రిటైర్డ్ టీచర్ల నియామకంపై సర్క్యులర్ ఉపసంహరణ
గాంధీనగర్ : రాష్ట్రంలోని ప్రభుత్వ సెకండరీ, హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి పదవీ విరమణ చేసిన ఉపాధ్యా యులను నియమించాలని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో భూపేంద్ర పటేల్ సర్కార్ వెనక్కి తగ్గింది. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. రిటైర్డ్ టీచర్లను నియమించాలన్న నిర్ణయంపై టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (టెట్), టీచర్ ఆప్టిట్యూట్ టెస్ట్ (టాట్)లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అంతకుముందు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఖాళీల భర్తీకి రిటైర్డ్ టీచర్లను తీసుకోవడమేమిటంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకం తర్వాత కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుసుకున్న ప్రభుత్వం పదవీ విరమణ చేసిన టీచర్ల సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. పదకొండు నెలల కాంట్రాక్టుపై రిటైర్డ్ ఉపాధ్యాయులను నియమించుకునేందుకు వీలుగా రాష్ట్ర విద్యా శాఖ ఈ నెల 25న ఓ సర్క్యులర్ జారీ చేసింది. టెట్, టాట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వేలాది మంది యువతీ యువకులు శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిసి కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ చర్యపై నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగార్థులు మండిపడ్డారు. అర్హులైన అభ్యర్థులను ప్రభుత్వం పక్కన పెడుతోందని ఆరోపించారు.
‘టెట్, టాట్ ఉత్తీర్ణులైన యాభై వేలకు పైగా యువతీ యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. 30,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం తాత్కాలిక కాంట్రాక్టులను రిటైర్డ్ టీచర్లకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది చాలా దారుణం. యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని దీంతోతేలిపోయింది’ అని కాంగ్రెస్ ప్రతినిధి హిరేన్ బంకర్ విమర్శించారు. ఉద్యోగార్థులు, ప్రతిపక్షాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం 48 గంటల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది.
నిరసనలతో వెనక్కి తగ్గిన గుజరాత్ ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -