వస్తువులతో సహా కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించేలా కేంద్రం ప్రతిపాదించనుంది. 12 శాతం శ్లాబు కింద ఉన్న బట్టర్, ఫ్రూట్ జ్యూస్‌లు, డ్రైఫూట్స్ వంటివి 99 శాతం వస్తువులు 5 శాతం కిందకు తెచ్చేలా కేంద్రం ప్రతిపాదించనుంది. 28 శాతం శ్లాబు కింద ఉన్న ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషన్‌లు, గూడ్స్ వస్తువులైన సిమెంట్ ఇతర 90 శాతం వస్తువులు 18 శాతం శ్లాబుకి మార్చేలా నిర్మలా సీతారామన్ ఈ కౌన్సిల్‌లో ప్రతిపాదించనుంది. కేంద్ర ప్రతిపాదనలకు ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీ అయిన టిడిపి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు.
మరోవైపు ప్రతిపక్షాలిత రాష్ట్రాలకు అందాల్సిన నిధులపైన, ఆదాయాలపైన, జిఎస్‌టి రేటు సంస్కరణలపైన వారు లేవనెత్తాల్సిన అంశాలపై హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ఆర్థికమంత్రులు కౌన్సిల్ సమావేశానికి ముందు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిఎస్‌టి రేటు సంస్కరణ ప్రతిపాదన అమలు చేస్తే.. తమ రాష్ట్రం రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోవాల్సి వస్తుందని జార్ఖండ్ ఆర్థికమంత్రి రాధాకృష్ణ కిషోర్ మీడియాకు వెల్లడించారు.