వారు పంపే డబ్బుతో దేశ ఆర్థిక వ్యవస్థకు బలం
రూపాయి విలువను నిలబెట్టడంలో తోడ్పాటు
అక్కడ పని చేస్తున్నవారు 90 లక్షల మంది
వారి నుంచి భారత్‌కు ఏటా 125 బిలియన్ డాలర్లు
అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంతో ఆందోళన
ఉద్రిక్తతలు కొనసాగితే నష్టం తప్పదు
విశ్లేషకులు, నిపుణుల హెచ్చరికలు
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ప్రభావం భారత్ పైనా పడుతోంది. గల్ఫ్ ప్రాంతంలో లక్షలాది మంది భారతీయులు పని చేస్తుంటారు. వీరు ఏటా భారత్‌లోని తమ కుటుంబాలకు పెద్ద ఎత్తున డబ్బులు పంపుతుంటారు. ఇది పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో బలాన్ని అందిస్తోంది.
అయితే తాజా దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో ఉంటున్న భారతీయుల భద్రత, వారి ఉద్యోగ, ఉపాధి, వ్యాపారా లపై ఆందోళన నెలకొన్నది. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకు తున్న నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమవుతుందనీ, అది అక్కడి భారతీయులతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ పైనా భారంగా మారుతుందని నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ : పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సుమారు 90 లక్షల మందికి పైగా భారతీయులు పని చేస్తున్నారు. వారు ప్రతి ఏడాదీ సుమారు 125 బిలియన్ డాలర్లు భారత్‌కు పంపుతున్నారు. దీంతో వారు తమ కుటుంబాలను మాత్రమే కాదు.. భారత ఆర్థిక వ్యవస్థను కూడా నిలబెడుతున్నారు. అయితే ఇటీవల అమెరికా-ఇజ్రాయిల్ దాడుల కారణంగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరగడం గల్ఫ్ ప్రాంతంలో అస్థిరతకు దారి తీస్తోంది. దీని ప్రభావం అక్కడ ఉన్న భారతీయుల జీవనోపాధిపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
అమెరికా కంటే గల్ఫ్‌లోనే ఎక్కువ మంది భారతీయులు
1970లలో గల్ఫ్ దేశాల్లో చమురు బూమ్ ప్రారంభమైనప్పటి నుంచి భారతీయులు భారీ సంఖ్యలో అక్కడికి వలస వెళ్లడం ప్రారంభించారు. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో సుమారు 93 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇది అమెరికాలో ఉన్న భారతీయుల సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువే కావడం గమనార్హం. ఇటీవల అమెరికా, ఇజ్రాయిల్.. ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రతిగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడంతో గల్ఫ్ ప్రాంతంలోని పలు దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి దగ్గర నౌకాయానం దాదాపు నిలిచిపోయింది. ఇది పలు దేశాలపై ప్రభావాన్ని చూపుతోంది. గల్ఫ్ ప్రాంతంలోని ప్రధాన నగరాలు, ముఖ్యంగా దుబారు వంటి వ్యాపార కేంద్రాలు కొంత కాలం స్థంభించిపోయాయి. విమానాశ్రయాలు, స్టాక్ మార్కెట్లు కూడా ప్రభావితమయ్యాయి.
విదేశీ మారకద్రవ్య ప్రవాహం అవసరం
గల్ఫ్ దేశాలు భారత్‌కు చమురు సరఫరా చేసే ప్రాంతాలే కాదు. అక్కడ పని చేస్తున్న భారతీయులు పంపే డబ్బు కూడా భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ప్రతి సంవత్సరం విదేశాల్లో ఉన్న భారతీయులు కలిపి 125 బిలియన్ డాలర్లకు పైగా దేశానికి పంపుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడం గమనార్హం. ఈ డబ్బు భారత రూపాయి విలువను నిలబెట్టడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా భారత్ పెద్ద మొత్తంలో విదేశీ వస్తువులు, ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకునే నేపథ్యంలో ఈ విదేశీ మారకద్రవ్య ప్రవాహం చాలా అవసరమని విశ్లేషకులు చెప్తున్నారు.
పలు రంగాల్లో లక్షలాది మంది
గల్ఫ్ ప్రాంతంలో భారతీయులు పలు రంగాల్లో పని చేస్తున్నారు. కొందరు పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదిగారు. ఉదాహరణకు, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ వంటి కంపెనీలు గల్ఫ్‌లో పెద్ద వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించాయి. మరోవైపు లక్షలాది మంది తక్కువ వేతనాలతో నిర్మాణం, రవాణా, గృహ సేవల రంగాల్లో పని చేస్తున్నారు. ఒమన్ వంటి దేశాల్లో కొంత మంది కార్మికులు నెలకు 390 నుంచి 520 డాలర్ల వరకు సంపాదిస్తారు. అందులో 50 నుంచి 70 శాతం వరకు తమ కుటుంబాల కోసమని భారత్‌కు పంపుతారు. ఆ డబ్బుతో వారి కుటుంబాలు ఇండ్లు కట్టుకోవడం, పిల్లల చదువులు, పెండ్లిండ్ల ఖర్చుకు ఉపయోగిస్తున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన ఆర్థిక విధానాలు భారత్‌కు తీవ్ర నష్టాన్ని చేస్తున్నాయి. ఇటీవల అమెరికా విధించిన టారిఫ్‌ల వల్ల రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. అంతేకాకుండా అమెరికా ఒత్తిడికి తలొగ్గిన కేంద్రంలోని మోడీ సర్కారు… రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలును తగ్గించింది. దీంతో భారత్ మళ్లీ గల్ఫ్ దేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇదే సమయంలో చమురు ధరలు పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో పని చేస్తున్న భారతీయులు పంపే డబ్బు భారత్‌కు అత్యంత విశ్వసనీ యమైన విదేశీ మారకద్రవ్య వనరుగా మారింది. అయితే గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే అక్కడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. అలా జరిగితే అక్కడ పని చేస్తున్న భారతీయులు మాత్రమే కాకుండా భారత్ కూడా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



